మండలంలోని పాపాసాహెబ్‌పేట పంచాయతీ పరిధిలో గల బాలుపల్లె గ్రామంలో ఇంటి స్థల విషయమై వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
నలుగురికి తీవ్ర గాయాలు
బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి
చింతకొమ్మదిన్నె : మండలంలోని పాపాసాహెబ్‌పేట పంచాయతీ పరిధిలో గల బాలుపల్లె గ్రామంలో ఇంటి స్థల విషయమై వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో బాలుపల్లె గ్రామంలోని వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన సర్పంచ్ వర్దిరె డ్డి భారతి, ఆమె భర్త సురేంద్రారెడ్డి, టీడీపీ వర్గాయులైన చిన్న పుల్లారెడ్డి, వర్దిరెడ్డి రామతులసి తీవ్రంగా గాయపడ్డారు. దీంతో గ్రామస్తులు 108 సహాయంతో బాధితులను రిమ్స్‌కు తరలించారు. బాధితుల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సర్పంచ్ ఇంటి పక్కనే ఉన్న రె ండు అడుగుల స్థలంలో టీడీపీ నాయకులు ఈ స్థలం తమదంటూ రాళ్లు నాటారని, అది తొలగించాలని సర్పంచ్ అత్త సావిత్రమ్మ కోరారు. అయితే టీడీపీ నాయకులు ఆమెపై దాడి చేసి గాయపరిచారని, ఈ ఘర్షణలో బాధితురాలికి చెందిన నాలుగు తులాల బంగారు గొలుసును సైతం కాజేశారని ఫిర్యాదు చేశారు. అనంతరం ఘర్షణ విషయం తెలుసుకున్న సర్పంచ్ భర్త అయిన వర్దిరెడ్డి సురేంద్రారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకుంటుండగా ఇరు వర్గాలు కట్టెలతో దాడి చేసుకున్నారని తెలిసింది.
పరామర్శించిన ఎమ్మెల్యే
బాలుపల్లె గ్రామంలో టీడీపీ వర్గీయుల దాడిలో గాయపడిన వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు వర్దిరెడ్డి సురేంద్రారెడ్డి, సర్పంచ్ భారతిలను క మలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాధరెడ్డి పరామర్శించి ఘర్షణకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.