మనం ఓ ఇల్లు కట్టుకున్నామనుకోండి... పునాది రాయి వేసిన సమయంలో దగ్గరవారిని ... గృహ ప్రవేశానికి తెలిసినవారందరినీ, బంధువర్గాన్ని అవసరమైతే అద్దె బస్సులో వారిని గౌరవప్రదంగా ఆహ్వానించడం సంప్రదాయం. కానీ పునాది పూర్తయిన తరువాత, గోడల నిర్మాణం అనంతరం, ద్వారబంధాలు పెట్టిన సమయంలో, చెక్క సున్నాలు వేసినప్పుడు, రంగులు అద్దినప్పుడల్లా ఎవరైనా జనాన్ని పిలుస్తారా...అంతెందుకు సీఎం చంద్రబాబు నాయుడైతే అలా చేస్తారా...చెయ్యరు...ఎందుకంటే అది పద్ధతి కాదు కాబట్టి. ప్రతిసారీ జేబుకి చిల్లులు పెట్టించుకోరుకదా...అది మన సొంత జేబు, అందుకే అంత జాగ్రత్త. మరి ఈ బాబు సర్కారేమిటి...అమరావతి రండి...రాజధానిని చూడండి, పోలవరం సోయగం తిలకించండి, ధర్మపోరాట దీక్షలో మా ఆరాటాన్ని అర్థం చేసుకోండంటూ ఆర్టీసీ బస్సులను భారీగా హస్తగతం చేసుకొని తరలిస్తోంది. ఇదేదో వారి పార్టీ ఖర్చుతో అయితే సరే...కానీ సర్కారు సొమ్ముతో ఈ సోకులేమిటి...?అదే ‘ఫార్టీ ఇయర్ ఇండస్ట్రీ ఎక్స్‌పీరియన్స్’తో చేస్తున్న బాబు అరాచకం.
సాక్షి ప్రతినిధి,తూర్పుగోదావరి , కాకినాడ : ప్రయాణికుల సౌకర్యాలను పక్కకు నెట్టేసి తమ ప్రచారం కోసం ఆర్టీసీ బస్సులను బాబు సర్కారు దుర్వినియోగం చేస్తోంది. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఆర్టీసీ సర్వీసులను తరచుగా మళ్లిస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు వస్తాయో రావో తెలియక బస్టాపుల వద్ద జనం పడిగాపులు కాస్తున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. పరిపాలనలో భాగంగా తీసుకున్న నిర్ణయాలు తమ గొప్పతనమేనని నమ్మించడానికి రాష్ట్ర నలుమూలల నుంచి వివిధ వర్గాలను రాజధానికి తీసుకు వెళ్లి సన్మానాలు చేయించుకుంటున్నారు.
కృతజ్ఞతా సభల పేరుతో దాదాపు అన్ని జిల్లాల నుంచి అమరావతికి తరలిస్తున్నారు. ఇక్కడితో ఆగకుండా ధర్మపోరాట దీక్షల పేరుతో రాష్ట్ర నలుమూలల నుంచి సభా వేదికల వద్దకు జనాల్ని రప్పిస్తున్నారు. ఇక, పోలవరం ప్రాజెక్టు సందర్శన అని, అమరావతి సందర్శన అని పెద్ద ఎత్తున జిల్లాల నుంచి టీడీపీ అనుయాయులను తీసుకు వెళ్లి, అక్కడేదో జరిగిపోతోందంటూ భ్రమలు కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా జరుగుతున్న తంతు ఇదే.
ప్రజాధనం దుర్వినియోగం...
ఎన్ని బస్సులైతే తరలిస్తున్నారో వాటికయ్యే వ్యయాన్ని సంబంధిత శాఖల నిధుల నుంచి వెచ్చిస్తున్నారు. దీంతో వారి విలాసాలు, సత్కారాలు, ప్రచారం కోసం ప్రభుత్వ నిధుల్ని దుబారా చేస్తున్న తీరుపై జనం మండిపడుతున్నా ‘నవ్విపోదురు గాక నాకేమి సిగ్గ’ంటూ ముందుకు సాగిపోతున్నారు. అడ్డు చెప్పాల్సిన సంబంధితాధికారులు కూడా ప్రేక్షకపాత్ర పోషించడంతో అధికారపార్టీ నేతల ఆటలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి.
♦ గత నవంబర్ 27న విజయనగరంలో జరిగిన ధర్మపోరాట దీక్షకు జిల్లా నుంచి 345 బస్సులు తరలించడంతో రెండు రోజులపాటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దారి మళ్లించిన బస్సులను వినియోగించిన దృష్ట్యా రూ. కోటి 57 లక్షలు మేర ఆర్టీసీకి చెల్లింపులు చేశారు.
♦ డిసెంబర్ 22న శ్రీకాకుళంలో జరిగిన ధర్మపోరాట దీక్షకు 295 బస్సుల ద్వారా జిల్లా నుంచి జనాల్ని పంపించారు. ఆ రోజు కూడా ప్రయాణికులదీ అదే దుస్థితి. ఆ ఒక్క రోజు వెళ్లిన బస్సుల కోసం రూ. కోటి 47లక్షలు చెల్లింపులు చేశారు. అలాగే, పోలవరం సందర్శన కోసం నవంబర్, డిసెంబర్‌లో 159 బస్సులు వెళ్లాయి. రూ.31లక్షలు మేర ఆర్టీసీకి చెల్లించింది.
♦ ఇవే కాకుండా అమరావతి సందర్శన కోసం డిసెంబర్ 28వ తేదీ నుంచి ఫిబ్రవరి 7వ తేదీ వరకు 60 బస్సుల్ని జిల్లానుంచి వినియోగిస్తున్నారు.
ఏమీటీ కష్టాలు...
ఎంతకీ బస్సులు రాకపోవడంతో బస్టాపుల వద్ద ప్రజలు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. చివరికి బస్సులు రాకపోవడంతో ప్రైవేటు సర్వీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. సర్వీసులను రద్దు చేస్తున్నామని కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదు. ఈ నెల 25వ తేదీన విశాఖలో జరగనున్న డీఆర్‌డీఏ సమావేశానికి, ఈ నెల 27న రాజమహేంద్రవరంలో జరగనున్న బీసీ సభకు పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్సులను రిజర్వు చేస్తున్నారు. విశాఖపట్నం సమావేశానికి 240 బస్సులు సిద్ధంగా ఉంచాలని ఇప్పటికే ఇండెంట్ కూడా ఇచ్చారు. ఈ సంఖ్య మరింత పెరగొచ్చని, దానికి తగ్గట్టుగా బస్సులను అందుబాటులో ఉంచాలని ఆర్టీసీ అధికారులకు సూచనప్రాయంగా ఆదేశాలిచ్చారు. ఇలా ఆర్టీసీ బస్సులను తమ పబ్లిసిటీ కోసం వాడుకోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడటమే కాకుండా వాటికయ్యే ఖర్చుకు వివిధ శాఖల నుంచి నిధుల్ని మళ్లిస్తున్న పరిస్థితి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment