దేవరకద్ర, న్యూస్‌లైన్ : మండలంలోని పె ద్ద గోప్లాపూర్, పెద్ద రాజమూర్ గ్రామాల్లో చాపకింద నీరులా చికెన్‌గున్యా వ్యాధి వ్యాపిస్తోంది. ఈ నెల మొదటి వారం గోప్లాపూర్‌లో వ్యాధి బారిన పడి పలువురు మంచం పట్టిన సంగతి తెలిసిందే.
వైద్య బృందం వారం రోజుల పాటు గ్రామంలో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసి వ్యాధిని అదుపులోకి తెచ్చారు. రెండు వారాల్లోపే మళ్లీ పలువురు వ్యాధితో మంచం పట్టారు. బుధవారం గోపాల్, ఆయన భార్య శాంతమ్మలు కాళ్లు, కీళ్లనొప్పులతో బాధపడుతూ స్థానిక పీహెచ్‌సీకి వచ్చారు. మిగతావారు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సలు చేయించుకుంటున్నారు.
అలాగే పెద్ద రాజమూర్ గ్రామంలోనూ రెండు వారాల క్రితం ప్రజలు వ్యాధిబారిన పడ్డారు. వారంతా ప్రైవేట్‌లో వైద్య సేవలు పొంది వ్యాధి నుంచి ఉపశమనం పొందారు. మళ్లీ బుధవారం పలువురు కీళ్ల నొప్పులు, ఒళ్లు నొప్పులు, జ్వరంతో బాధ పడుతూ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల చుట్టు తిరుగుతున్నారు.
వైద్యశాఖ ఇలాంటి సందర్భాల్లో శిబిరాలను ఏర్పాటు చేస్తుందేగానీ వ్యాధి సోకడానికి గల కారణాలను ప్రజలకు తెలియజేయలేకపోతోంది. ఈ విషయంపై జిల్లా వైద్యాధికారులు వెంటనే స్పందించి రెండు గ్రామాల్లో వ్యాధి అదుపులోకి వచ్చేవరకు శిబిరాన్ని ఏర్పాటు చేసి సేవలందించాల్సిన అవసరముంది.