పాకెట్ మనీకి నిశ్‘చింత’!
వేసవి సెలవులిచ్చారు. గిరి బాలలు బడుల నుంచి ఇళ్లకు చేరారు. ఇంటి వద్ద ఆటపాటల్లో మునిగితేలుతున్నారు. చిరుతిళ్లు, అవసరమైన వస్తువులు కొనుక్కునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వీటికి పాకెట్ మనీ కావాలి. తల్లిదండ్రులను అడిగేకంటే వాటిని తామే సంపాదించుకుంటే ఎలా ఉంటుందని చక్కని ఆలోచన చేశారు. చింతచిగురు సేకరించి అమ్మితే పాకెట్‌మనీకి ఇబ్బంది ఉండదని యోచించారు. అనుకున్నదే తడవుగా ఆచరణలో పెట్టారు. ఉదయాన్నే నిద్రలేచి గ్రామాల్లోని చింతచెట్లు ఎక్కి లేత చింతచిగురు కోస్తున్నారు.
దానిని సంచిలో వేసుకుని మండలకేంద్రానికి వచ్చి అక్కడి మెయిన్‌రోడ్ సెంటర్‌లో కుప్పలుగా పోసి ఒక్కో కుప్పను రూ.పదికి విక్రయిస్తున్నారు. ఇలా ప్రతిరోజూ ఒక్కొక్కరూ రూ.వంద నుంచి రూ.రెండు వందల వరకు సంపాదిస్తున్నారు. వాటిని తమ అవసరాలకు వినియోగిస్తున్నారు. కొందరు చింతచిగురుతోపాటు ముంజుకళ్లు కూడా సేకరించి విక్రయిస్తున్నారు. చిన్నారులు విక్రయించే చింతచిగురు ఎంతో లేతగా వుంటుందని, దీనిని పప్పు, మటన్, బోటీలో వేసుకుని వండుకుంటే ఎంతో రుచిగా ఉంటుందని కొనుగోలుదారులు చెబుతున్నారు.
- చింతూరు