సీఎం వెల్లడించినవి రోడ్‌మ్యాప్ అంశాలే: టీజీ | cm shared road news only ,says tg | Sakshi
Sakshi News home page

సీఎం వెల్లడించినవి రోడ్‌మ్యాప్ అంశాలే: టీజీ

Published Sun, Aug 11 2013 3:02 AM | Last Updated on Fri, Jul 12 2019 3:10 PM

cm shared road news only ,says tg

 సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్ర విభజన విషయంలో అధిష్టానానికి అందజేసిన రోడ్‌మ్యాప్‌లోని విషయాలనే సీఎం కిరణ్ రెండు రోజుల క్రితం విలేకరుల సమావేశంలో వెల్లడించారని మంత్రి టి.జి.వెంకటేశ్ పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి  రాజనరసింహ, పీసీసీ చీఫ్ బొత్సలతో పాటు సీఎం కూడా అధిష్టానానికి రాష్ట్ర విభజనకు సంబంధించి రోడ్ మ్యాప్ అందజేసిన విషయాన్ని గుర్తు చేశారు. సీఎం కిరణ్ ఇచ్చిన నివేదికపై లీకుల రూపంలో విభిన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన అధిష్టానానికి ఏం చెప్పారో బహిర్గతం చేశారన్నారు. విభజిస్తే తలెత్తే పరిణామాలను అధిష్టానం ముందు సీఎం చెప్పినా.. ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన లేఖలను పరిగణనలోకి తీసుకొని కాంగ్రెస్ కోర్ కమిటీ, సీడబ్ల్యూసీ, యూపీఏ సమన్వయ కమిటీ  విభజనకు మొగ్గు చూపాయన్నారు. సీఎం భావ ప్రకటనాస్వేచ్ఛను ఆయన వినియోగించుకున్నారే తప్ప సోనియాను ధిక్కరించ లేదన్నారు.
 
 దొరల రాజ్యానికి బాటలు కేసీఆర్‌పై శైలజానాథ్ ధ్వజం
 అనంతపురం, న్యూస్‌లైన్: కేసీఆర్ తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి దొరల రాజ్యానికి  బాటలు వేస్తున్నారని, రాష్ట్ర విభజన జరిగితే దళిత, గిరిజన, బలహీన వర్గాలకు రక్షణ ఉండదని సమైక్యాంధ్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఫోరం కన్వీనర్ సాకే శైలజానాథ్ అన్నారు. సీఎంగా అన్ని ప్రాంతాల ప్రయోజనాలను కాపాడేందుకే కిరణ్‌కుమార్‌రెడ్డి సమస్యలను ప్రస్తావించారే తప్ప తెలంగాణ వారిపైద్వేషమేమీలేదన్నారు. శనివారం ఆయన అనంతపురంలో మాట్లాడుతూ.. సీఎం ఏం చెప్పారో తెలుసుకోకుండా తెలంగాణ నాయకులు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. సీడబ్ల్యూసీ తీర్మానాన్ని సీఎం అగౌరవపరిచారని, ఒక ప్రాంత సీఎంగానే మాట్లాడుతున్నారని తెలంగాణ నేతలు వ్యాఖ్యానించడం దారుణమన్నారు. సీఎంపై నోరు పారేసుకుంటున్న డీఎస్ గతంలో పీసీసీ చీఫ్‌గా ఉన్న విషయాన్ని మర్చిపోకూడదని హితవు పలికారు. టీడీపీ అధినేత చంద్రబాబు నీచ రాజకీయాలు చూసి ఎన్టీఆర్ ఆత్మ  క్షోభిస్తూ ఉంటుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement