హిందూపురం అర్బన్: లేపాక్షి నంది ఉత్సవాలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తెలుగు సంస్కృతి ప్రతిబింబించేలా సాగిన కార్యక్రమాలు అందరినీ అలరించాయి. తొలుత ఉత్సవాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం సాయంత్రం హెలికాఫ్టర్‌లో లేపాక్షి సమీపంలోని హెలిప్యాడ్‌కు చేరుకోగా.. స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణతో పాటు పలువురు మంత్రులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక బస్సులో ఆయన నంది విగ్రహం వద్దకు చేరుకున్నారు. అనంతరం 500 మంది చిన్నారులు, మహిళలు తమ నాట్య ప్రదర్శనతో అందిరినీ అలరించారు.
లేపాక్షి నంది ఉత్సవాల సందర్భంగా ఏపీఆర్ స్కూల్‌లో నిర్వహించిన కళాప్రదర్శలన్నీ ఆహూతులను అలరించాయి. తొలుత సీఎం చంద్రబాబు, మంత్రులు జ్యోతిప్రజ్వలన చేయగా.. అనంతరం ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ, రెండేళ్ల విరామం తర్వాత ప్రతి ఒక్కరూ అబ్బురపడేలా లేపాక్షి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన లేపాక్షి ఆలయ చర్రితను సుదీర్ఘంగా వివరించారు. లేపాక్షిలోని శిల్పాలు, ఆలయ నిర్మాణం కోసం విరూపన్న చేసిన త్యాగం ఆలయ ప్రాశస్త్యం వివరించారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం సీఎం చంద్రబాబు పోరాటం చేస్తున్నారన్న బాలకృష్ణ... సీఎంను అభినవ శిల్పిగా అభివర్ణించారు.
అనంతరం ఎంపీ నిమ్మల కిష్టప్ప మాట్లాడుతూ, సాంకేతిక కారణాలతో హంద్రీ–నీవా నీరు రాలేదని, అందువల్లే జలహారతి కార్యక్రమం రద్దు చేశామన్నారు. çహిందూపురం అంటే గుర్తుకొచ్చేది ఎన్టీ రామారావు అని అన్నారు. కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కాలువ శ్రీనివాసులు, జవహర్, పరిటాల సునీత, విప్ పల్లె రఘునాథరెడ్డి, ఎమ్మెల్యేలు పార్థసారథి, ప్రభాకర్‌చౌదరి, ఈరన్న, అత్తార్ చాంద్‌బాషా, యామినీబాల, ఎమ్మెల్సీలు పయ్యావుల కేశవ్, గుండుమల తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు.
శోభాయాత్రను ప్రారంభించిన సీఎం
చిన్నారుల నృత్యం అనంతరం స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ కృష్ణదేవరాయుల వేషధారణలో విచ్చేశారు. వేదిక సమీపం వరకు కారులో వచ్చిన ఆయన.. అనంతరం నాలుగు గుర్రాల రథంపైకి ఎక్కారు. ఈ సందర్భంగా ప్రారంభమైన శోభాయాత్రకు సీఎం చంద్రబాబు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. రథం వెనకనే వివిధ కళాకారులు డప్పుల వాయిద్యాలతో, వివిధ వే«షధారణలు, మహిళా సమాఖ్య సభ్యులు, రైతులు ర్యాలీగా తరలివచ్చారు. అక్కడినుంచి సీఎం నేరుగా లేపాక్షి వీరభద్రస్వామి ఆలయ సందర్శనకు వెళ్లారు.
రికార్డులకెక్కిన మహా కూచిపూడి ప్రదర్శన
అనంతపురం కల్చరల్ (లేపాక్షి): రెండు రోజులు పాటు సాగే లేపాక్షి ఉత్సవాలలో తొలిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు హోరెత్తాయి. 550 మంది నృత్యకారులతో సురభి ఆనంద్, కుమ్మర కృష్ణ నేతృత్వంలో సాగిన మహా కూచిపూడి ప్రదర్శన తెలుగు బుక్‌ఆఫ్ రికార్డుల్లో నమోదు చేసుకున్నట్టు నిర్వాహకులు తెలిపారు. అలాగే ప్రధాన సభాస్థలి వద్ద నందమూరి బాలకృష్ణ శ్రీకృష్ణదేవరాయ వేషధారణ అందరినీ ఆకట్టుకుంది. ఆత్మీయ అతిథులుగా విచ్చేసిన సినీ దర్శకులు కె.విశ్వనాథ్, కె.రాఘవేంద్రరావు, సీనియర్ నటుడు రాళ్లపల్లి, హీరోయిన్లు సురభి, హరిప్రియ తదితరులను ఘనంగా సన్మానించారు. ప్రఖ్యాత వాయిద్య కళాకారుడు శివమణి తన సంగీత విన్యాసాలతో జిల్లా వాసులను అబ్బుర పరిచారు. పలువురు సినీ తారలు ఆటపాటలతో అలరించారు. రాత్రి పొద్దుపోయే వరకూ సాంస్కృతిక కార్యక్రమాలు సాగాయి.
సంస్కృతి పరిరక్షణకు లేపాక్షి ఉత్సవాలు
లేపాక్షి: భారతీయ సంస్కృతి, భాష, సంప్రదాయాలకు పరిరక్షించడం...భావితరాలకు అందించే ఉద్దేశంతోనే లేపాక్షి నంది ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ తెలిపారు. లేపాక్షి నంది ఉత్సవాలను పురస్కరించుకుని శనివారం ఉదయం స్థానిక ఏపీ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రసంగించారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను దశదిశలా చాటడంతో పాటు లేపాక్షి ఆలయంలోని శిల్పాలు, చిత్రలేఖనాలు, కళాఖండాల విశిష్టతను ఖడాంతరాలకు తెలియజెప్పేందుకే లేపాక్షి ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. వాస్తవానికి లేపాక్షి చెరువుకు హంద్రీనీవా కాలువ ద్వారా నీరు అందించిన తర్వాతే లేపాక్షి ఉత్సవాలను నిర్వహించాలని అనుకున్నామనీ, అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల అక్కడక్కడా కాల్వలు లీకేజీ అయి నీరు వృథాగా పోవడంతో చెరువుకు నీరు చేరలేదన్నారు.
అయినప్పటికీ హంద్రీనీవా నీరుతో లేపాక్షి చెరువులకు నింపితీరుతామన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు.. హంద్రీ–నీవా, గాలేరు–నగరి కాల్వల ద్వారా హిందూపురానికి తాగుసాగు నీరు అందించాలని కలలు కన్నారనీ, కొంత ఆలస్యమైనా ఆయన కల నెరవేరుస్తామన్నారు. అనంతరం నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో ఎంపీ నిమ్మల కిష్టప్ప, టూరిజం రీజినల్ డైరెక్టర్ గోపాల్, ఐసీడీఎస్ పీడీ వెంకటేశం, డీఆర్‌డీఏ పీడీ రామారావు, ఆర్డీఓ రామ్మూర్తి, ఎంపీపీ హనోక్, స్థానిక ప్రజాప్రతినిదులు, అధికారులు పాల్గొన్నారు.
సైడ్‌లైట్స్
సాయంత్రం 5 గంటలకు ప్రాసమణి మాటలు, పాటలతో కార్యక్రమం ప్రారంభమైంది.
6.00 గంటలకు సీఎం వస్తున్నారని ఎమ్మెల్యే బాలకృష్ణ, మంత్రులు ఎమ్మెల్యేలతోపాటు అధికారులు హెలిప్యాడ్ వద్దకు బయలుదేరారు.
6.43 గంటలకు హెలీకాఫ్టపర్‌లో సీఎం చంద్రబాబురాక
6.50కు కళాకారుల నృత్య ప్రదర్శన ప్రారంభం.. 7.05 ప్రదర్శన ముగింపు..
సకాలంలో బాలకృష్ణ వేదికపైకి రాకపోవడంతో రెండోసారి అదే పాటకు నృత్యం చేసిన చిన్నారులు.
నృత్యకారిణులతో ఫొటోలు దిగిన సీఎం
7.15 గంటలకు కృష్ణదేవరాయల వేషధారణతో కారు వచ్చి... నాలుగు గుర్రాలు కల్గిన రథం ఎక్కిన బాలకృష్ణ.
ర«థానికి జెండా ఊపి ప్రారంభించిన సీఎం
7.20 గంటలకు తూర్పుద్వారం ద్వారా ఆలయ సందర్శనకు వెళ్లిన సీఎం
7.40 గంటలకు సభాస్థలికి చేరుకుని జ్యోతి ప్రజ్వలన చేసిన సీఎం.
7.50 సీనీ కళాకారులు దర్శకులు కె.విశ్వనాథ్, కె.రాఘవేంద్రరావు, నటుడు రాళ్లపల్లి, హరిప్రియ, సురభి, వివిధ రంగాలో ప్రతిభ కనపర్చిన వారికి సన్మానాలు.
8.00 గంటలకు బిట్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు రూపొందించిన లేపాక్షి సౌరభాలు పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం, బాలకృష్ణ.
8.15 ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రసంగం ప్రారంభం.
9.00 నుంచి íసీఎం చంద్రబాబు ప్రసంగం ప్రారంభం..
10.15 నుంచి వేదిక నుంచి బయలు దేరివెళ్లిన సీఎం చంద్రబాబు నాయుడు
Comments
Please login to add a commentAdd a comment