సాక్షి, అమరావతి : కాపుల రిజర్వేషన్ బిల్లు - 2017కు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శనివారం ఆమోదం తెలిపింది. బిల్లు ఆమోదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభలో మాట్లాడారు. బ్రిటిష్ కాలంలో కాపులకు రిజర్వేషన్లు ఉండేవని చెప్పారు. స్వతంత్రం వచ్చిన తర్వాత కారణాలు చెప్పకుండా రిజర్వేషన్లు తీసేశారన్నారు. 2016లో కాపుల రిజర్వేషన్‌పై మంజునాథ కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
రాష్ట్రంలోని జిల్లాలన్నింటిలో పర్యటించిన కమిషన్ సభ్యులు కాపుల స్థితిగతులను అధ్యాయనం చేసినట్లు చెప్పారు. కాపులకు రిజర్వేషన్ ఇవ్వాలని తనను ఎవరనూ అడగలేదని అన్నారు. పాదయాత్ర చేసిన సమయంలో కాపుల కష్టాలను చూసి.. తానే రిజర్వేషన్ ఇవ్వాలని భావించినట్లు చెప్పారు. మంజునాథ కమిషన్ కాపుల రిజర్వేషన్‌పై నివేదిక అందజేసినట్లు వెల్లడించారు. కాపులు రాజకీయ రిజర్వేషన్లను కోరుకోవడం లేదని అందుకే సామాజిక, ఆర్థిక, ఉద్యోగాల్లో మాత్రమే రిజర్వేషన్‌ను కల్పిస్తున్నట్లు వివరించారు.
కాపులకు రిజర్వేషన్ల ఇవ్వడం వల్ల వెనుకబడిన తరగతులకు ఎలాంటి అన్యాయం జరగబోదని చెప్పారు. బీసీలకు అన్యాయం జరగకుండా చూస్తామని అన్నారు. కాపుల(కాపు, తెలగ, బలిజ, ఒంటరి)ను బీసీ(ఎఫ్) కేటగిరీలో చేరుస్తున్నట్లు తెలిపారు. కాపుల రిజర్వేషన్లను షెడ్యూల్ 9లో చేర్చాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు చెప్పారు. బీసీ(ఎఫ్) కేటగిరీలోని వారందరికీ 5 శాతం రిజర్వేషన్ వర్తిస్తుందని వివరించారు. వాల్మీకీలు, బోయలను ఎస్టీ జాబితాలో చేర్చడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment