అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాన ప్రతిపక్షాన్ని కలుపుకు పోవటంలో చంద్రబాబు విఫలమయ్యారని ఆయన విమర్శించారు. ప్రజల సమస్యలు చెప్పేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వలేదన్నారు. చంద్రబాబు విజన్ 2020-29 అంటున్నారని, రుణమాఫీకి అంత సమయం తీసుకుంటారా అని ప్రశ్నించారు.
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్లను విమర్శించేందుకే టీడీపీ అసెంబ్లీని వేదికగా మార్చుకుందని విశ్వేశ్వరరెడ్డి అన్నారు. సభను ఎలా అడ్డుకోవాలో యనమల రామకృష్ణుడు యత్నించటం దుర్మార్గమన్నారు. రుణమాఫీపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయలేకపోయిందని ఆయన విమర్శించారు. రాజధాని, స్మార్ట్ సిటీల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ రాజధానితో పాటు, స్మార్ట్ సిటీల నిర్మాణానికి రూ.10లక్షల కోట్లు కావాలని విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఏపీ పునర్విభజన చట్టం అమలుకు కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తీసుకు రావటం లేదని ప్రశ్నించారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, నిధులు వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీని అమలు చేయాలని విశ్వేశ్వరరెడ్డి సూచించారు.
'చంద్రబాబు నాయుడు విఫలమయ్యారు'
Published Mon, Sep 8 2014 12:45 PM | Last Updated on Tue, Oct 30 2018 5:12 PM
Advertisement