పిల్లలు శారీరక, మానసిక అభివృద్ధి సాధించినపుడే ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.. అపుడు మాత్రమే విద్యపై దృష్టి సారిస్తారు... తద్వారా పిల్లల సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుంది... ఇది ప్రభుత్వ ఉద్దేశం. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది.
సాక్షి, నల్లగొండ : విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రవేశపెట్టిన ‘జవహర్ బాల ఆరోగ్య రక్ష’ పథకం పిల్లల చెంతకు చేరడం లేదు. ఈ పథకం ప్రవేశపెట్టి మూడేళ్లు గడుస్తున్నా ఏ పాఠశాలలోనూ సక్రమంగా అమలు చేస్తున్న దాఖలాలు లేవు. పథకంలో నిర్ణయించిన ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి చదువుతున్న బాలబాలికలకు ఏడాదికి రెండుసార్లు సంపూర్ణ ఆరోగ్య పరీ క్షలు నిర్వహించాలి.
జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మొదటిసారి. నవంబర్, డిసెంబర్, జనవరిలో రెండో విడతలో పరీక్షలు చేయాలి. సాధారణ వ్యాధులను గుర్తించి చికిత్స అందజేయాలి. అందుకు అవసరమైన మందులు సమకూర్చాలి. తీవ్ర వ్యాధులు ఏమైనా ఉన్నట్లు పరీక్షల్లో తేలితే మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి పంపాలి. మండల వైద్యాధికారి, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది, దీని పరిధిలో ఉన్న పాఠశాల ఉపాధ్యాయులు సంయుక్తంగా ఈ పని చేయాలి. పీహెచ్‌సీ పరిధిలోని పాఠశాలల్లో ప్రతి గురువారం పరీక్షలు నిర్వహించాలి. అంటే మూడు నె లల్లో ప్రతి పాఠశాలలోని విద్యార్థిని ఒకసారి పరీక్షించాల్సి ఉంటుంది. వైద్య పరీక్షల్లో తేలిన అంశాలను విద్యార్థుల ఆరోగ్య కార్డులో తప్పకుండా నమోదు చేయాలి.
వాస్తవాలు ఇలా...
2010-11లో జిలా4్లలో 2,43,501 మంది విద్యార్థులుంటే వారిలో కేవలం 1,95,182 మందికే పరీక్షలు జరిపారు. 2012-13లో జిల్లాలో 3,451 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిలో 3,20,570 మంది విద్యార్థులు విద్యనభ్యసించారు. ఇందులో 3,251 పాఠశాలల్లోని 3,10,789 మంది విద్యార్థులకు మాత్రమే వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఈ ఏడాది 3,318 పాఠశాలల్లో 3,23,055 మంది నమోదయ్యారు. ఇందులో కేవలం 2,082 పాఠశాలల పరిధిలో 2,00,294 మంది విద్యార్థులకు స్క్రీనింగ్ చేశారు. ఇది జూలై 18 నుంచి ఆగస్టు ఆఖరు నాటికి. అంటే 61 శాతం మంది విద్యార్థులకు మాత్రమే వైద్య పరీక్షలు నిర్వహించ గలిగారు. ఈ నెల 18వ తేదీలోగా మరో 1.22 లక్షల మంది పిల్లలకు పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఈ నెల 4 నుంచి 16వ తేదీ వరకు పాఠశాలలకు దసరా సెలవులు ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో గడువులోగా మిగిలిన పిల్లలందరికీ స్క్రీనింగ్ జరపడం అసాధ్యమే. పీహెచ్‌సీ వైద్యుడు వారానికో పాఠశాలలోని విద్యార్థులకు మాత్రమే పరీక్షలు జరిపారు. దీంతో ఆశించిన రీతిలో వైద్య పరీక్షలు జరగడం లేవు.
నామమాత్రంగా...
జనాభాలో 20 శాతం మంది బడిఈడు పిల్లలు ఉన్నారు. వీరిలో 80 శాతం గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పిల్లల తల్లిదండ్రుల నిరక్షరాస్యత, అవగాహన లేమి, అపరిశుభ్ర వాతావరణం వంటివి విద్యార్థుల అనారోగ్యానికి హేతువులా మారుతున్నాయి. సకాలంలో వీటిని గుర్తించకపోవడం, వైద్య పరీక్షలు అందుబాటులో లేకపోవడం వల్ల పిల్లలు అనారోగ్యంతో దీర్ఘకాలికంగా బాధపడుతున్నారు.
కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయానికి గురవుతున్నారు. ప్రస్తుతం వర్షాకాలం సీజన్. ఈ కాలంలో వివిధ అంటురోగాలు, వ్యాధులు సోకే అవకాశం అధికంగా ఉంది. ముఖ్యంగా పిల్లలు వీటి బారిన పడకుండా చూడాల్సిన అధికారులు ఈ బాధ్యతను విస్మరించినట్లు వ్యవహరిస్తున్నారు. ఇటువంటి పరిస్థితులు తలెత్తకుండా పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాల్సిన ఆవశ్యకత ప్రభుత్వంపై ఉంది.
పరిహాసంగా...‘బాల ఆరోగ్య రక్ష’
Published Wed, Oct 16 2013 4:24 AM | Last Updated on Fri, Jul 26 2019 6:25 PM
Advertisement