సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టుల పనులను ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం నిర్మాణం ఉన్న ప్రాజెక్టులతోపాటు అత్యవసరంగా చేపట్టాల్సిన కొత్త ప్రాజెక్టులను గుర్తించి, వాటిని ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయడానికి ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్ సాగునీటి ప్రాజెక్టుల పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధిక శాతం ప్రజలు వ్యవసాయం ఆధారంగా జీవిస్తున్నారని, రైతులకు సాగునీరు.. ప్రజలందరికీ తాగునీరు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ సాగు, తాగునీరు అందించడానికి నీటిపారుదల ప్రాజెక్టుల పనులను ప్రధాన్యతా క్రమంలో, సకాలంలో పూర్తి చేయాల్సిన అవసరం ఉందని పునరుద్ఘాటించారు. కృష్ణా వరదపై ఆధారపడ్డ జలాశయాలను 40 రోజుల్లోగా నింపడానికి చర్యలు తీసుకోవాలని, ఇందుకు చేపట్టాల్సిన పనులపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. సమీకరించుకున్న ఆర్థిక వనరులను సక్రమంగా వినియోగించుకోవడం ద్వారా నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించాలని సూచించారు.
వరద సమయంలోనే ప్రాజెక్టులన్నీ నిండాలి
రాష్ట్రంలో భారీ, మధ్య తరహా, చిన్న జలాశయాల నీటి నిల్వ సామర్థ్యం 982.35 టీఎంసీలని.. ప్రస్తుతం వాటిలో 831.46 టీఎంసీల(84.64 శాతం) నీరు నిల్వ ఉందని అధికారులు సీఎంకు వివరించారు. గతేడాది ఇదే సమయానికి 523.49 (53.29 శాతం) టీఎంసీలు నిల్వ ఉండిందని చెప్పారు. జిల్లాల వారీగా, ప్రాజెక్టుల వారీగా జరుగుతున్న పనులు.. పెండింగ్‌లో ఉన్న పనులను నివేదించారు. పోలవరం, వంశధార, వెలిగొండ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా సహా కొత్తగా ప్రతిపాదిస్తున్న ప్రాజెక్టులపైనా అధికారులతో సీఎం సుదీర్ఘంగా సమీక్షించారు. కృష్ణా నదికి ఇన్ని రోజులు వరద వచ్చినా, కొన్ని రిజర్వాయర్లు నిండకపోవడానికి కారణాలు ఏమిటని అధికారులను ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచి, కృష్ణా వరదను ఒడిసి పట్టి.. వరద వచ్చిన 40 రోజుల్లోగానే గాలేరు–నగరి, తెలుగుగంగ, సోమశిల, కండలేరు తదితర ప్రాజెక్టులను నింపడానికి ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.
ప్రాజెక్టులకు సంబంధించిన మ్యాప్‌ను పరిశీలిస్తున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, అధికారులు
సోమశిల నిర్వాసితులకు పరిహారం చెల్లించండి
నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాజెక్టు నుంచి రాళ్లపాడుకు వెళ్లే కాల్వ సామర్థ్యాన్ని పెంచి, నీటిని తరలించే ఆలోచన చేయాలని సీఎం అధికారులకు చెప్పారు. కంభం చెరువుకు వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీటిని తరలించే అవకాశాన్ని పరిశీలించాలన్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు కాలువల్లో పెండింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. సోమశిల జలాశయం పూర్తి స్థాయి సామర్థ్యం 78 టీఎంసీలుకాగా.. కొన్ని ముంపు గ్రామాల ప్రజలకు ఇప్పటికీ పరిహారం చెల్లించకపోవడం వల్ల 72.36 టీఎంసీలను మాత్రమే నిల్వ చేశామని అధికారులు చెప్పారు. నిర్వాసితులకు చెల్లించాల్సిన పరిహారాన్ని వెంటనే పంపిణీ చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లాలో ముసురుమల్లి ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 1.60 టీఎంసీలుకాగా, ప్రస్తుతం 0.56 టీఎంసీలను నిల్వ చేశామని అధికారులు సీఎంకు వివరించారు. గేట్లు అమర్చే ప్రక్రియ పూర్తి కాకపోవడం వల్ల సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేయలేకపోతున్నామని, మార్చి నాటికి గేట్లు అమర్చే ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. ఆలోగా పనులు పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.
సోమశిల–కండలేరు కాలువకు మరో సమాంతర కాలువ
కండలేరు జలాశయం పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 68.03 టీఎంసీలుకాగా, ఇప్పటిదాకా 32.30 టీఎంసీలు నింపామని అధికారులు సీఎంకు తెలిపారు. సోమశిల నుంచి కండలేరుకు ప్రస్తుతం ఉన్న కాలువ ద్వారా రోజుకు 0.8 టీఎంసీలను మించి తరలించడానికి సాధ్యం కాదని చెప్పారు. దాంతో వరద నీటిని ఒడిసి పట్టి కండలేరును నింపడానికి వీలుగా సోమశిల – కండలేరు వరద కాలువకు సమాంతరంగా మరో కాలువ తవ్వడానికి ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. కనిగిరి రిజర్వాయర్ అభివృద్ధికి రూ.20 కోట్లు ఇవ్వాలన్న స్థానిక ప్రజాప్రతినినిధుల విజ్ఞప్తిపై సీఎం సానుకూలంగా స్పందించారు.
వరదను వదలొద్దు..
కృష్ణా నదికి ఇంత వరద వచ్చినా రాయలసీమలోని కొన్ని రిజర్వాయర్లు పూర్తి స్థాయిలో నిండకపోవడంపై సీఎం వైఎస్ జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కాలువల ప్రవాహ సామర్థ్యం తక్కువగా ఉందని అధికారులు సీఎం దృష్టికి తీసుకురాగా, వాటి సామర్థ్యాన్ని పెంచడంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. గాలేరు–నగరిలో అంతర్భాగమైన గోరకల్లు రిజర్వాయర్ సామర్థ్యం 12.44 టీఎంసీలుకాగా.. ఇప్పటి వరకు 7.75 టీఎంసీలను నిల్వ చేశామని అధికారులు సీఎంకు వివరించారు. అటవీ అనుమతులు పెండింగ్‌లో ఉండటం.. అవుట్‌ఫాల్ రెగ్యులేటర్ గేట్లు బిగించకపోవడం వల్ల పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయలేకపోయామని చెప్పారు.
యుద్ధ ప్రాతిపదికన అటవీ అనుమతులు సాధించడంతోపాటు గేట్లు బిగించే పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. అవుకు రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 4.15 టీఎంసీలుకాగా.. అటవీ అనుమతులు పెండింగ్‌లో ఉన్నందున 3.16 టీఎంసీలు మాత్రమే నిల్వ చేశామని అధికారులు చెప్పారు. అటవీ అనుమతులు తక్షణమే వచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం చెప్పారు. అలగనూరు రిజర్వాయర్‌లో కుంగిపోయిన గట్టు పనులను నవంబర్ నాటికి పూర్తిచేస్తామని, జలాశయంలో రెండు టీఎంసీలను నిల్వ చేస్తామని అధికారులు వివరించారు.
సకాలంలో ప్రాజెక్టుల పూర్తికి ప్రణాళిక
రాష్ట్రంలో జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టుల్లో మిగిలిన పనులు పూర్తి చేయడానికి, కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులు, సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) దశలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయడానికి సుమారు రూ.1,40,715 కోట్లు అవసరం అవుతాయని సీఎం వైఎస్ జగన్‌కు అధికారులు వివరించారు. పోలవరం ప్రాజెక్టును 41.15 కాంటూర్ పరిధిలో పూర్తి చేయడానికి రూ.11,172 కోట్లు, 45.72 కాంటూర్ పరిధిలో పూర్తి చేయడానికి రూ.34,488 కోట్లు అవసరం అవుతాయని చెప్పారు. ప్రకాశం బ్యారేజీకి దిగువన కృష్ణా నదిపై కొత్తగా ప్రతిపాదించిన మూడు బ్యారేజీల నిర్మాణం సహా.. కొత్తగా చేపట్టిన, ప్రతిపాదన దశల్లో ఉన్న ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తామని అధికారులు వివరించారు. ఈ సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ అనిల్‌కుమార్ యాదవ్, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, సీఎం అదనపు కార్యదర్శి ధనుంజయరెడ్డి, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు, చీఫ్ ఇంజనీర్లు పాల్గొన్నారు.
తెలుగుగంగ – ఎస్పీవీబీఆర్ కాలువ సామర్థ్యం పెంచాలి
శ్రీపోతులూరి వీరబ్రహ్మం రిజర్వాయర్(ఎస్పీవీబీఆర్) నిల్వ సామర్థ్యం 17.73 టీఎంసీలుకాగా.. ఇప్పటిదాకా కేవలం రూ.4.50 టీఎంసీలను మాత్రమే నిల్వ చేశారని.. జలాశయాన్ని నింపక పోవడానికి కారణాలు ఏమిటని సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు. తెలుగుగంగ నుంచి ఎస్పీవీబీఆర్‌కు 5 వేల క్యూసెక్కులను తరలించేలా కాలువ తవ్వినా.. ఆ కాలువ ద్వారా కేవలం 1300 నుంచి 2000 వేల క్యూసెక్కులు మాత్రమే తరలించడానికి సాధ్యమవుతోందని అధికారులు వివరించారు. కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని పెంచడంతోపాటు.. కుందూ నది నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా ఎస్పీవీబీఆర్‌ను నింపే ప్రతిపాదనలను పరిశీలించాలని అధికారులకు సీఎం సూచించారు. గండికోట, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లకు సంబంధించి నిర్వాసితులకు పునరావాసం కల్పించే పనులు పూర్తి చేయాలన్నారు.
గండికోట నుంచి చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు నీటిని తరలించేలా ఎత్తిపోతల సామర్థ్యాన్ని పెంచాలని ఆదేశించారు. అనంతపురం జిల్లాలో పెన్న అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(పీఏబీఆర్) నిల్వ సామర్థ్యం 11.10 టీఎంసీలు కాగా.. ఇప్పటిదాకా 2.62 టీఎంసీలు మాత్రమే నింపడానికి గల కారణం ఏమిటని సీఎం ప్రశ్నించారు. సీపేజీ కారణంగా పూర్తిగా నింపలేకపోతున్నామని, గ్రౌటింగ్ పనులు చేస్తున్నామని, వెంటనే పూర్తి చేస్తామని అధికారులు వివరణ ఇచ్చారు. హంద్రీ–నీవా నుంచి నుంచి నీటిని అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని అధికారులు చెప్పగా, ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.
హంద్రీ–నీవా నుంచి భైరవానితిప్ప ప్రాజెక్టుకు నీటిని ఇవ్వడంపై ప్రతిపాదనలు తయారు చేయాలని, తుంగభద్ర కెనాల్ ఆధునికీకరణ పనులు పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. హంద్రీ–నీవా ప్రధాన కాలువ సామర్థ్యాన్ని పెంచడం, సమాంతరంగా మరో కాలువ తవ్వడం ద్వారా కృష్ణా వరద జలాలను సద్వినియోగం చేసుకుని రాయలసీమను సస్యశ్యామలం చేయాలని ఆదేశించారు. తిరుపతి సమీపంలోని కళ్యాణి డ్యాం, ఎన్టీఆర్ జలాశయం ప్రత్యామ్నాయ పద్ధతుల్లో నింపడంపైనా సీఎం అధికారులతో చర్చించారు.
కృష్ణా నదికి ఇంత వరద వచ్చినా రాయలసీమలోని కొన్ని రిజర్వాయర్లు పూర్తి స్థాయిలో నిండలేదు. చిత్రావతి, బ్రహ్మంసాగర్‌ల పరిస్థితి ఏమిటి? కాలువల ప్రవాహ సామర్థ్యం తక్కువగా ఉంటే వాటిని విస్తరించేందుకు వెంటనే ప్రతిపాదనలు రూపొందించండి. వరద వచ్చిన 40 రోజుల్లోనే జలాశయాలను నింపుకోవాలి.
వరదను ఒడిసి పట్టండి..
శ్రీకాకుళం జిల్లాలో వంశధార స్టేజ్–2లోని ఫేజ్–2లో అంతర్భాగమైన హిరమండలం రిజర్వాయర్ నిల్వ సామర్థ్యం 19.3 టీఎంసీలుకాగా ప్రస్తుతం 5.61 టీఎంసీలను నిల్వ చేశామని అధికారులు సీఎం వైఎస్ జగన్‌కు వివరించారు. వరద కాలువ పనుల్లో కొంత భాగం మిగిలాయని.. వాటిని 2020 జూన్ నాటికి పూర్తి చేస్తామన్నారు. మిగిలిపోయిన వరద కాలువ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, ఎనిమిది వేల క్యూసెక్కులు ప్రవహించేలా చర్యలు తీసుకోవడం ద్వారా వంశధార వరదను ఒడిసి పట్టాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. వంశధార స్టేజ్–2 ఫేజ్–2లో నేరడి వద్ద నిర్మించాల్సిన బ్యారేజీపై విస్తృతంగా చర్చించారు. ట్రిబ్యునల్ ఆదేశాలు.. కోర్టు తీర్పుల తాజా పరిస్థితిని సమీక్షించిన సీఎం.. సమస్య పరిష్కారానికి తగిన కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇప్పటికే పనులు పూర్తయి.. నిర్వాసితులకు పరిహారం చెల్లించకపోవడం వల్ల నీటిని నిల్వ చేయలేని ప్రాజెక్టులు, అటవీ అనుమతులు లేక.. భూసేకరణ జరగక ఆగిపోయిన ప్రాజెక్టులు, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీళ్లందించే ప్రాజెక్టులు, కొత్తగా అత్యవసరంగా చేపట్టాల్సిన ప్రాజెక్టులను గుర్తించండి.
ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయడానికి నవంబర్ 8 నాటికి ప్రణాళిక సిద్ధం చేయండి.
Comments
Please login to add a commentAdd a comment