పడమటి మండలాలకు పట్టిసీమ నీళ్లు
- నాహయాంలోనే చెరువుల పూడిక తీత
- డబ్బు కంటే నీటికి విలువ పెరిగింది
- ఇంటర్నెట్ పెట్టిస్తా.. బిరియానీ వండుకోండి
- ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణతశాతం పడిపోయింది
- ఇక ఉపాధ్యాయులకు సామర్థ్య పరీక్షలు
- పలమనేరు పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
సాక్షి, చిత్తూరు/ పలమనేరు: మదనపల్లె, పుంగనూరు ప్రాంతాలకు ఈ ఏడాదిలోనే హంద్రీ-నీవా ద్వారా కృష్ణ నీటిని తరలించి తాగునీటి సమస్యను పరిష్కానని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. శుక్రవారం పలమనేరులో పర్యటించిన ఆయన బొమ్మిదొడ్డి గ్రామం కని కల చెరువులో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించా రు. హంద్రీ నీవాను పూర్తిచేసి పట్టిసీమ ద్వారా కృష్ణ నీటిని చిత్తూరు జిల్లాకు తరలిస్తామన్నారు.
చెరువుల్లోకి నీరు వచ్చిన తరువాత అందరూ చేపలను పెంచుకుని వ్యాపారం చేసుకోవాలని సీఎం రైతులకు సూచించారు. వచ్చే ఏడాది నాటికి మొత్తం పడమటి మండలాలకు కృష్ణ నీటిని తరలిస్తామన్నారు. కుప్పం, మదనపల్లె, చిత్తూరుకు సైతం నీళ్లిస్తామన్నారు. డబ్బు కంటే నీటికి విలువ పెరిగిందన్నారు. నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు. బిందు, తుంపర సేద్యాలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. వాటికి 90 శాతం సబ్సిడీ ఇస్తామన్నారు. కూరగాయల పంటలను ఎక్కువగా సాగుచేయాలన్నారు. జిల్లాలో తాగునీటి సమస్య అధికంగా ఉందన్నారు. తాగునీటి సరఫరా కోసం నెలకు రూ.7 కోట్లు ఖర్చుచేస్తున్నట్లు చెప్పారు. తన హయంలోనే చెరువుల పూడికతీత జరుగుతోందని ముఖ్యమంత్రి చెప్పారు.
ఇంటింటికీ ఇంటర్నెట్
ఇంటింటికి రూ.100కే ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఇంటర్నెట్ ద్వారా అన్ని చూసుకోవచ్చన్నారు. విద్యార్థులు పాఠశాలలకు ఎగనామం పెట్టినా ఇంటర్నెట్‌లో తల్లిదండ్రులు చదువు చెప్పవచ్చన్నారు. భార్యభర్తలు రోజూ సినిమాలు చూసుకోవచ్చన్నారు. మహిళలు పనుల మీద బయటకెళ్తే భర్త లు ఇంటర్నెట్‌లో చూసి బిరియానీ వండుకుని తినవచ్చన్నారు. అప్పులు చేసి అయినా సరే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. ప్రజలందరి పేరున అప్పులు తెచ్చి వడ్డీలు కట్టి అభివృద్ధి చేస్తామన్నారు. డ్వాక్రా మహిళలకు ఒక్కొక్కరికి రూ.3 వేల చొప్పున బ్యాంకు అకౌంట్లలో జమచేసినట్లు ప్రకటించారు. 20 సంవత్సరాల్లో పొదుపు చేసిన దానికంటే నాలుగురేట్లు ఎక్కు వ ఇస్తున్నామన్నారు. తాను ముఖ్యమంత్రి అయ్యాకే వ్యవసాయాధికారులు పొలాల్లోకి వస్తున్నారన్నారు.
అయ్యోర్లోకూ.. పరీక్షలు
ప్రతి ఏడాది విద్యార్థులకే కాకుండా ఉపాధ్యాయులకు సైతం సామర్థ్య పరీక్షలు పెడతామని ముఖ్యమంత్రి ప్రకటించారు. బీఈడీ చదివిన ఉపాధ్యాయులు చదువులు చెబుతుంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం పడిపోతోందని, అదే అరకొర చదువులు చదివిన ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయులు చదువులు చెబుతుంటే అక్కడ ఉత్తీర్ణత శాతం ఎలా పెరుగుతోందని అధికారులను సీఎం ప్రశ్నించారు. అందు కే ఇక నుంచి ప్రతి ఏడాదీ ఉపాధ్యాయులకు సైతం సామర్థ్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. తొలుత మూడు, ఐదు, ఏడు, తరగతుల టీచర్లకు ఈ-పరీక్షలు పెడతామన్నారు. ప్రాథమిక విద్యలో మనరాష్ట్రం 29 స్థానంలో ఉండడం చాలా బాధాకరమని దీనిపై టీచర్లు సీరియస్‌గా ఆలోచించాలన్నారు. మీ పిల్లలను ఎలా చదివి స్తారో అదే విధంగా పేద పిల్లలను మీ పిల్లలుగా భావించి వారికి మంచి జీవితాలను అందివ్వాలని హితవు పలికారు.
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం ఏటా విద్యార్థుల వివరాలతో కంప్యూటర్ డేటా పెట్టి ఇందులో మంచి పొజిషన్ లో ఉన్న పూర్వపు విద్యార్థుల జాబితాను సిద్ధం చేయాలన్నారు. వారితో సమావేశాలు ఏర్పాటు చేసి వారి ద్వారా విరాళాలు సేకరించి కార్ఫస్‌ఫండ్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మం త్రులు దేవినేని ఉమామహేశ్వర రావు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎంపీ శివప్రసాద్, ఎమ్మెల్సీలు ముద్దుకృష్ణమనాయుడు, గౌనివారి శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు సత్యప్రభ, ఆదిత్య, శంకర్, మాజీ ఎమ్మెల్యేలు కుతూహలమ్మ, లలితకుమారి తదితరులు పాల్గొన్నారు.