అమరావతి (గుంటూరు) : అభివృద్ధి, సంక్షేమం, ప్రజల సంతృప్తి గీటురాళ్లుగా ఉద్యోగుల బదిలీ ప్రక్రియను పూర్తిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ప్రభుత్వ పరిపాలనలో ముఖ్య భూమికగా ఉండే ఉద్యోగ వ్యవస్థ నుంచి ఉత్తమ బృందాలను ఎంపిక చేయడం కోసమే బదిలీల ప్రక్రియను చేపట్టామని ఆయన చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ముఖ్యమంత్రి మంగళవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శులు, వివిధ జిల్లాల కలెక్టర్లతో సమీక్షించారు. ప్రభుత్వం ప్రతి ఉద్యోగితో పని చేయించుకోక తప్పదని, క్రమశిక్షణ, బాధ్యత మరచిన ఉద్యోగులను పక్కనపెట్టడం కూడా అవసరమేనని ముఖ్యమంత్రి అన్నారు. ఉద్యోగులు అందరూ సమానమేనని, అందరినీ సమ దృష్టితోనే చూస్తూ, బదిలీ మార్గదర్శకాలను కచ్చితంగా అనుసరించాలని చెప్పారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేయడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చేవారికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, అవసరమైతే వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఉద్యోగస్తులెవరూ బదిలీని భారంగా కాకుండా బాధ్యతగా తీసుకోవాల్సివుందని అన్నారు. రకరకాల ఒత్తిళ్లతో ఇష్టానుసారం బదిలీలు చేస్తే ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుందని, ఈ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.
రాజకీయ, అధికార వ్యవస్థల మధ్య సమన్వయం సాధించి బదిలీ ప్రక్రియను ఎలాంటి వివాదాలు లేకుండా చేయడం కోసమే ఇప్పటికి పలుమార్లు వీడియో కాన్ఫరెన్సుల ద్వారా ప్రత్యక్ష పర్యవేక్షణ చేస్తున్నానని ముఖ్యమంత్రి చెప్పారు. అందరిదీ ఒకే లక్ష్యంగా ఉన్నప్పుడు బదిలీ ప్రక్రియలో కలెక్టర్లు, మంత్రుల మధ్య ఎక్కడా అభిప్రాయ బేధాలు ఉండరాదని అన్నారు. కలెక్టర్లు, కార్యదర్శులు, మంత్రులు, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులు ఈ రెండు రోజులు సమన్వయంతో పనిచేసి బెస్ట్ టీమ్స్ ఎంపికపై దృష్టి పెట్టాలని చెప్పారు.
అన్ని శాఖలలో బదిలీ ప్రక్రియ మొత్తం బుధవారం సాయంత్రానికల్లా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వ్యవసాయ పనులు ఇప్పటికే ప్రారంభమైన దృష్ట్యా ఆ శాఖ తప్పించి మరే శాఖకు మినహాయింపు ఇవ్వడం లేదని వివరించారు. బదిలీ ప్రక్రియను ఇంతవరకు చేపట్టని ఆరోగ్యశాఖ, మరో రెండు రోజులు గడువు అడుగుతున్న విద్యాశాఖ తక్షణం బదిలీ ప్రక్రియను చేపట్టి అనుకున్న గడువులోగా పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. వ్యవసాయశాఖలో బదిలీలను ఆగస్టు మాసంలో ఆరంభించి పూర్తి చేస్తామని తెలిపారు. కొత్త విద్యాసంవత్సరం ఇప్పటికే ఆరంభమైనందున విద్యాశాఖలో బదిలీలను ఇంతకుముందే పూర్తి చేసి ఉండాల్సిందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.
ఒకసారి బదిలీ జరిగితే మూడేళ్లు తమను ఎవరూ ముట్టుకోరని ఉద్యోగులు భావించరాదని, సక్రమంగా విధులు నిర్వర్తించనివారిని ఎప్పుడు ఎక్కడికైనా బదిలీ చేసే హక్కు ప్రభుత్వానికి ఉంటుందని సమీక్షలో పాల్గొన్న ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. వివిధ జిల్లాల నుంచి మంత్రులు, కలెక్టర్లు, హైదరాబాద్ నుంచి ప్రభుత్వ కార్యదర్శులు సమీక్షలో పాల్గొన్నారు.
'ఏజెన్సీలో పనిచేస్తే ప్రోత్సాహకాలు'
Published Tue, Jun 21 2016 4:48 PM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM
Advertisement