టెక్కలి: డివిజన్ కేంద్రంలోని చిరు వ్యాపారుల నుంచి చిట్‌ఫండ్ పేరుతో రూ.లక్షలు వసూలు చేసి ఉడాయించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక సీఐ కార్యాలయంలో సీఐ కె.భవానీ ప్రసాద్, ఎస్‌ఐ జి.రాజేష్ ఈ వివరాలను శనివారం వెల్లడించారు. సీఐ భవానీప్రసాద్ మాట్లాడుతూ టెక్కలికి చెందిన యువకుడు శ్రీనివాస్ శతపతి చిట్‌ఫండ్ పేరుతో రూ.లక్షలు వసూలు చేసి మోసగించాడని పట్టణానికి చెందిన కొండాల భుజంగరావుతో పాటు మరో 20 మంది బాధితులు ఫిర్యాదుచేశారని వెల్లడించారు.
నిర్వాహకుడు శతపతితో పాటు తల్లి సుహాసిని శతపతి, తండ్రి అనంత సేనా శతపతి, సోదరి ప్రశాంతి శతపతి తో పాటు స్థానిక వ్యాపారి తంగుడు కృష్ణపై ఫిర్యాదు చేశారన్నారు. ఈ కేసులో సుమారు రూ. 45,68,835 చిట్ రూపంలో బాధితులు చెల్లించినట్లు లెక్క తేలిందన్నారు. ఇందులో రూ.19,56,500 ఖాతాదారులకు ఇచ్చినట్లు శతపతి చెప్పాడని సీఐ పేర్కొన్నారు. మిగిలిన రూ.27,23,855ను బాధితులకు చెల్లించాల్సి ఉందన్నారు. శతపతిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తామని, మిగిలిన వారిని విచారించి మిగిలిన వారిని అరెస్టు చేస్తామన్నారు. అంతేగాక వారి ఆస్తులను అటాచ్ చేసేలా చర్యలు తీసుకుంటామని సీఐ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment