నల్లగొండ అర్బన్ : ప్రభుత్వ పాఠశాలలను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు మొదలెట్టింది. ముందుగా స్కూళ్లను విలీ నం చేయడం, అనంతరం రేషనలైజేషన్ ద్వారా ఉపాధ్యాయులను సర్దుబాటు చేయడం ద్వారా అన్ని స్కూళ్లను పరిపుష్టిచేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఏకోపాధ్యాయ పాఠశాలలను ప్రభుత్వం దగ్గరలోని (కిలోమీటరు పరిధిలోని) ఇతర స్కూళ్లలో విలీనం చేయాలని, ప్రతిప్రైమరీస్కూల్‌లో కచ్చితంగా ముగ్గురు టీచర్లు ఉండేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది.ప్రభుత్వ నిర్ణయం వల్ల జిల్లాలో 287 సింగల్ టీచర్ స్కూళ్ల భవితవ్యం ముగింపుకు వచ్చినట్లేనని భావిస్తున్నారు. ప్రతి ప్రైమరీ స్కూళ్లలో కచ్చితంగా ముగ్గురు టీచర్లు ఉండేలా చర్యలు చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించిన నేపథ్యంలో తెలుగు/ఉర్దూలకు ఒకరు, ఇంగ్లీష్ సబ్జెక్టుకు మరొకరు, గణితం, ఇతర సబ్జెక్టుల బోధనకు ఇంకొక్కరు చొప్పున అవసరమని భావిస్తున్నారు. ప్రభుత్వ యోచన, తాజాగా రూపొందించబోయే విద్యావార్షిక క్యాలెండర్‌లో మార్పులపై ఈనెల 20వ తేదీలోపు అన్ని ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని తుదినిర్ణయం వెల్లడిస్తారు.
హైస్కూళ్ల పరిధిలోకి యూపీఎస్‌లు
ప్రైమరీ స్కూళ్లు, హైస్కూళ్లు మాత్రమే ఉండాలని ప్రభుత్వం యోచిస్తుండటంతో అప్పర్ ప్రైమరీ స్కూళ్ల మనుగడ ప్రశ్నార్థకంగా భావించవచ్చు. ప్రస్తుతం జిల్లాలో 629 యూపీఎస్‌లున్నాయి. వీటిని సమీపంలోని హైస్కూళ్లలో విలీనం చేయనున్నారు. ఐదు కిలోమీటర్ల వరకు హైస్కూల్ లేనిచోట యూపీఎస్‌లనే హైస్కూళ్లుగా అప్‌గ్రేడ్ చేయనున్నారు. మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న హైస్కూళ్లలో యూపీఎస్‌లను విలీనం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ నేపథ్యంలో కొన్నిచోట్ల మండల హద్దుల అంశాలు తెరపైకి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉదాహరణకు ఒక మండలంలో ఉన్న యూపీఎస్‌కు సమీపంలో మూడు కిలోమీటర్ల వద్ద హైస్కూల్ ఉన్నప్పటికీ అది మరో మండలానికి చెందినదైనపుడు మండలం మారాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఇలాంటి వాటిపై ఉపాధ్యాయ సంఘాలు ఏవిధంగా స్పందిస్తాయో వేచిచూడాల్సిఉంది.
జిల్లాలో 2299 ప్రైమరీ స్కూళ్లు
ప్రస్తుతం జిల్లాలో వివిధ మేనేజ్‌మెంట్ల కింద 2299 ప్రభుత్వ ప్రైమరీ స్కూళ్లున్నాయి. వీటిల్లో 287 ఏకోపాధ్యాయ పాఠశాలలున్నాయి. కిలోమీటరు పరిధిలో ఉన్న సింగల్ టీచర్ స్కూళ్లను ఒకే పాఠశాల పరిధిలోకి మార్చడం వల్ల ఈ సంఖ్య తగ్గే అవకాశం ఉంది. యూపీఎస్‌లను సమీపంలోని హైస్కూళ్లలో విలీనం చేసిన చోట్ల కొత్తగా ప్రైమరీ స్కూళ్లను నెలకొల్పాల్సిన అవసరాలు కూడా భవిష్యత్తులో తెరపైకి వచ్చే అవకాశాలు లేకపోలేదు.
మారనున్న విద్యావార్షిక క్యాలెండర్
ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచి వార్షిక క్యాలెండర్‌లో మార్పులు చేయాలని భావిస్తున్నది. పదో తరగతి మినహా ఇతర తరగతుల వారందరికీ ఫిబ్రవరి నెలలోనే వార్షిక పరీక్షలను పూర్తిచేయాలని అధికారులు ప్రతిపాదిస్తున్నారు. అనంతరం జవాబు పత్రాలను దిద్దడం, మరుసటి తరగతికి తర్ఫీదునివ్వడం తదితర కార్యక్రమాలతో విద్యా సంవత్సరం చివరి పనిదినం వరకు పాఠశాలల కార్యకలాపాలు కొనసాగేలా చూస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల ప్రక్షాళన
Published Sun, Apr 19 2015 5:10 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement