ప్రశాంతంగా పోస్టుమెన్ రాత పరీక్షలు
కర్నూలులో 75, నంద్యాలలో 65 శాతం అభ్యర్థులు హాజరు
కర్నూలు(ఓల్డ్‌సిటీ):
రాయలసీమ రీజియన్ పరిధిలోని అభ్యర్థులకు నిర్వహించిన పోస్టుమెన్/ మెయిల్‌గార్డు అభ్యర్థుల రాత పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. కర్నూలు, నంద్యాలలో మొత్తం 25 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా, ప్రతి పరీక్ష గదికి ఇద్దరు ఇన్విజిలేటర్ల చొప్పున 1,336 మంది నియమించారు. పరీక్ష కేంద్రాల వద్ద డివిజన్ స్థాయి పోస్టల్ అధికారులు సూపర్‌వైజర్లుగా వ్యవహరించారు. అనివార్య కారణాల వల్ల ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను సైతం 10.15 గంటల వరకు అనుమతించారు.
19,278 మందికి హాల్‌టికెట్లు జారీ చేయగా, 13,943 మంది అభ్యర్థులు మాత్రమే పరీక్షకు హాజరయ్యారని కర్నూలు పోస్టల్ సూపరింటెండెంట్ కె.వి.సుబ్బారావు చెప్పారు. కర్నూలులో 12,540 మందికి 9,520 మంది(75శాతం), నంద్యాలలో 6,733 మందికి 4423 మంది(65శాతం) పరీక్షలు రాశారన్నారు. మొత్తం మీద రీజియన్ పరిధిలో 72 శాతం హాజరు నమోదైనట్లు వివరించారు.
హాల్‌టికెట్ నంబర్ల నమోదులో ఇక్కట్లు
పరీక్ష నిర్వాహకులు అందించిన ఆన్సర్‌షీట్‌లో అంతా ఓఎంఆర్ విధానమే పాటించడంతో అభ్యర్థులు ఇక్కట్లకు గురయ్యారు. హాల్‌టికెట్ నంబరును అంకెల్లో రాయడమే కాకుండా వాటి ఎదురుగా ఉండే ఓఎంఆర్ గళ్లను కూడా పెన్నుతో దిద్ది పూరించాల్సి ఉండటంతో కొందరు అభ్యర్థులు తికమకపడ్డారు. అంకెల్లో సరిగ్గానే రాసినా ఓఎంఆర్ గళ్లు పూరించడంలో పొరపాట్లు చేశారు. ఈ విషయంలో పరీక్ష కేంద్రాల సూపర్‌వైజర్లు నిస్సహాయత వ్యక్తం చేయడంతో పరీక్ష పేపర్‌ను పరిగణనలోకి తీసుకుంటారో లేదోనని కొందరు ఆందోళనకు గురవుతున్నారు.