సర్కిళ్ల ప్రదక్షిణలు | Circles circuits | Sakshi
Sakshi News home page

సర్కిళ్ల ప్రదక్షిణలు

Published Thu, Nov 13 2014 2:57 AM | Last Updated on Mon, Aug 13 2018 3:00 PM

సర్కిళ్ల ప్రదక్షిణలు - Sakshi

సర్కిళ్ల ప్రదక్షిణలు

అన్ని విధాలా అనుకూలమైన చోటుకు బదిలీ చేరుుంచుకోవడానికి పలువురు సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు పడరాని పాట్లు పడుతున్నారు. ఎవరైనా చూస్తే ఎమనుకుంటారోనని ఓ వైపు సంశరుుస్తూనే.. మరో వైపు మంత్రులు, కొందరు ఎమ్మెల్యేలను కాకా పడుతున్నారు. మరికొందరైతే వారు అడిగినంత డబ్బు ఇచ్చుకోవడానికి కూడా సిద్ధమంటూ సంకేతాలు పంపుతున్నారు.
 
 సాక్షి ప్రతినిధి, అనంతపురం : సీఐల బదిలీలకు తెరలేచింది. డీఎస్పీ పదోన్నతుల ప్రక్రియ ముగియడంతో త్వరలో సీఐల బదిలీలు జరగనున్నాయి. దీంతో కోరుకున్న సర్కిల్‌ను దక్కించుకునేందుకు సీఐలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అధికార పార్టీ నేతల అండ ఉంటే ఆశించిన సర్కిల్ చేజిక్కుతుందని ఆ దిశగా గట్టి ప్రయత్నాలు సాగిస్తున్నారు.

జిల్లాలో పోస్టింగుల విషయంలో కీలకంగా వ్యవహరిస్తున్న మంత్రి పరిటాల సునీతను ప్రసన్నం చేసుకునే పనిలో అధిక శాతం సీఐలు నిమగ్నమయ్యారు. కొద్ది రోజులుగా అనంతపురంలోని అరవిందనగర్‌లో ఉన్న మంత్రి ఇంటి చుట్టూ కొందరు సీఐలు ప్రదక్షిణలు చేస్తున్నారు. యూనిఫాంతో వచ్చి మరీ మంత్రిని కలుస్తున్నారు. తాము ఆశిస్తున్న సర్కిల్ విషయాన్ని విన్నవిస్తున్నారు.

 లూఫ్‌లైన్ గండంలోని వారే అధికం
 ఈ విడత బదిలీల్లో ఎస్‌ఐ నుంచి సీఐల పదోన్నతుల సమయంలో లూఫ్‌లైన్లో పనిచేయకుండా సర్కిల్‌లలో కొనసాగుతున్న వారు తిరిగి సర్కిల్ దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఏపీపీఎం(ఆంధ్రప్రదేశ్ పోలీసు మాన్యువల్) ప్రకారం ఓ సీఐ రెండేళ్ల పాటు లూఫ్‌లైన్‌లో పని చేయాలి. కానీ కొంత మంది రాజకీయ సిఫార్సుల అండతో అప్రాధాన్యత పోస్టులలో విధులు నిర్వహించకుండానేసర్కిల్‌లలో కొనసాగుతున్నారు.

ఇలాంటి వారిని ఈదఫా బదిలీల్లో లూఫ్‌లైన్‌కు వేయాలని రాయలసీమ ఐజీ భావిస్తున్నారు. లూఫ్‌లైన్‌లో పనిచేసి, ఆపై సర్కిళ్లకు రాకుండా అప్రాధాన్యత పోస్టుల్లోనే కొనసాగే సమర్థులైన సీఐలకు ఈసారి సర్కిల్ కట్టబెట్టాలని కూడా ఆయన ఆలోచిస్తున్నట్లు సమాచారం. రాయలసీమలో లూఫ్‌లైన్‌లో పనిచేయకుండా విధులు నిర్వహిస్తున్న సీఐలు 55 మంది ఉన్నారు. వీరిలో అనంతపురంలో 17మంది ఉన్నారు. వీరిలో చాలామంది కోరుకున్న సర్కిల్‌ను దక్కించుకునేందుకు మంత్రి సునీత ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

వీరితో పాటు కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో పనిచేస్తూ అనంతపురంలోని సర్కిళ్లను ఆశిస్తున్న సీఐలు కూడా మంత్రి అండదండల కోసం ‘అనంత’ బాటపడుతున్నారు. దీంతో మంత్రి నివాసం ఎదుట సీఐల హడావుడి బాగా కనిపిస్తోంది. మరో మంత్రి పల్లె రఘునాథరెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని రావడంతో ఆయన్ను కలవడానికి ఎవరంతకు వారు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇతనిపాటు చీఫ్‌విప్ కాల్వశ్రీనివాసులు ఇంటి వద్ద కూడా సీఐల హడావుడి కన్పిస్తోంది. ప్రస్తుతం సర్కిళ్లలో పనిచేస్తున్న సీఐలు కూడా లూఫ్‌లైన్‌కు వెళ్లకుండా సర్కిళ్లలో కొనసాగేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.

కొందరు సీఐలు సర్కిల్‌ను బట్టి 7-15 లక్షల రూపాయల వరకూ అధికార పార్టీ నేతలకు ముట్టజెపుతున్నట్లు తెలిసింది. జిల్లాలోని ముఖ్యమైన సర్కిళ్లకు ఏ సీఐ రాబోతున్నారో ఇప్పటికే పోలీసు శాఖలో లీకైంది. ఫలానా సర్కిల్‌కు ఫలానా సీఐ వస్తున్నాడని ఎస్‌ఐలు, సీఐలు జోరుగా చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా బదిలీ నేపథ్యంలో ఒక్కో సీఐ నుంచి మూడు ఆప్షన్లను ఉన్నతాధికారులు తీసుకున్నారు.

జిల్లాలో అధికార పార్టీ నేతల ఇళ్ల వద్ద సీఐల సందడి చూస్తుంటే ఆప్షన్లు కాగితంపై మినహా సర్కిల్ వరకూ రావని కొందరు సీఐలు బాహాటంగానే చెబుతున్నారు. ఈ విడత బదిలీల్లో రెండు సామాజిక వర్గాలకు చెందిన సీఐలకే పెద్దపీట వేస్తున్నట్లు తెలుస్తోంది. బలహీన వర్గాలకు చెందిన సీఐలు మళ్లీ లూఫ్‌లైన్‌లోనే పని చేయకతప్పదని కొందరు సీఐలు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement