రూ. 2 వేల కోట్లు పంచేశారు! | Chittoor water scheme tenders increased so high | Sakshi
Sakshi News home page

రూ. 2 వేల కోట్లు పంచేశారు!

Published Thu, Jan 16 2014 3:02 AM | Last Updated on Sat, Sep 2 2017 2:38 AM

రూ. 2 వేల కోట్లు పంచేశారు!

రూ. 2 వేల కోట్లు పంచేశారు!

ఒడ్డించేవాడు మనవాడైతే ఎక్కడున్నా ఫర్వాలేదన్నట్లుగా సాగుతున్నాయి చిత్తూరు తాగునీటి పథకం టెండర్లు. పథకం అంచనాలను భారీగా రూ.2,000 కోట్లకు పెంచేలా చక్రం తిప్పిన ప్రభుత్వంలోని ముఖ్యనేత సోదరుడు...

చిత్తూరు తాగునీటి పథకంలో చక్రం తిప్పిన పెద్దలు
 టెండర్ దాఖలు చేసిన 10 సంస్థలకు ఒక్కో ప్యాకేజీ..
 ఒక్కో ప్యాకేజీ విలువ రూ.150 నుంచి రూ.250 కోట్లు..
 అంచనా కంటే రెండు నుంచి నాలుగు శాతం అధికంగా టెండర్లు..
 మొబిలైజేషన్ అడ్వాన్స్‌గా ఐదు నుంచి పదిశాతం...
 హైకోర్టులో కేసున్నా.. పట్టించుకోకుండా పనికానిచ్చేసిన ప్రభుత్వం

 
 సాక్షి, హైదరాబాద్: ఒడ్డించేవాడు మనవాడైతే ఎక్కడున్నా ఫర్వాలేదన్నట్లుగా సాగుతున్నాయి చిత్తూరు తాగునీటి పథకం టెండర్లు. పథకం అంచనాలను భారీగా రూ.2,000 కోట్లకు పెంచేలా చక్రం తిప్పిన ప్రభుత్వంలోని ముఖ్యనేత సోదరుడు... కాంట్రాక్టర్ల మధ్య పోటీ లేకుండా పనులు పంచుకొని తన వాటా తనకిచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఆ మేరకు టెండర్ల కోసం పోటీ పడ్డ కాంట్రాక్టు సంస్థలన్నీ... ఒక్కో ప్యాకేజీ దక్కించుకున్నాయి. టెండర్లలో పోటీ ఉన్నట్లు పైకి కనిపించినా.. ఆ పోటీ అంతా మాయ అని ఆర్థిక బిడ్స్ తెరిచిన  అనంతరం తేలిపోయింది.
 
  కేవలం 0.25 నుంచి 0.5 శాతం తేడాతో పది కాంట్రాక్టు సంస్థలు పని దక్కించుకోవడమే ఇందుకు నిదర్శనం. ఈ  పథకంపై హైకోర్టులో నడుస్తున్న కేసును బేఖాతరు చేస్తూ ఈ వారంలోనే కాంట్రాక్టర్లకు పనులు అప్పగించేందుకు వీలుగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. చిత్తూరు తాగునీటి పథకానికి మొత్తం 12 సంస్థలు బిడ్స్ దాఖలు చేయగా... భారీ సంస్థ రుణ పునర్‌వ్యవస్థీకరణ (కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చర్) నిబంధన ఉల్లంఘనతోపాటు, రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ చేసుకోని తాహెర్ కాంట్రాక్టు సంస్థతోపాటు, శ్రీనివాస కన్‌స్ట్రక్షన్ కంపెనీ సాంకేతిక నిబంధనలకు లోబడి లేకపోవడంతో... ఈ రెండు సంస్థలపై మొదట్లోనే అనర్హత వేటు వేశారు.
 
 మంత్రివర్గ ఆమోదం లేకుండానే...
 చిత్తూరు జిల్లా తాగునీటి పథకంపై ఇప్పటికే హైకోర్టులో రెండు కేసులున్నాయి. అందులో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు వేసిన కేసులో వాదనలు నడుస్తున్నాయి. ఈ పథకానికి మంత్రివర్గ ఆమోదానికి సంబంధించిన నోట్‌ఫైల్స్ దాఖలు చేయాలంటూ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ కేసు దాఖలయ్యే సమయానికి ఈ పథకానికి మంత్రివర్గ ఆమోదం లేదు. ఆ తరువాత మంత్రివర్గం ఆమోదించింది. మంత్రివర్గ ఆమోదం లేక ముందే.. ఈ పథకానికి టెండర్లు పిలవడం విశేషం.
 
 దక్కించుకోనున్న సంస్థలు...
 ఐవీఆర్‌సీఎల్, భూరత్నం, కోయ, ఇండియన్ హ్యూమ్‌పైప్ కంపెనీ, ఎస్‌ఎంసీ, ఎన్‌సీసీ, మెగా ఇంజనీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, కెఎల్‌ఎస్‌ఆర్ సంస్థలతోపాటు ఫిల్టర్ ప్లాంట్‌ను జియో మిల్లర్ సంస్థ నిర్మించనుంది. ఈ సంస్థలన్నీ అంచనా విలువకంటే రెండు నుంచి మూడు, మూడున్నర శాతం అధికంగా టెండర్లు దాఖలు చేసి, కాంట్రాక్టు దక్కించుకున్నట్లు సమాచారం.
 
 ముందస్తు అడ్వాన్సులు షురూ...
 పురపాలక శాఖ, గ్రామీణ తాగునీటి శాఖల్లో వేలకోట్ల రూపాయలతో మంచినీటి పథకాలు చేపడుతున్నా.. కాంట్రాక్టు సంస్థలకు ఎక్కడా మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు ఇవ్వలేదు. కానీ చిత్తూరు తాగునీటి పథకానికి ఐదు నుంచి పది శాతం మేరకు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధమైంది. అంటే రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్లు అడ్వాన్స్‌గా ఇవ్వనున్నారు. ఈ మొత్తం ముడుపుల కిందకు వెళ్లాయన్న విమర్శలు వినవస్తున్నాయి. ఈ మేరకు ముఖ్యనేత సోదరుడు కాంట్రాక్టు సంస్థలకు సంబంధించిన పెద్దలతో టెండర్లకు ముందుగానే చర్చించినట్లు సమాచారం.
 
 నీటి కేటాయింపులపైనా వివాదం...
 కండలేరు రిజర్వాయర్ నుంచి 6.61 టీఎంసీల నీటిని తాగునీటి పథకానికి కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. దీనిపై కూడా వివాదం నడుస్తోంది. ఈ 6.61 టీఎంసీల నీటిని ఎవరికి కత్తిరించి తాగునీటి పథకానికి ఇస్తున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నెల్లూరు జిల్లాకు నీరివ్వకుండా చిత్తూరుకు తరలించుకుంటున్నారంటూ కొందరు నాయకులు విమర్శలు చేస్తున్నారు.
 
 మతలబేమిటి?
 ముఖ్యనేత సోదరుడి జోక్యంతో ప్రాజెక్టు అంచనాలను ముందుగానే భారీగా పెంచేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అందువల్ల అంచనా విలువ కంటే తక్కువకు టెండర్లు దాఖలు చేసినా ఎలాంటి ఇబ్బంది ఉండదని, పదిశాతం ‘గుడ్‌విల్’గా ముట్టచెప్పాలంటూ కాంట్రాక్టర్లకు షరతు విధించినట్లు సమాచారం. ఆ మేరకు కాంట్రాక్టు సంస్థలేవీ అంచనా విలువ కంటే తక్కువకోట్ చేయకపోవడం గమనార్హం. మరోవైపు ఈ పథకం మొత్తానికీ ఒకే టెండర్ పిలిచి ఉంటే ఐదు నుంచి పదిశాతం తక్కువకు టెండర్ వేసి ఉండేవారని, ఫలితంగా రూ.100 నుంచి రూ.200 కోట్లు మిగిలి ఉండేవని ఇంజనీరింగ్ వర్గాలు చెబుతున్నాయి.
 
 పథకమేమిటి?
 చిత్తూరు జిల్లాలోని దాదాపు ఎనిమిది వేల గ్రామాలకు తాగునీరు అందించడానికి వీలుగా ఒక ఫిల్టర్‌ప్లాంట్ నిర్మాణం, ప్రధాన పైపులేన్ల నిర్మాణ పనుల కోసం మొత్తం తొమ్మిది ప్యాకేజీలుగా అక్టోబర్‌లో టెండర్లు పిలిచారు. ఈ పనుల మొత్తం విలువ దాదాపు రూ. రెండువేల కోట్లు. ఇందులో పైపులైన్ల నిర్మాణానికి రూ.1,800కోట్లు, ఫిల్టర్‌ప్లాంట్ నిర్మాణానికి రూ.200 కోట్లు కేటాయించారు. నవంబర్ 20 టెండర్ల దాఖలుకు చివరి తేదీ. అదే రోజు సాంకేతిక బిడ్స్ తెరిచి వాటి మదింపు చేశారు. ఒక్కో ప్యాకేజీ కింద 25 నుంచి 35 కిలోమీటర్ల పొడువునా పైపులైన్ నిర్మించాల్సి ఉంది. పైపులైన్ల వ్యాసార్థం ఆధారంగా ఒక్కో ప్యాకేజీ విలువ రూ. 150 కోట్ల నుంచి 250 కోట్ల వరకు ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement