రాజధాని భూమిపూజకు శ్రీకారం
- భూమిపూజ చేయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
- తుళ్లూరు మండలం మందడం-తాళ్లాయపాలెం గ్రామాల మధ్య ఏర్పాట్లు
సాక్షి గుంటూరు/తుళ్లూరు : నూతన రాజధాని నిర్మాణానికి మరికొన్ని గంటల్లో శ్రీకారం చుట్టనున్నారు. తుళ్లూరు మండలం మందడం-తాళ్లాయపాలెం గ్రామాల మధ్య శనివారం ఉదయం 8.49 గంటలకు భూమిపూజ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మందడం గ్రామ రెవెన్యూ 136 సర్వే నంబర్‌లోని బెజవాడ సత్యనారాయణకు చెందిన స్థలంలో శాస్త్రోక్తంగా పూజ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొంటారు.
ఏర్పాట్ల పరిశీలన..
భూమిపూజ జరిగే ప్రాంతంలో భద్రతపై అధికారులు దృష్టి సారించారు. గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే, రూరల్ ఎస్పీ నారాయణనాయక్, భద్రత అధికారి జోషి శుక్రవారం ఏర్పాట్లను పరిశీలించారు. తొలుత సీఆర్‌డీఏ కార్యాలయంలో కలెక్టర్ మాట్లాడుతూ అధికార యంత్రాంగం సమన్వయంతో భూమిపూజకు అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. భూమిపూజకు అవసరమైన సామగ్రిని మందడం సర్పంచి ముప్పవరపు పద్మావతి, సుమారు కిలో వెండితో వెండిబొచ్చె, బంగారు పూత పూయించిన తాపీని అంగలకుదురుకు చెందిన రిటైర్డ్ జూనియర్ వెటర్నరీ అధికారి ఆలపాటి వెంకటరామయ్య కలెక్టర్‌కు అందజేశారు.
నేడు సీఎం క్యాంపు కార్యాలయం ప్రారంభం
సాక్షి, విజయవాడ : నగరంలోని జలవనరులశాఖ ప్రాంగణంలో సిద్ధం చేసిన సీఎం క్యాంపు కార్యాలయ భవనాన్ని చంద్రబాబు శనివారం ప్రారంభిస్తారని మంత్రి దేవినేని ఉమా తెలిపారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. శనివారం ఉదయం పది, పదకొండు గంటల మధ్యలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వచ్చి కొబ్బరికాయ కొట్టి లాంఛనంగా ప్రారంభిస్తారని వివరించారు. రాజధానికి భూమి పూజచేయనున్న నేపథ్యంలో అక్కడి ప్రజలను రెచ్చగొట్టేందుకే వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిరసన దీక్ష చేశారని మంత్రి ఉమా ఆరోపించారు.
పూర్తికాని సీఎం క్యాంపు కార్యాలయ భవనం
సీఎం క్యాంపు కార్యాలయం పూర్తిగా సిద్ధమయ్యేందుకు మరో మూడునెలలు పడుతుందని సమాచారం. లిప్టులు ఏర్పాటు, సీలింగ్, ఫ్లోరింగ్, మరమ్మతులు చేయాల్సి ఉంది. ప్రహరీ, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, ప్రత్యేక విద్యుత్ దీపాల అలకరణ పనులు జరుగుతున్నాయి. సీఎం వ్యక్తిగత సెక్యూరిటీకి కేటాయించిన భవనాల మరమ్మతులు పూర్తికాలేదు.
నేడు నగరానికి సీఎం రాక
విజయవాడ : ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు శనివారం నగరానికి రానున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం 7.15 గంటలకు విమానంలో బయలుదేరి 7.55 గంటలకు గన్నవరంలో దిగుతారు. అక్కడ్నుంచి 8 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి గుంటూరు జిల్లా మందడం వెళతారు. అక్కడ నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి భూమిపూజ చేస్తారు. 10 గంటలకు హెలికాఫ్టర్‌లో బయలుదేరి 10.20 గంటలకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో దిగుతారు. ఇరిగేషన్ కార్యాలయంలో నిర్మిస్తున్న సీఎం క్యాంప్ ఆఫీసును చంద్రబాబు ప్రారంభిస్తారు. అనంతరం హెలికాప్టర్‌లో గన్నవరం చేరుకుని విమానంలో వైజాగ్ వెళతారు. పోలీసులు గట్టి భద్రత చర్యలు తీసుకుంటున్నారు. పలుచోట్ల తనిఖీలు ముమ్మరం చేశారు. సీపీ ఎ.బి.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లు చేశారు.