‘మంజునాథ’ నివేదిక రాగానే కేంద్రానికి
టీడీపీ కాపు నేతల ఆత్మీయ సమ్మేళనంలో సీఎం
సాక్షి, అమరావతి: బీసీ రిజర్వేషన్‌ల కోసం నియమించిన మంజునాథ కమిషన్ నివేదిక అందగానే మంత్రిమండలి ఆమోదించి కేంద్రానికి పంపిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కాపు నాయకుల ఆత్మీయ సమ్మేళనం సోమవారం విజయవాడలోని వెన్యూ కన్వెన్షన్ హాలులో జరిగింది. పార్టీ కాపు నాయకులు పాల్గొన్న సభకు ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాపులను బీసీల్లో చేరుస్తామని ఎన్నికల ప్రణాళికలో చేర్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనన్నారు.
సాధ్యమైనంత త్వరలో ప్రభుత్వానికి మంజునాథ కమిషన్ నివేదిక అందుతుందని చెప్పారు. అయితే ఈ సమావేశానికి మంత్రి గంటా శ్రీనివాసరావు గైర్హాజరవ్వడం చర్చనీయాంశమైంది. ముద్రగడ పద్మనాభంపై ప్రభుత్వ తీరుకు నిరసనగానే ఆయన సమావేశానికి రానట్లు తెలుస్తోంది.
రీజినల్ హబ్‌గా తిరుపతి
తిరుపతి: తిరుపతిని రీజినల్ హబ్‌గా అభివృద్ధి చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఆయన తిరుపతి పర్యటనలో భాగంగా మొదటిరోజు పలు నూతన భవనాలను సోమవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా రాత్రి మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో తిరుపతి, వైజాగ్, రాజధాని ప్రాంతాన్ని ప్రాంతీయ హబ్‌లుగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. అందులో భాగంగానే తిరుపతిలో అవినీతి నిరోధకశాఖ ఇంటెలిజెన్స్, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్సుమెంట్ ప్రాంతీయ కార్యాలయాలను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని అరికట్టేందుకు తీసుకొచ్చిన 1100 కాల్ సెంటర్‌ను అవినీతి నిరోధకశాఖ పరిధిలోకి తీసుకురానున్నట్లు చెప్పారు.