చింతపల్లిలో బస్సుల కోసం వేచి ఉన్న విద్యార్థులు
చింతపల్లి(పాడేరు): ముఖ్యమంత్రి చంద్రబాబు చోడవరం పర్యటన నేపథ్యంలో ఈ ప్రాంతానికి వచ్చే ఆర్టీసీ బస్సులను చాలా వరకు రద్దు చేశారు. దీంతో వివిధ గ్రామాల నుంచి రాకపోకలు సాగించే ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గురువారం రాత్రి 8 గంటల వరకు బస్సులకోసం పాత కాంప్లెక్స్ వద్ద ఎముకలు కొరికే చలిలో గజగజ వణుకుతూ పిల్లలు ఎదురు చూశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చోడవరంలో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని ప్రారంభించేందుకు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో జనాలను తరలించడం కోసం ఈ ప్రాంతంలో తిరిగే బస్సులను వినియోగించారు. స్థానిక సెయింట్ ఆన్స్ ప్రైవేటు పాఠశాలలో చింతపల్లి, గూడెంకొత్తవీధి మండలాల్లోని పలుగ్రామాలకు చెందిన విద్యార్థులు చదువుతున్నారు. వారంతా ప్రతి రోజు బస్సుల్లో వచ్చి వెళుతుంటారు. గురువారం బస్సులు రద్దు చేయడంతో బడికివచ్చి న విద్యార్థులు తిరగివెళ్లే అవకాశం లేక పాతబస్టాండ్ వద్ద ఉండిపోయారు. దీంతో స్థానికులు వారి గ్రామాలకు ఫోన్ల ద్వారా సమాచారం అందించి వారి కుటుంబ సభ్యులను రప్పించి తీసుకువెళ్లే ఏర్పాట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment