సివిల్ వివాదంలో తలదూర్చడమే కాకుండా నిందితులతో కుమ్మక్కై బాధితుడి ఫిర్యాదును పక్కన పడేసిన ఓ సీఐని గుంటూరు
సివిల్ వివాదంలో సీఐ సస్పెన్షన్
Sep 22 2013 2:20 AM | Updated on Sep 1 2017 10:55 PM
ఏటీఅగ్రహారం (గుంటూరు), న్యూస్‌లైన్ :సివిల్ వివాదంలో తలదూర్చడమే కాకుండా నిందితులతో కుమ్మక్కై బాధితుడి ఫిర్యాదును పక్కన పడేసిన ఓ సీఐని గుంటూరు రేంజ్ ఐజీ పి.వి.సునీల్‌కుమార్ సస్పెండ్ చేస్తూ శనివారం ఆదేశాలు జారీచేశారు. సంబంధిత డీఎస్పీ ఉదాసీనంగా వ్యవహరించినందున శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీకి సిఫారసు చేయడంతోపాటు, అప్పటి ఎస్పీకి మెమో జారీచేశారు. వివరాలిలా ఉన్నాయి... గుంటూరు నగరంలోని శ్యామలానగర్‌లో అదేప్రాంతానికి చెందిన నల్లపాటి సౌజన్యకుమార్, కొడాలి లలితకుమారి మధ్య రూ.6 కోట్ల విలువచేసే 1800 గజాల స్థలం విషయంలో వివాదం ఉంది. ఈ స్థలం తనదనీ, తన ఆధీనంలోనే ఉందని సౌజన్యకుమార్ కోర్టును ఆశ్రయించాడు.
సౌజన్యకుమార్ స్థలాన్ని ఆక్రమించుకోవడంతో పాటు తన మర్యాదకు భంగం కలిగించాడంటూ జనవరి 26న లలితకుమారి పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదుచేసింది. విచారణ చేపట్టిన సీఐ డి.దుర్గాప్రసాద్ కోర్టులో విచారణలో ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడికావడంతో తప్పుడు కేసుగా నిర్ధారించి కేసును మూసివేశారు. లలితకుమారి వ్యూహం పనిచేయకపోవడం, కోర్టులో తీర్పు సౌజన్యకుమార్‌కు అనుకూలంగా వస్తుందని ముందే పసిగట్టింది. దీంతో ఏప్రిల్ 5న కొందరు అనుచరులతో కలిసి పొక్లెయిన్, ట్రాక్టర్లతో అక్రమంగా ప్రవేశించి స్థలంలో ఉన్న షెడ్లను కూల్చివేయడం ప్రారంభించింది.
కోర్టు విచారణలో ఉండగా తన ఆస్తులకు నష్టం కలిగించి, స్థలాన్ని లలితకుమారి ఆక్రమిస్తోందంటూ బాధితుడు పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదుచేశాడు. కేసు నమోదు చేసిన సీఐ స్వయంగా పరిశీలించకపోగా.. లలితకుమారి తదితరులను స్టేషన్‌కు పిలిపించి వారితో కుమ్మక్కయ్యారు. వారంతా దర్జాగా వెళ్లి షెడ్ల కూల్చివేతను పూర్తిచేశారు. తనకు సీఐ అన్యాయం చేశాడనీ, నిందితులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడనీ అప్పటి అర్బన్ ఎస్పీ ఆకే రవికృష్ణ, వెస్ట్ జోన్ డీఎస్పీ సీహెచ్ వెంకటేశ్వరరావులను బాధితుడు ఆశ్రయించినా ప్రయోజనం లేకపోయింది. ఈ క్రమంలో ఏప్రిల్ 20న సౌజన్యకుమార్‌కు అనుకూలంగా కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ జారీచేసింది.
వెలుగు చూసిందిలా..
సివిల్ వివాదంలో పోలీసులు అత్యుత్సాహం కనబరిచి నిందితులకు కొమ్ము కాసి అన్యాయం చేశారంటూ ఆగస్టు 12న సౌజన్యకుమార్ హైదరాబాద్‌లోని శాంతిభద్రతల విభా గం అదనపు డీజీ వి.ఎస్.కె.కౌముదిని న్యాయంచేయాలని కోరాడు. దీనిని సీరియస్‌గా పరి గణించిన అదనపు డీజీ దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలంటూ ఐజీ, అర్బన్ ఎస్పీలను ఆదేశిం చారు. ఏఎస్పీ జెట్టి గోపీనాథ్ విచారణాధికారిగా దర్యాప్తు జరిపారు. సివిల్ కేసులో కోర్టు తీర్పు వచ్చే వరకు స్టేటస్ కో కొనసాగించాల్సి వుండగా సీఐ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు రుజువైంది. ఏఎస్పీ నివేదిక ఆధారంగా సీఐ దుర్గాప్రసాద్‌ను ఐజీ సునీల్‌కుమార్ శనివారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వెలువరించారు. పర్యవేక్షించాల్సిన డీఎస్పీ వెంకటేశ్వరరావు నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు చర్యలు తీసుకోవాలని డీజీపీకి నివేదిక పంపారు. సమస్య తీవ్రతను గుర్తించి చర్యలు తీసుకోవడంలో విఫలమైనందుకు అప్పటి ఎస్పీ ఆకే రవికృష్ణకు మెమో జారీచేశారు.
Advertisement
Advertisement