సీఎంకు సామాన్యుల సమస్యలు పట్టవా?
- పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి
- గోదావరి పుష్కరాలకు రూ.1600 కోట్లు ఎందుకు?
- ప్రభుత్వ నిధులు స్వాహా చేయడానికే జన్మభూమి కమిటీలు
కేవీపల్లె : రాజమండ్రి పుష్కర సంబరాల్లో మునిగి తేలిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు రాష్ట్రంలో సామాన్య ప్రజల సమస్యలు పట్టవా ? అని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. మంగళవారం ఆయన మండలంలోని సొరకాయలపేట పంచాయతీ వంగిమళ్లవారిపల్లెలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గోదావరి పుష్కరాలకు రూ. 1600 కోట్లు కేటాయించి నిర్వహించడమెందుకన్నారు. అందులో కొంత సొమ్ము అయినా సామాన్య ప్రజల అభ్యున్నతికి వినియోగించి ఉండవచ్చని తెలిపారు.
దాదాపు 12 రోజులను మంత్రివర్గమంతా పుష్కరాలకే కేటాయించారు తప్ప సామాన్యుల గురించి కొంతసేపైనా పట్టించుకున్న పాపానపోలేదని ఆరోపించారు. జన్మభూమి కమిటీలు ఆమోదించాల్సి ఉండడంతో సంక్షేమ పథకాలు సామాన్యుల దరి చేరలేద న్నారు. టీడీపీ కార్యకర్తలకు జన్మభూమి కమిటీల్లో స్థానం కల్పించడంతో వారు ప్రభుత్వ నిధులు స్వాహా చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. అర్హులకు సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు. పింఛన్ల పంపిణీ, నీరు-చెట్టు కార్యక్రమం సక్రమంగా జరగడం లేదని తెలిపారు.
రైతుల రుణమాఫీ చేశామని అధికార పార్టీ నాయకులు గొప్పలు చెబుతున్నారని, అయితే ఎక్కడ చూసినా తీసుకున్న రుణాలు చెల్లించాలంటూ బ్యాంకర్లు రైతులకు నోటీసులు పంపుతున్నారని తెలిపారు. ఎన్నికల మేనిపెస్టోలో ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కారన్నారు. నిరుద్యోగులకు ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి అంటూ మోసం చేశారన్నారు.
జిల్లా అంతటా తాగునీటి సమస్య నెలకొందని, ముఖ్యంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో నీటి సమస్య ఉంటే ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరచి సామాన్యులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కేవీపల్లె జెడ్పీటీసీ సభ్యుడు జయరామచంద్రయ్య, రాస్ సంస్థ పీవో మల్లికార్జునరెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు.