సీఎం తీరు మార్చుకోవాలి
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట) : మాటలకు, చేతలకు పొంతన లేకుండా, ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్‌సీపీని ఇబ్బందిపెట్టేలా వ్యవహరిస్తున్న సీఎం చంద్రబాబు తనతీరును మార్చుకోవాలని ఎంపీ మేకపాటి రాజ మోహన్‌రెడ్డి హితవుపలికారు. నెల్లూరులోని ఆయన నివాసంలో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విపక్ష ఎమ్మెల్యేలు 67 మందికి ఎమ్మెల్యే నిధులను మంజూరుచేయకపోవడం శోచనీయం అన్నారు. బాబు ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదన్నారు. అభివృద్ధి అంశంలో దివంగత సీఎం వైఎస్సార్ పాలనను చూసైనా తప్పులను సరి దిద్దుకోవాలన్నారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే పదిశాతం రుణాలు, 90 శాతం నిధులు మంజూరుకావడం వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుం దన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా తమవంతు సాయం చేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రత్యేక హోదాకోసం ఈనెల 29న తలపెట్టిన రాష్ట్రవ్యాప్త బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు. సదుద్దేశంతో చేపట్టిన నీరు-చెట్టుకు హితోధికంగా తమవంతు సహాయసహకారాను అందజేస్తామని చెప్పారు. జన్మభూమి కమిటీల పేరుతో ఆ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులను పక్కనపెట్టి, కేవలం టీడీపీ కార్యకర్తలకు అప్పజెప్పడం అప్రజాస్వామికమన్నారు. ప్రత్యేక హోదాపై పార్లమెంట్‌లో చర్చ జరగకపోవడం విచారకరం అన్నారు. జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి, ఎమ్మెల్యే కిలివేటి, మేరిగ మురళీధర్‌లు పాల్గొన్నారు.