వివాహ వయస్సు రాకుండానే కొందరు తల్లిదండ్రులు తమ కుమార్తెలకు పెళ్లి చేసేందుకు వెనుకాడడం లేదు. ఫలితంగా ఆ బాలికలు అమూల్యమైన బాల్యాన్ని కోల్పోవడమే కాకుండా..
రాయవరం : వివాహ వయస్సు రాకుండానే కొందరు తల్లిదండ్రులు తమ కుమార్తెలకు పెళ్లి చేసేందుకు వెనుకాడడం లేదు. ఫలితంగా ఆ బాలికలు అమూల్యమైన బాల్యాన్ని కోల్పోవడమే కాకుండా.. తీవ్ర శారీరక, మానసిక హింసకు గురవుతున్నారు.
మారని ఆలోచనలు
కాలం మారుతున్నా సమాజంలో తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పు రావడం లేదు. ఆడపిల్లలను పెళ్లి చేసి, వదిలించుకోవాలన్న భావన నేటికీ అధిక శాతం ఆడపిల్లల తల్లిదండ్రుల్లో ఉంది. పదో తరగతి పూర్తవ్వగానే పెళ్లిళ్లు చేస్తున్నారు. వేసవికాలంలో అధికంగా బాల్య వివాహాలు జరుగుతున్నట్టు అధికారులు గుర్తించడం ఇందుకు బలం చేకూరుస్తోంది. చట్ట ప్రకారం ఆడపిల్లకు 18 ఏళ్లు పూర్తయ్యాకే పెళ్లి చేయాలి.
స్పందన అంతంతమాత్రం
నిరక్షరాస్యులతో పాటు విద్యావంతులైన తల్లిదండ్రులు కూడా ఎక్కువగా బాల్య వివాహాలకు పూనుకోవడం అధికారులను విస్మయ పరుస్తోంది. ధనిక వర్గాల వారు కూడా బాల్య వివాహాలకు మొగ్గుచూపుతున్నారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నా, అంతంతమాత్రంగానే స్పందన ఉంటోంది. గ్రామాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో కూడా బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నట్టు అధికారుల పరిశీలనలో తేలింది. సామర్లకోట, తాళ్లరేవు, పిఠాపురం తదితర ప్రాంతాల్లో కూడా ఇవి ఎక్కువగా ఉన్నాయి.
ఎందుకు చేయరాదంటే..
చిన్న వయస్సులో పెళ్లిళ్లు చేయడం వల్ల ఆడపిల్లలకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తుతాయి. చదువు, ఆటపాటలతో ఎదగాల్సిన బాలికలు బలహీనమవుతారు. శారీరక, మానసిక పరిపక్వత లేని సమయంలో గర్భం ధరించడంతో మాతా, శిశుమరణాలు అధికంగా చోటుచేసుకుంటున్నాయి. బాల్య వివాహాలతో వారి హక్కులు చిన్నతనంలోనే ఉల్లంఘించబడుతున్నాయి.
ఐసీడీఎస్‌దీ కీలకపాత్రే..
బాల్య వివాహాలను అడ్డుకోవడంలో స్త్రీ, శిశు సంక్షేమశాఖ(ఐసీడీఎస్)ది కీలకపాత్ర. అంగన్‌వాడీ కార్యకర్తలు బాల్య వివాహాలను గుర్తిస్తే, ఉన్నతాధికారులతో పాటు పోలీసులకు సమాచారమివ్వాలి. బాల్య వివాహాలపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసే అధికారం అంగన్‌వాడీ వర్కర్లు, సూపర్‌వైజర్లకు ఉంది. కొన్నిచోట్ల బాల్య వివాహాలను అడ్డుకుంటున్న అంగన్‌వాడీ కార్యకర్తలపైన, అధికారులపైన బాల్య వివాహాలు చేసే తల్లిదండ్రులు దాడులకు పూనుకుంటున్నారు.
చట్టం ఏం చెబుతుందంటే..
బాల్య వివాహాల నిరోధక చట్టం 1929లో వచ్చింది. కోరలు లేని చట్టంగా మిగిలిపోవడంతో 2006లో ప్రభుత్వం నూతన చట్టాన్ని ప్రవేశపెట్టింది. బాలికను పెళ్లి చేసుకున్న వ్యక్తితో పాటు ఇరుపక్షాల తల్లిదండ్రులు, పెళ్లి చేసిన మతపెద్దలతో పాటు వివాహానికి హాజరైన కులపెద్దలు, బంధుమిత్రులు, ఫొటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్, షామియానాలు సపై ్ల చేసే వారిపై కూడా కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. గ్రామస్థాయిలో వీఆర్‌ఓ, మండల స్థాయిలో అంగన్‌వాడీ సూపర్‌వైజర్, తహశీల్దారు, ఎంపీడీఓ, సీడీపీఓ, డివిజన్ స్థాయిలో ఆర్డీఓ, జిల్లా స్థాయిలో కలెక్టర్ బాల్య వివాహాల నిరోధక అధికారులుగా ఉన్నారు. బాల్య వివాహం జరిగిన రెండేళ్ల వరకు కేసు నమోదు చేయవచ్చు.
సమాచారమిస్తే అడ్డుకుంటాం
బాల్య వివాహాలు జరుగుతున్నట్టు సమాచారమిస్తే తప్పనిసరిగా అడ్డుకుంటాం. బాల్య వివాహాలు జరగకుండా అంగన్‌వాడీ కార్యకర్తల ద్వారా మరింత అవగాహన కల్పిస్తాం.
- పి.విజయలక్ష్మి, ప్రాజెక్టు డెరైక్టర్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, కాకినాడ