
నరసరావుపేట: ప్రత్యేక హోదా సాధించడంలో ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు విఫలమయ్యారని వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు విమర్శించారు. ఈ మేరకు కౌన్సిల్ హాల్‌లో ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. కౌన్సిల్ సమావేశం వాకౌట్ చేసి మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం ఎదురుగా ప్లకార్డులు ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలంటూ నినాదాలు చేశారు. శనివారం చైర్మన్ నాగసరపు సుబ్బరాయగుప్తా అధ్యక్షతన కౌన్సిల్ అత్యవసర సమావేశం నిర్వహించారు.
సమావేశం ప్రారంభంకాగానే కౌన్సిలర్లు అందరూ ప్రత్యేక హోదా జిందాబాద్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. మాజీ ప్లోర్ లీడర్ మాగులూరి రమణారెడ్డి, కౌన్సిలర్ మాడిశెట్టి మోహనరావు మాట్లాడుతూ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నాలుగేళ్ల నుంచి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇన్నాళ్లు పట్టించుకోనందువల్లనే రాష్ట్రానికి హోదా రాలేదన్నారు. దీనిపై టీడీపీ కౌన్సిలర్ పోకా శ్రీనివాసరావు మాట్లాడుతూ హోదా కోసం చిత్తశుద్ధితో సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.
చైర్మన్ గుప్తా మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ, ముఖ్యమంత్రి, స్పీకర్ కోడెల శివప్రసాదరావుతో పాటు అంతా హోదా కోసం పోరాడుతున్నారని చెప్పారు. ముందుగా అజెండాలోని అంశాలపై మాత్రమే మాట్లాడి చర్చించాలని సూచించారు. దీనిపై మాడిశెట్టి మాట్లాడుతూ పార్లమెంటులోనే ఎంపీలు అందరూ హోదా కోసం పోరాడుతున్నారని చెప్పారు. తామంతా హోదా కోసం కౌన్సిల్‌ను వాకౌట్ చేస్తున్నామంటూ వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment