రాజకీయాల నుంచి తప్పుకుంటా: కిరణ్
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చకు గడువు రేపటితో ముగియనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సంచలనల వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి పంపిన బిల్లు ఉన్నది ఉన్నట్టు పార్లమెంట్లో ప్రవేశపెడితే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన అన్నారు. బిల్లుపై హోంశాఖ రాష్ట్రపతిని మోసం చేసినట్లుందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్టప్రతి నుంచి వచ్చే బిల్లులో లోపాలు లేకుండా చూడాల్సిన బాధ్యత హోంశాఖపై ఉందన్నారు. బిల్లులోని లోపాలను సరిచేయమని కోరడం లేదు బిల్లును తిరస్కరిస్తున్నట్టు అసెంబ్లీలో తీర్మానం చేయమని కోరుతున్నామని వివరించారు.
అసెంబ్లీ లాబీలో మీడియాతో సీఎం ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఏకాభిప్రాయంతోనే గతంలో రాష్ట్రాలు ఏర్పాటయ్యాయని గుర్తు చేశారు. విభజనకు కారణాలు, లక్ష్యాలు ఉన్న విభజన బిల్లు కావాలన్నారు. ఇదే బిల్లు పార్లమెంటులో పెట్టాలని సవాల్ చేశారు. ఇదే బిల్లు పార్లమెంటుకు పంపితే అస్సలు అడ్మిట్ కాదని చెప్పారు. ఒకవేళ అది జరిగితే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు.
సభకు అధికారం లేనప్పుడు ఓటింగ్‌పై నాయకులు ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. బిల్లుపై మళ్లీ పొడిగింపు అడగడంలో తప్పులేదన్నారు. బిల్లపై క్లాజులవారీగా చర్చ జరిపి తిరస్కరిస్తామన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో నిలిచిన రెబల్ అభ్యర్థులను ఉపసంహరించుకోమని చెప్పామని సీఎం తెలిపారు.