మీ ఉద్యోగాలు పోతాయ్
మంత్రులు గంటా, అయ్యన్నలకు సీఎం హెచ్చరిక
విశాఖలో టీడీపీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం
విశాఖపట్నం: ‘‘చెప్పుడు మాటలు నమ్మితే మీ ఉద్యోగాలు పోతాయ్.. ఒక్కరికే పదవి ఇచ్చేవాడ్ని. కానీ ఇద్దరూ సమర్థులనే ఇచ్చాను. కలసికట్టుగా ఉండాలి’’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వందలాదిమంది కార్యకర్తల సమక్షంలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడులను హెచ్చరించారు. టీడీపీ అధికారం చేపట్టాక కార్యకర్తల తొలి విస్తృత స్థాయి సమావేశం విశాఖలో బుధవారం జరిగింది. జిల్లాకు చెందిన మంత్రులిద్దరూ ఎడమొఖం, పెడమొఖంగా ఉండటంతో కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారని పార్టీ నగరశాఖ అధ్యక్షుడు వాసుపల్లి గణేష్‌కుమార్ సభాముఖంగా తన దృష్టికి తీసుకురావడంతో చంద్రబాబు స్పందించారు. కొందరు కార్యకర్తలు లేనిపోనివి చెబుతున్నప్పుడు వాటిని నమ్మరాదని, ఇద్దరు మంత్రులూ కలిసే ఏ కార్యక్రమానికైనా వెళ్లాలని ఆయన సూచించారు. ఒకరి నియోజకవర్గంలో ఇంకొకరు తలదూర్చవద్దని సూచించారు. తెలంగాణలో మిగులు బడ్జెట్ రావడానికి టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధే కారణమని చంద్రబాబు పునరుద్ఘాటించారు.
పద్ధతి లేకుండా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌పై కసితో ప్రజలు టీడీపీకి పట్టం గట్టారని, వారు మనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాలని కార్యకర్తలకు, నాయకులకు ఆయన సూచించారు. రాష్ర్టంలో రూ.15,500 కోట్ల రెవెన్యూ లోటు ఉందని, ఐదేళ్లలో ఇది మరింత పెరిగే అవకాశముందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటును పూడ్చినట్టు చెప్పారు. మే నెలలో మహానాడు నిర్వహించి తర్వాత గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ కమిటీలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఎన్నికల్లో పార్టీని గెలిపించనివాళ్లు నామినేటెడ్ పదవులకోసం పాకులాడటం మంచిది కాదన్నారు.
బాబుకు తమ్ముళ్ల షాక్
సమావేశంలో పలువురు కార్యకర్తలు మాట్లాడుతూ.. రుణమాఫీ, పింఛన్ల విషయంలో జనానికి సమాధానం చెప్పలేకపోతున్నామంటూ నిర్మొహమాటంగా చెప్పడంతో చంద్రబాబు షాక్‌కు గురయ్యారు. రుణమాఫీ చాలామందికి కాలేదని, పింఛన్లు రావడం లేదని తమను నిలదీస్తున్నారని వారు చెప్పారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. రుణమాఫీ అందరికీ చేశామని, ఎవరైనా ఎక్కువ రుణం తీసుకున్నవారు 4 శాతం మంది ఉంటే వారికి మాఫీ కాకపోవచ్చని, అలాంటి వారిలోనూ అర్హులుంటే తప్పకుండా మాఫీ చేస్తామని చెప్పారు.