అనుమతి తీసుకోకుంటే అనుమతించం
ముద్రగడ పాదయాత్రపై సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: ఎలాంటి అనుమతి తీసుకోకుండా ముద్రగడ పద్మనాభం పాదయాత్ర చేస్తానంటే అనుమతించే ప్రశ్నేలేదని, చట్ట ప్రకారం అనుమతి తీసుకుంటే అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఉండవల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసులో గురువారం ఆయన టీడీపీ సమన్వయ కమిటీతో సమావేశమయ్యారు. కాపు కార్పొరేషన్ ద్వారా ఆ సామాజిక వర్గానికి భారీ ఎత్తున రుణాలు ఇస్తూ.. న్యాయం చేయడంపై దృష్టి సారించామన్నారు. ముద్రగడ పద్మనాభం మాత్రం వ్యక్తిగత లబ్ధి కోసం రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. అనుమతి తీసుకోకుండా పాదయాత్రకు సిద్ధమవడం వల్లే ఆయన్ను అడ్డుకున్నామన్నారు.
కాల్ సెంటర్(1100) ద్వారా చేసిన సర్వేలో అధిక శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారని, మొత్తమ్మీద ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలపై ప్రజలు సంతృప్తితో ఉన్నారని చెప్పారు. దీనిని పార్టీ కార్యకర్తలు ఓట్లుగా మలిచేలా చూడాలని సూచించారు. జన్మభూమి కమిటీల వల్ల చాలా చోట్ల సమస్యలు వస్తున్నాయని, వాటిని ప్రక్షాళన చేయకపోతే ఎన్నికల్లో పార్టీకి ఇబ్బందులు తప్పవని ఆందోళన వ్యక్తం చేశారు. నంద్యాల ఉప ఎన్నికల నుంచే ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు.