
సీఎం సభకు వెళ్తున్న బస్సు ఢీకొని బాలుడి దుర్మరణం
మదనపల్లె: చిత్తూరు జిల్లా మదనపల్లె మండలంలో గురువారం ముఖ్యమంత్రి సభకు జనాన్ని తరలించే బస్సు ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ప్రమాదంలో పురుషోత్తం(5) అనే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల కథనం మేరకు... కురబలకోటలో జరిగే సీఎం సభకు రామసముద్రం నుంచి టీడీపీ కార్యకర్తలను బస్సులో తరలిస్తున్నారు. ఆ బస్సు దాదినాయునితాండ వద్ద ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని బస్సు ఢీకొంది.
ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం నడుపుతున్న మదనపల్లె మండలం కృష్ణాపురానికి చెందిన పి. ఈశ్వర్ (45), వెనుక కూర్చుని ఉన్న పవన్(12), ఈశ్వర్ తమ్ముడి కుమారుడు పురుషోత్తం(5) తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించగా, పురుషోత్తం అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈశ్వర్, పవన్ చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.