పేదల కడుపు నింపుతున్న చిట్టెమ్మ హోటల్‌.. | Chittemma Hotel Running Low Price Menu From 40 years in West Godavari | Sakshi
Sakshi News home page

చిట్టెమ్మ హోటల్‌

Published Tue, Feb 4 2020 1:22 PM | Last Updated on Tue, Feb 4 2020 4:35 PM

Chittemma Hotel Running Low Price Menu From 40 years in West Godavari - Sakshi

పశ్చిమగోదావరి, పాలకొల్లు అర్బన్‌: గోదావరి జిల్లాలంటేనే ఆతిథ్యానికి పెట్టింది పేరు. లాభాపేక్ష చూసుకోకుండా ఎందరో పేదల కడుపు నింపిన అన్నపూర్ణలు ఈ రెండు జిల్లాల్లో ఎందరో ఉన్నారు. అలాంటి కోవలోకే వస్తుంది పాలకొల్లు పట్టణానికి చెందిన ఇండిగుల చిట్టెమ్మ. తనకు గిట్టుబాటు కాకపోయినా తన హోటల్‌కు వచ్చే వారికి అన్ని వంటకాలతో కడుపునిండా భోజనం పెడుతుంది. అందుకే పాలకొల్లులో చిట్టెమ్మ హోటల్‌ పేదల హోటల్‌గా పేరుపడింది. లాభం లేకుండా హోటల్‌ ఎందుకు నడుపుతున్నావని ఎవరైనా ప్రశ్నిస్తే.. తనకు నాలుగు ముద్దలు తినేందుకు అవసరమైన డబ్బు మిగిలితే చాలు.. డబ్బులు వెనకేసుకుని ఏం చేసుకుంటాం అని సమాధానమిస్తుంది చిట్టెమ్మ..

 పేదలు, రోజువారీ కూలీలే ఎక్కువ
పాలకొల్లు పట్టణంలో భవన నిర్మాణ కార్మికులు, ఆటో డ్రైవర్లు, రోజువారీ కూలీలు, పేదల్ని చిట్టెమ్మ హోటల్‌ ఎక్కడంటే టక్కున చెబుతారు. ఎందుకంటే తక్కువ రేటుకే వారందరికీ కడుపు నిండా అన్నం పెడుతుంది ఆమె. పాలకొల్లు పట్టణంలో 40 ఏళ్ల క్రితం ప్రారంభించినటా హోటల్‌కు ఇప్పటికీ గిరాకీ తగ్గలేదు. అందుకు కారణం రుచికరమైన వంటకాలతో కడుపునిండా భోజనం పెట్టడం ఒకటైతే.. పట్టణంలోని మిగతా హోటళ్ల కంటే సగం ధరకే కడుపు నింపడం. కట్టెల పొయ్యిపై చేసిన రుచికరమైన వెజిటేరియన్‌ భోజనం రూ.40కి, నాన్‌ వెజ్‌ భోజనం రూ. 50కే పెడుతుంది. 

కట్టెల పొయ్యిపైమాంసం కూరవండుతున్నఇండిగుల చిట్టెమ్మ ,కస్టమర్లకు భోజనం వడ్డిస్తున్న చిట్టెమ్మ 
అప్పటి నుంచీ అదే మెనూ
చిట్టెమ్మ స్వగ్రామం నరసాపురం.. పెళ్లాయ్యాక తరువాత బతుకుదెరువు కోసం పాలకొల్లులో భోజనం హోటల్‌ ప్రారంభించింది. హోటల్‌ ప్రారంభించినప్పుడు రూ.2.50కే నాన్‌వెజ్‌ భోజనం పెట్టేవారు. కోడికూర లేదా చేపల పులుసుతో పాటు పప్పు, వేపుడు, పులుసు కూర, పచ్చడి, పెరుగు, రసం లేదా సాంబారు ఉంటుంది. మనం ఎంత కావాలంటే అంత తినొచ్చు. వెజిటేరియన్‌ భోజనంలోను అన్ని వెరైటీలు ఉంటాయి. అప్పటి నుంచి అదే విధానం కొనసాగిస్తున్నారు. చిట్టెమ్మ హోటల్‌లో చేపల కూర అద్భుతమంటూ భోజన ప్రియులు లొట్టలేస్తుంటారు. ఒకసారి ఆ రుచి చూస్తే వదిలిపెట్టరని చెబుతారు. 

కట్టెల పొయ్యిపైనే అన్ని వంటలు

కట్టెల పొయ్యిపై వంట చేస్తే ఆ రుచే వేరని చెబుతుంది చిట్టెమ్మ. ఇక అక్కడి తినేవారు సైతం కట్టెల పొయ్యిపై చేసిన వంటకాలు చాలా రుచికరంగా ఉంటాయంటారు. రోజూ వంద కిలోల రైస్‌ వండేది. ఒకప్పుడు కళకళలాడిన హోటల్‌కు ప్రస్తుతం కస్టమర్ల రాక తగ్గింది. ఎక్కడపడితే అక్కడ బిర్యానీ సెంటర్లు, పాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, టిఫిన్‌ సెంటర్లు రావడంతో వ్యాపారం తగ్గిందని చిట్టెమ్మ చెబుతోంది. చిట్టెమ్మ హోటల్‌ భోజనం చేసేవారంతా రిక్షా కార్మికులు, జట్టు కార్మికులు, వ్యవసాయ కూలీలు. సామాన్య, మధ్య తరగతికి చెందిన వారే. తక్కువ ధరకు కడుపునిండా భోజనం పెట్టడంతో వెదుక్కుని మరీ ఇక్కడకు వస్తుంటారు. చిట్టెమ్మకు ముగ్గురు కొడుకులు కాగా.. ఇద్దరు ఆటో డ్రైవర్‌లుగా స్థిరపడ్డారు. మూడో కొడుకు తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూ హోటల్‌ వ్యాపారంలో సాయపడుతున్నాడు.

30 గజాలే ఆస్తి

ఇన్నేళ్లలో ఈ భోజన హోటల్‌ మీద నేను సంపాదించింది 30 గజాల స్థలం. నేను, నా భర్త హోటల్‌ వ్యాపారంలో ఉండడంతో ముగ్గురు పిల్లల్ని చదివించలేకపోయాను. ఏదో నాలుగు ముద్దలు తినేంత మిగిలితే సరిపోతుందని ఈ రోజు వరకు వ్యాపారం సాగిస్తున్నాను. ఈ మధ్య నాకు శరీరం సహకరించడం లేదు. లాభాపేక్ష లేకుండా ఏదో ఇంతకాలం వ్యాపారం చేశాను. - ఇండిగుల చిట్టెమ్మ, హోటల్‌ నిర్వాహకురాలు

పేదల హోటల్‌గా ప్రసిద్ధి
పేదల హోటల్‌గా ఇది ప్రసిద్ధి. కాఫీ అండ్‌ భోజన హోటల్‌ నడిపేవాడిని. నష్టాలు రావడంతో కాఫీ హోటల్‌ తీసేశాను. కొన్నాళ్ల క్రితం కాలికి గాయమైంది. మోకాలు జాయింట్‌లో సమస్య ఏర్పడింది. శస్త్ర చికిత్స చేయాల్సి ఉన్నా వయసు సహకరించదన్నారు. ఏ పని చేయలేకపోతున్నా. నా భార్య చిట్టెమ్మ, మూడో కొడుకు, కోడలు సాయంతో హోటల్‌ నడుపుతున్నాం.  ఇండిగుల సత్యనారాయణ, చిట్టెమ్మ భర్త

ఇంట్లో భోజనంలా ఉంటుంది
ఇంట్లో భోజనంలా చాలా రుచిగా ఉంటుంది. లాభం కోసం ఆలోచించరు. ఎలా గిడుతుందో అర్థం కాదు. పెరిగిన నిత్యావసర సరకుల ధరలతో పోలిస్తే చాలా తక్కువ ధరకు భోజనం లభిస్తుంది.చిర్ల శ్రీనివాసరెడ్డి,ఆర్‌ఎంపీ వైద్యుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement