ఒంగోలు , న్యూస్‌లైన్: సమైక్యవాదినని చెప్పుకుంటున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వెంటనే తన పదవికి, పార్టీకి రాజీనామాలు చేసి ఉద్యమంలో పాల్గొనాలని వైఎస్‌ఆర్ సీఎల్‌పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని వైఎస్‌ఆర్ ఎంతగానో తపించేవారన్నారు. అందులో భాగంగానే రెండో ఎస్సార్సీకి మొగ్గు చూపారని, ప్రత్యేక తెలంగాణ వైపు మాత్రం దృష్టి సారించలేదని తెలిపారు. రాష్ట్ర సమైక్యత కోసమే పార్లమెంట్‌లో జగన్‌మోహన్‌రెడ్డి ప్లకార్డులు ప్రదర్శించారని గుర్తు చేశారు. తెలంగాణ రానుందని తెలియగానే తమ పార్టీ ఎమ్మెల్యేలం రాజీనామా చేశామని, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు పదవులను అంటిపెట్టుకుని ఉన్నారని వ్యాఖ్యానించారు.
జాతి ప్రయోజనాలకన్నా పదవులే ముఖ్యమనుకుంటున్న నాయకులకు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సమాయత్తం కావాలని బాలినేని పిలుపునిచ్చారు. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉంటూ సమైక్యవాదినంటే జనం నమ్మే స్థితిలో లేరన్నారు. విధి నిర్వహణ వరకు అంకితమైతే సహిస్తామని, ఉద్యమాన్ని అణిచివేయాలని యత్నిస్తే మాత్రం ‘డీఎం...గో బ్యాక్’ అంటూ కార్యక్రమం చేపట్టాల్సి వస్తుందని ఆర్టీసీ డిపో మేనేజర్‌ను హెచ్చరించారు. ఏపీఎన్‌జీఓస్ జిల్లా అధ్యక్షుడు బషీర్ మాట్లాడుతూ సకల జనుల సమ్మె విజయవంతం కావడంలో ఆర్టీసీ కార్మికులది ముఖ్యపాత్రన్నారు.
సమ్మెలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులపై యాజమాన్యం చర్యలు చేపడితే ఉద్యోగ సంఘాల జేఏసీ అండగా ఉంటుందని తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఎమ్మెల్యే విజయ్‌కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజీనామాలు చేయని సీమాంధ్ర ప్రజాప్రతినిధులందరికీ వ్యతిరేకంగా ఉద్యోగులు సమర శంఖారావం పూరిస్తామని హెచ్చరించారు. మరో నాయకుడు బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ సమైక్యాంధ్రపై కేంద్రమంత్రి చిరంజీవి, టీడీపీ నాయకుల వ్యాఖ్యలను ఎన్‌జీఓస్ మహిళా నాయకురాలు రాజ్యలక్ష్మి ఖండిం చారు. తాము కేవలం సమైక్యాంధ్రను మాత్రమే కోరుకుంటున్నామని స్పష్టం చేశారు. రాజధాని లాంటి సమస్యలను వేదికపైకి తీసుకురావొద్దంటూ సూచించారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఆర్టీసీ నాయకులు కేఎన్ రావు, వాకా రమేష్‌బాబు, తదితరులు మాట్లాడారు.
హైలైట్‌గా నిలిచిన వంటావార్పు
స్థానిక ఆర్టీసీ డిపోలో కార్మికుడు జీవీఆర్ రెడ్డి చేపట్టిన వంటావార్పు కార్యక్రమం సకల జనుల సమ్మెలో హైలైట్‌గా నిలిచింది. బస్టాండ్‌లో ఉదయం నాలుగు గంటల నుంచే కళాకారులు కేసీఆర్‌కు వ్యతిరేకంగా పాటలు పాడుతూ నృత్యం చేశారు. ఇదే సమయంలో ఎన్‌ఎంయూ, ఎంప్లాయీస్ యూనియన్‌కు చెందిన కార్మికులు ఆర్టీసీ ఔట్ గేటు వద్ద మానవహారం నిర్వహించారు. టైర్లను దహనం చేసి నిరసన తెలిపారు. అనంతరం ఆర్టీసీ గ్యారేజీ వద్దకు చేరుకొని బస్సులను బయటికి రాకుండా అడ్డుకున్నారు. అధికారులు బలవంతంగా కొన్ని బస్సులను తిప్పేందుకు సిద్ధమయ్యారు. బస్సులకు గాలి తీసేందుకు కార్మికులు యత్నించడంతో సర్వీసులు నిలుపుదల చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. వంటావార్పులో బాలినేని స్వయంగా పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
నల్లబ్యాడ్జిలతో జూనియర్ అధ్యాపకుల నిరసన
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనను నిరసిస్తూ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ల అధ్యాపకులు నల్లబ్యాడ్జిలు ధరించి నిరసన తెలిపారు. ఓట్లు, సీట్లు కోసం రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడం దారుణమన్నారు. ఏన్‌జీఓల సమ్మెకు మద్దతు ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రంగనాయకులు, వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లాలోని 30 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు స్వచ్ఛందంగా తరగతులు బహిష్కరించి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. వైఎస్‌ఆర్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలకు సంఘీభావం ప్రకటించారు. ఈ నెల 18న సీమాంధ్ర ప్రాంతంలోని 13 జిల్లాల సంఘ అధ్యక్ష, కార్యదర్శులు సమావేశమై ఎన్‌జీఎలతో పాటు సమ్మెలో పాల్గొనే విషయంలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
సీఎం సమైక్యవాదినంటే సరిపోదు
Published Wed, Aug 14 2013 6:13 AM | Last Updated on Fri, Sep 1 2017 9:50 PM
Advertisement