ప్రతి గ్రామంలో 10 మందికైనా సరిపడే విధంగా క్వారంటైన్ సదుపాయం కల్పించాలి. మంచి బెడ్లు, బెడ్‌షీట్లు, దిండ్లు, టాయిలెట్లు ఉండేలా చూడాలి. మంచి భోజనం కూడా పెట్టాలి. పారిశుద్ధ్యం బావుండాలి. శానిటేషన్ వర్కర్లను కూడా పెట్టాలి. ప్రతి గ్రామంలోనూ ఈ సదుపాయాలన్నీ ఉండాలి.
ఈ ప్రక్రియ మన జీవితంలో కొన్ని నెలల పాటు కొనసాగుతుంది. అందుకనే నిరంతరం జాగ్రత్తలు తీసుకోవాలి. సదుపాయాలు బాగుంటేనే.. ప్రజలు అక్కడకు వెళ్లగలుగుతారు. లేదంటే కలెక్టర్ మీద మచ్చ పడుతుంది. తగిన సిబ్బందిని పెట్టుకుని క్వారంటైన్ సదుపాయాలపై దృష్టి పెట్టాలి.
సాక్షి, అమరావతి: ప్రతి గ్రామంలో పది క్వారంటైన్ పడకలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఇతర రాష్ట్రాల నుంచి లక్షకు పైగా మన రాష్ట్రానికి చెందిన వలస కార్మికులు, మన రాష్ట్రానికే చెందిన మరో లక్ష మంది ఇతరులు రాష్ట్రానికి వస్తారనే అంచనా ఉందన్నారు. వివిధ దేశాల నుంచి కూడా మన రాష్ట్రానికి చెందిన వారు రానున్నారని తెలిపారు. ఇక్కడ నుంచి కూడా కొంత మంది వెళ్లడం ప్రారంభం అయ్యిందన్నారు. ఈ దృష్ట్యా మనం అన్ని విధాలా సంసిద్ధమై స్థిరంగా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కోవిడ్ నివారణ చర్యలు, ఇతర అంశాలపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు విషయాల్లో కలెక్టర్లు, ఎస్పీలకు మార్గనిర్దేశం చేశారు.
డార్మిటరీస్‌లో కూడా సదుపాయాలు బాగుండాలి
► దాదాపు 11 వేలకు పైగా ఉన్న గ్రామ సచివాలయాల్లో కనీసం లక్ష మందికి క్వారంటైన్ సదుపాయాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు క్వారంటైన్ సదుపాయాలు ఉన్నాయి.
► 25 వేల సింగిల్ రూమ్స్, 7,500 డబుల్ రూమ్స్ ఉన్నాయి. వాటిలో 40 వేల మంది వరకూ ఉండొచ్చు. ఇవి కాకుండా డార్మిటరీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ సదుపాయాలు బాగున్నాయా? లేదా? అన్న విషయాన్ని మీరు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ.. పర్యవేక్షించాలి.
కోవిడ్–19 టెస్టుల్లో మనం దేశంలోనే నంబర్ వన్
► ప్రతి పది లక్షల జనాభాకు మనం 2,500 మందికి పైగా టెస్టులు చేస్తున్నాం. ఇది ఒక రికార్డు. 35, 36 రోజుల క్రితం వరకు మనకు స్విమ్స్ తప్ప మరో చోట టెస్టింగ్ ఫెసిలిటీ లేదు. అది కూడా 2 రోజుల తర్వాత ఫలితాలు వచ్చేవి. కానీ ఇవాళ 11 జిల్లాల్లో 12 టెస్టింగ్ ల్యాబ్స్ ఉన్నాయి.
► అన్ని ఆసుపత్రుల్లో ట్రూనాట్ కిట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అందరం కలిసి ఈ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకున్నాం.
► గ్రామ వలంటీర్లు, ఆశా వర్కర్ల రూపంలో మనకు బలమైన నెట్‌వర్క్ ఉంది. కోవిడ్‌ను ఎదుర్కొనే విషయంలో మనం ఇతర రాష్ట్రాలకన్నా భిన్నంగా పని చేయగలిగాం. కలెక్టర్లు, ఎస్పీలు చక్కటి పనితీరును చూపారు.
కోవిడ్‌తో కలిసి జీవించాలన్నది వాస్తవం
► దేశంలోనో, రాష్ట్రంలోనో ఎక్కడో ఒక చోట ఇది కనిపిస్తుంది. దగ్గడమో, తుమ్మడమో చేస్తే.. అది పక్కవాళ్లకు వ్యాపిస్తుంది. కోవిడ్ అన్నది జీవితంలో భాగం అవుతుంది.
► కరోనా వైరస్ కారణంగా మరణాల రేటు మన రాష్ట్రంలో కేవలం 2 శాతం లోపే ఉంది. వయసు ఎక్కువగా ఉన్న వారు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారిపైనే ఈ వైరస్ ప్రభావం చూపుతుంది.
► అందువల్ల మన ఇంట్లో ఉన్న మన పెద్ద వారిని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది.
► కోవిడ్‌తో కలిసి జీవించాల్సి ఉంటుంది కాబట్టి కొన్ని జాగ్రత్తలతో అడుగులు ముందుకు వేయాలి.
కుటుంబ సర్వే, పరీక్షలు
రాష్ట్రంలోని అన్ని కుటుంబాలపై సమగ్రంగా సర్వే చేశారు. అ కుటుంబాలలో అవసరమైన వారికి పరీక్షలు చేయిస్తున్నారు. ఇంకా 5,281 మందికి పరీక్షలు చేయాల్సి ఉంది. వీలైనంత త్వరగా వీరికి పరీక్షలు పూర్తి చేయాలి.
కంటైన్‌మెంట్ క్లస్టర్లు
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. నిర్దేశించుకున్న కంటైన్‌మెంట్ క్లస్టర్లు, దాని చుట్టూ ఉన్న బఫర్ జోన్లపై పూర్తిగా దృష్టి పెట్టాలి. కరోనా పాజిటివ్ కేసులన్నీ క్లస్టర్ జోన్ల నుంచే ఎక్కువగా వస్తున్నాయి. కంటైన్‌మెంట్ క్లస్టర్ల వెలుపల కూడా భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలి.
టెలి మెడిసిన్ వ్యవస్థను పటిష్టం చేయాలి
► టెలి మెడిసిన్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోందని అధికారులు చెబుతున్నారు. కాల్ చేసిన వారికి ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత ఆ వివరాలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారితోపాటు, కలెక్టర్‌కూ వస్తాయి.
► ఇక్కడ కలెక్టర్లు కీలక పాత్ర పోషించాలి. పీహెచ్‌సీ పరిధిలో ఒక ద్విచక్ర వాహనాన్ని, థర్మల్ బాక్సును అందుబాటులోకి తీసుకురావాలి. 24 గంటల్లోగా ప్రిస్క్రిప్షన్ ప్రకారం మందులు వెళ్లాలి.
► త్వరలో విలేజ్ క్లినిక్‌లు కూడా ప్రారంభం అవుతాయి. అప్పుడు టెలి మెడిసిన్ మరింత బలోపేతం అవుతుంది. ఈ వ్యవస్థను కలెక్టర్లు తమదిగా భావించి బాగా పని చేయించాలి.
► టెలి మెడిసిన్ కోసం ఒక నంబర్ కేటాయించాం. దీంతో పాటు దిశ, అవినీతి నిర్మూలన, వ్యవసాయానికి సంబంధించిన ముఖ్యమైన నంబర్లును ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో అందరికీ కనిపించేలా ప్రదర్శించాలి.
Comments
Please login to add a commentAdd a comment