మండపేట కాలువలో ప్రమాదకర పరిస్థితుల్లో స్నానం చేస్తున్న చిన్నారులు
రాయవరం (మండపేట), కాకినాడ రూరల్ : గతేడాది ఫిబ్రవరిలో అనపర్తిలోకాలువ స్నానానికి దిగి ఎనిమిదో తరగతి చదువుతున్న ఇరువురు విద్యార్థులు అసువులు బాశారు. అదే రోజు గొల్లప్రోలులో ఏలేరు కాలువలో స్నేహితులతో కలిసి స్నానానికి వెళ్లి పదో తరగతి బాలుడు మృతి చెందాడు. రాజమహేంద్రవరం వద్ద గోదావరిలో స్నానానికి దిగి నాలుగేళ్లుగా సుమారు 20 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు.
వీరందరూ సరదాగా కాలువల్లోకి దిగిన వారే.. స్నానం చేద్దాం.. కాసేపు ఈత కొడదాం అన్నట్టుగా దిగి కాలువల్లో, నదుల్లో లోతు అంచనా తెలియక ప్రాణాలు కోల్పోయిన వారే. మండే ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు పలువురు చిన్నారులు, యువకులు కాలువలు, నదులు, సముద్రం, ఉప్పుటేర్లు, చెరువులు, రిజర్వాయర్లు, నీటి ప్రాజెక్టులలో స్నానాలు చేసేందుకు ఈత కొట్టేందుకు ప్రాధాన్యమిస్తారు. నదులు, కాలువలు, చెరువుల్లో ఈత కోసం దిగి ఏటా జిల్లాలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు.
ఈ చర్యలు ప్రమాదం..
♦ పలువురు చిన్నారులు కాలువల్లో స్నానాలు చేసే సమయంలో నలుగురిని చూసి కేరింతలు కొడుతూ ప్రమోదాలకు పోతున్నారు. ప్రమాదకర ఫీట్స్ చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.∙
వేగంగా పరుగెత్తుకుని వచ్చి కాలువల్లో దూకడం, వంతెనలు, చెట్ల కొమ్మలపైకి ఎక్కి కాలువల్లో దూకడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు.
∙కాలువల లోతు అంచనా వేయలేని సమయంలోను, ఊబి ఉన్న చోట్ల దూకినప్పుడు, కాలువల్లో రాళ్లు, పదునైన..ప్రమాదకర వస్తువులు ఉన్నప్పుడు ప్రాణాపాయం సంభవించే పరిస్థితి తలెత్తే అవకాశాలు ఉన్నాయి.
పెద్దలు అప్రమత్తంగా ఉండాలి..
♦ పిల్లల కదలికలపై పెద్దలు అప్రమత్తంగా ఉండాలి.
♦ ‘పెద్దలు పిల్లల కదలికలు గమనిస్తే చాలా వరకు ప్రమాదాలను నివారించే వీలుంటుంది. ‘గ్రామీణ ప్రాంతాల్లో చిన్నారుల తల్లిదండ్రులు ఎక్కువగా పనిపాటల్లోకి వెళ్తుంటారు.
♦ ఆ సమయంలో చిన్నారులు కాలువల వద్దకు వచ్చి ఈత సరదా తీర్చుకుంటున్నారు. పిల్లల ఈత సరదాను పెద్దల పర్యవేక్షణలో తీర్చుకుంటే కొంత వరకు ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చు.
♦ కాలువల రేవుల వద్ద, చిన్నారులు ఎక్కువుగా స్నానాలు చేసే ప్రదేశంలో అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. పంచాయతీలు, ఇరిగేషన్ శాఖలు సంయక్తంగా కాలువ రేవుల వద్ద రక్షణగా ఐరన్ పోల్స్ నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలి.
ఆపద నుంచి ఇలా రక్షించవచ్చు..
♦ రక్షించబోయే వ్యక్తికి ఈత రావడంతో పాటు ధైర్యం కలిగి ఉండాలి.
♦ నీటిలో మునుగుతున్న వ్యక్తి వెనుక నుంచి వెళ్లి అతడి వెంట్రుకలు, అండర్‌వేర్, మొలతాడు వంటి వాటిల్లో ఏదో ఒకటి పట్టుకుని ఒడ్డకు తీసుకురావాలి.
♦ ఈతకు వచ్చిన వారితో పాటు రాని వారు కూడా నీటిలో మునుగుతున్న వారిని రక్షించవచ్చు. నీటిలోకి దిగకుండా ఒడ్డు నుంచే దేన్నైనా పట్టుకునేలా అందించాలి.
♦ ♦ దగ్గరగా ఉంటే కర్ర, టవల్, ఫ్యాంట్ వంటివి, దూరంగా ఉంటే తాడు, పొడవాటి కర్రను అందించాలి.
ప్రథమ చికిత్సఅత్యవసరం
నీటిలో ప్రమాదానికి గురైన వ్యక్తిని ఒడ్డుకు చేర్చగానే అతడిని వెల్లకిలా పడుకోబెట్టాలి. అవసరమైతే నోట్లో నోరు పెట్టి శ్వాసను ఊడుతూ కృత్రిమ శ్వాస అందించాలి. ఛాతిపై చేతులతో ఒత్తాలి. దీంతో శ్వాస పెరుగుతుంది. ప్రథమ చికిత్స చేస్తూనే వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యలకు చూపించాలి.
తప్పక పాటించాల్సినవి..
♦ కొలనుల్లో ఈత నేర్చుకునేందుకు వెళ్లేటప్పడు అక్కడ సుశిక్షతులైన కోచ్‌లు, ఇతర సిబ్బంది రక్షణ చర్యలు ఉన్నాయో లేదో పెద్దలు పరిశీలించాల్సిన తర్వాతే పిల్లలకు పంపించారు.
♦ సముద్రాలు, చెరువులు, కాల్వల్లో, ఈతకు వెళుతున్నప్పుడు బాలల వెంట పెద్ద వారు తప్పక వెళ్లాలి.
♦ కొత్త ప్రదేశంలో సముద్రం, చెరువులు, ఉప్పుటేర్లు, కాలువల్లో ఈత కొట్టే ముందు కర్రసాయంతో లోతును పరిశీలించాలి.
♦ ఈత రాని వారు దానిని నేర్చుకునేందుకు ట్యాబ్‌లు, ఇతర పరికరాలను ఉపయోగించి పూర్తిగా ఈత కొట్టడం వచ్చాకే లోతుకు వెళ్లాలి.
♦ మట్టిని లోతుగా తవ్విన ప్రాంతాల్లో నిలిచిన నీటిలో లోతు తెలియదు. కాబట్టి ఇలాంటి వాటిల్లో ఈతకు సాహనం చేయరాదు.
Comments
Please login to add a commentAdd a comment