అడవుల్లో రాజధాని కాదు.. మెంటల్ ఆస్పత్రి కట్టాలి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త రాజధాని నగరాన్ని అడవుల్లో కట్టుకోవడం మంచిది కాదని, కావాలంటే ఆ అడవుల్లో మెంటల్ ఆస్పత్రి కట్టుకోవచ్చని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ఆయన సుదీర్ఘ ప్రసంగం చేశారు. రైతులు స్వచ్ఛందంగానే భూములు ఇస్తున్నారని, వారికి తాను ఎంతగానో కృతజ్ఞుడినై ఉంటానని చెప్పారు. వారికి ఆర్థిక సాయంతో పాటు ఇతరత్రా ఏమైనా సాయం వీలుంటే అది కూడా చేస్తానని ఆయన అన్నారు. ఆ రైతులను తాను తన జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేనని తెలిపారు. రాజధాని నగరంపై ఇచ్చిన మాటకు తాను కట్టుబడి ఉన్నానని, రాజధాని ఎంపిక కోసం చాలా ప్రాంతాలు పరిశీలించానని చెప్పారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా సింగపూర్ వారు తనను గౌరవించారన్నారు. జపాన్ దేశం ఒక రాష్ట్రంతో ఎంవోయూ చేసుకుందంటే.. అది ఒక్క ఆంధ్రప్రదేశ్తోనేనని ఆయన అన్నారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే..
- గండికోటకు నీళ్లు తీసుకెళ్లగలిగితే కడపలో 70 టీఎంసీలు నిల్వచేసుకోవచ్చు
- తోటపల్లి ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏడాది పూర్తి చేస్తాం.
- వంశధార, నాగావళి కూడా పూర్తి చేస్తాం
- వెలుగొండ ప్రాజెక్టును పూర్తిచేసే బాధ్యత నాదే
- టీడీపీకి తొలి ప్రాధాన్యం సాగునీరు, తాగునీరు
- చిత్తశుద్ధితో ఎస్సీ సబ్ ప్లాన్ అమలుచేస్తాం, బీసీ ప్లాన్ కూడా తెస్తాం
- రాష్ట్రంలో ఎక్కడా ఎరువుల కొరత లేకుండా చేశాం
- ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ. 5 లక్షలు ఇచ్చాం
- మాది రైతు ప్రభుత్వం, రైతుల ఆత్మహత్యలను సవాలుగా తీసుకుంటాం
- రైతులు చనిపోవడానికి వీల్లేదు, రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు
- వ్యవసాయ బడ్జెట్ను రెండోసారి అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నాం
- రైతులకు 7 గంటల విద్యుత్ ఇస్తాం
- రాష్ట్రంలో రోడ్ల వ్యవస్థ అధ్వానంగా ఉంది
- ఇళ్లు, పరిశ్రమలకు 24 గంటల విద్యుత్ అందిస్తాం
- తక్కువ నిధులతో ఎక్కువ ఫలితాలు సాధిస్తాం
- రాయలసీమను సస్యశ్యామలం చేస్తాం
- వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు ప్రయత్నిస్తున్నాం
- హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా మదనపల్లి, పుంగనూరుకు నీరిస్తాం