నెల్లూరు(టౌన్): ఆర్టీసీ బస్సులన్నీ దళిత తేజం సభ బాట పట్టడంతో ప్రయాణికులు అవస్థలుపడ్డారు. జిల్లా నలుమూల నుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి బస్సుల్లో జనాన్ని తరలించారు. బస్సుల్లేక జిల్లాలోని పలు బస్టాండ్లలో ప్రయాణికులు గంటలతరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దొరికిన ఏదో ఒక వాహనాన్ని ఆశ్రయించి గమ్యస్థానానికి చేరుకున్నారు. సభలో సరైన సౌకర్యాలు ఏర్పాటుచేయకపోవడంతో కార్యకర్తలు, ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. దళితతేజం తెలుగుదేశం ముగింపు సభను శనివారం నెల్లూరు నగరంలో నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఆశించిన స్థాయిలో జనాలు రాలేదని టీడీపీ ముఖ్యనేతలే చర్చించుకున్నారు.
ఆలస్యం.. ఆకట్టుకోని సీఎం ప్రసంగం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దళిత తేజం సభకు గంటన్నర ఆలస్యంగా చేరుకున్నారు. నిర్ణయించిన దాని ప్రకారం మధ్యాహ్నం 3.10 గంటలకు రావాల్సి ఉండగా 4.40 కి సభాస్థలికి చేరుకున్నారు. సుమారు 40 నిమిషాల పాటు ప్రసంగించారు. ఆయన ప్రసంగిస్తుండగానే సభకు వచ్చిన జనం తిరిగి వెళ్లిపోవడం కనిపించింది. ఐదు గంటలకే తమకు కేటాయించి వాహనాల వద్దకు చేరుకున్నారు.
ప్రజల తరలింపునకు 500 ఆర్టీసీ బస్సులు
సీఎం సభకు జనాన్ని తరలించేందుకు టీడీపీ నేతలు జిల్లా వ్యాప్తంగా 500 ఆర్టీసీ బస్సులను తీసుకున్నారు. ఆర్టీసీ సంస్థకు ఉన్న బస్సుల్లో 70శాతం బస్సులు సభకు వినియోగించారు. దీంతో ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తప్పని పరిస్థితుల్లో ప్రయాణికులు ప్రైవేటు వాహనాలు, ఆటోలను ఆశ్రయించాల్సి వచ్చింది. దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు కొంతమంది ఇతర డిపోల బస్సుల్లో ప్రయాణించారు. మరికొంతమంది తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. సరిపడా బస్సులు లేకపోవడంతో ఆర్టీసీ డిపోల్లో గంటల తరబడి బస్సుల కోసం వేసి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదే అదునుగా ప్రైవేటు వాహన యజమానులు ప్రయాణికుల నుంచి భారీగా చార్జీలు వసూలు చేశారు. ఉద్యోగులు, వ్యాపారులు, ఇతర వర్గాల వారి పనులకు సైతం ఆటంకాలు కలిగాయి. ఇతర జిల్లాల నుంచి కూడా భారీగా ఆర్టీసీ బస్సులను సీఎం సభకు తరలించారు. ప్రధానంగా చిత్తూరు, కడప, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి ఎక్కువగా ఆర్టీసీ బస్సులు వచ్చాయి. దీంతో ఆ ప్రాంతాల్లో కూడా బస్సుల కోసం ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
సభకు 200 స్కూల్ బస్సులు
పార్టీ కార్యక్రమాలకు విద్యాసంస్థ వాహనాలను వినియోగించరాదన్న నిబంధనలను తెలుగుదేశం ప్రభుత్వం తుంగలో తొక్కింది. ఏకంగా పాఠశాలలకు సెలవు ప్రకటించి 200కుపైగా స్కూల్ బస్సులను సీఎం సభకు వినియోగించారు. సాధారణంగా స్కూల్ బస్సులను ఇతర కార్యక్రమాలకు వినియోగించే సమయంలో రవాణా కార్యాలయం ద్వారా పర్మిట్‌ను పొందాల్సి ఉంది. వీటితో ఏమీ సంబంధంలేకుండా వారి ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. కొన్ని ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు స్వచ్ఛందంగా బస్సులను పంపించగా, మరికొన్ని విద్యా సంస్థల యాజమాన్యాలను రవాణాశాఖ అధికారులు బెదిరించి బస్సులు తీసుకెళ్లిన సంఘటనలు జిల్లాలో చోటుచేసుకున్నాయి. సభలో ఆశా వర్కర్లు ఎక్కువగా కనిపించారు.
అసౌకర్యాలతో ప్రజలు ఇబ్బందులు
సీఎం చంద్రబాబు మధ్యాహ్నం 3.30కు వస్తున్నారని టీడీపీ నేతలు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆయన సాయంత్రం 4.37 నిమిషాలకు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. బస్సులో 10 నిమిషాలు పైన మంత్రులతో సమాలోచన జరిపారు. అనంతరం 4.50 నిమిషాలకు సభావేదికపైకి చేరుకున్నారు. సీఎం వస్తున్నారంటూ మధ్యాహ్నం 12గంటల నుంచే టీడీపీ నేతలు జనాలను తరలించడం ప్రారంభించారు. ఇతర జిల్లాల నుంచి ఉదయం 10 గంటలకే వివిధ వాహనాల్లో సభా ప్రాంగణం వద్దకు తీసుకొచ్చారు. అయితే జనాలను తరలించిన టీడీపీ నేతలు వారికి కనీస సౌకర్యాలను కల్పించడంలో శ్రద్ధ చూపలేదు. కొందరికి మాత్రమే భోజనం ఏర్పాటు చేశారు. చాలా మంది ప్రజలు భోజనం లేక ఇబ్బందులు పడ్డారు. కనీసం స్నాక్స్ ఇచ్చిన పరిస్థితి కూడా అక్కడ కనిపించలేదు. ప్రధానంగా సభలో తాగునీరు సరఫరా చయకపోవడంతో వచ్చిన ప్రజలు దాహార్తికి ఇబ్బందులు పడ్డారు. వాలంటీర్లుగా ఉన్న కార్యకర్తలు ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలం చెందారని తెలుగు తమ్ముళ్లే చర్చించుకున్నారు.
సీఎం ప్రసంగిస్తుండగానే జారుకున్న ప్రజలు
సీఎం చంద్రబాబునాయుడు ప్రసంగం పూర్తికాకుండానే ప్రజలు సభ నుంచి చల్లగా జారుకున్నారు. కొందరు టీడీపీ నేతలు వారిని ఆపే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండాపోయిది. సభలో అక్కడక్కడా కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. అప్పటికే సభ ప్రారంభం ఆలస్యం కావడంతో తీవ్ర అసహనానికి లోనైన ప్రజలు సభ నుంచి ఒక్కొక్కొరిగా వెనుదిరిగారు. సీఎం ప్రసంగిస్తుండగా మైకు పలుమార్లు మొరాయించింది. దీంతో సీఎం చంద్రబాబు కొంత అసహనం ప్రదర్శించారు. అయితే సీఎం దృష్టిలో పడేందుకు పలువురు తెలుగు తమ్ముళ్లు పోటీ పడ్డారు. దళిత తేజం సభ కావటంతో వేదికపై ముందు వరసలో దళిత నేతలకు చోటు ఇవ్వాలని పదేపదే ప్రకటించినా రాఫ్ట్ర మంత్రులు, ఇతర నేతలు ముందు వరసలో ఉండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment