మహిళలను వంచించిన చంద్రబాబు | Cm chandrababu Naidu deprive women | Sakshi

మహిళలను వంచించిన చంద్రబాబు

May 23 2015 4:17 AM | Updated on Sep 29 2018 6:00 PM

ఎన్నికల సమయంలో డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి రాగానే షరతులు విధించి మహిళలను...

షరతులు లేకుండా డ్వాక్రా రుణాలు మాఫీ చేయాలి
డ్వాక్రా సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ స్వరూపరాణి

 
 అనంతపురం సిటీ : ఎన్నికల సమయంలో డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి రాగానే షరతులు విధించి మహిళలను వంచిస్తున్న దగాకోరు చంద్రబాబు అని డ్వాక్రా సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ కె.స్వరూపరాణి  ఆరోపించారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని ప్రకటించడంతోనే మహిళలు ఆశతో తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారన్నారు. ప్రమాణ స్వీకారం రోజు  డ్వాక్రా రుణాల మాఫీ ఫైలుపై ఆయన సంతకం చేశారని గుర్తు చేశారు. 

మొత్తం రుణమాఫీ చేస్తానన్న చంద్రబాబు  ఇప్పుడు ఒక్కో గ్రూపునకు రూ.లక్ష ఇస్తానని అంటూనే ఆ లక్ష రూపాయలను కూడా 3 దఫాలుగా బ్యాంకులో వేస్తామని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. పైగా బ్యాంకులో వడ్డీ డబ్బు  మూల ధనంగా ఉండాలి తప్ప వ్యక్తిగతంగా వాడుకోవడానికి వీల్లేదని చెప్పడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిం చారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు మాటలు విని రుణాలు తిరిగి కట్టని గ్రూపులకు వడ్డీ భారం పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో 6,57,538 గ్రూపుల్లో 69,84,569 మంది సభ్యులుగా ఉన్నారన్నారు. బకాయిలు మొత్తం రూ.14,699 కోట్లు ఉన్నాయన్నారు. రుణమాఫీ చేయకుండా మొదటి విడత ఒక్కో గ్రూపునకు రూ.30 వేలు బ్యాంకులో వేస్తామనడం, ఆ డబ్బు వ్యాపార లావాదేవీలకు ఉపయోగించాలని చెప్పటాన్ని ఖండిస్తామన్నారు. మరోపక్క ఆధార్ కార్డు లేదనే వంకతో 11 లక్షల మందికి పథకాన్ని వర్తింప జేయకపోవడం దారుణమన్నారు.  రుణమాఫీ హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఐద్వా జిల్లా కార్యదర్శి సావిత్రి, నగర కార్యదర్శి చంద్రిక, అరుణ తదితరులు పాల్గొన్నారు.

 భోజన పథకం కార్మిక సమస్యలు పరిష్కరించండి
 అనంతపురం టౌన్ : మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన చేపడతామని ఏపీ మధ్యాహ్న బోజన పథకం కార్మికుల సంఘం రాష్ట్ర కార్యదర్శి స్వరూపరాణి అన్నారు.స్థానిక  సీపీఎం కార్యాలయంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్షునిగా పి.నారాయణని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.  అనంతరం సభ్యులతో కలిసి డీఈఓను కలిసి సమస్యలు వివరించారు.

బకాయి బిల్లులు చెల్లించాలని,  వంట షెడ్లు నిర్మించాలని, కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, పాఠశాలలకే బియ్యం సరఫరా చేయాలని కోరారు.  సీఐటీయూ జిల్లా కార్యదర్శి చంద్రమోహన్, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి నాగేంద్ర, మధ్యాహ్న భోజన పథకం  జిల్లా ప్రధాన కార్యదర్శి నాగమణి, నాయకులు సోమశేఖర్, పద్మావతి, లక్ష్మిదేవి, శుభలత, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement