‘పచ్చ తోరణం’ ప్రారంభించిన సీఎం జగన్‌ | CM YS Jagan Inaugurates Jagananna Pacha Thoranam Program Today | Sakshi
Sakshi News home page

‘పచ్చ తోరణం’ ప్రారంభించిన సీఎం జగన్‌

Published Wed, Jul 22 2020 10:57 AM | Last Updated on Wed, Jul 22 2020 12:33 PM

CM YS Jagan Inaugurates Jagananna Pacha Thoranam Program Today - Sakshi

సాక్షి, కృష్ణాజిల్లా: ‘ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటి చెట్లు పెంచడం ద్వారా ప్రతి ఇంటినీ, ప్రతి ఊరునూ పచ్చదనంతో సింగారిద్దాం’ అనే నినాదంతో 71వ వన మహోత్సవాన్ని బుధవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి‌ ప్రారంభించారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని గాజులపాడు ‘వనం మనం’  ప్రాంగణానికి చేరుకొన్న ఆయన.. పేదల కోసం ఏర్పాటు చేసిన లే అవుట్‌లో మొక్కలు నాటి ‘జగనన్న పచ్చతోరణం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వేప, రావి మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. వన మహోత్సవంలో భాగంగా 20 కోట్ల మొక్కల్ని నాటేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 13 వేల పంచాయితీలు ఉంటే, 17 వేల లే అవుట్లు సిద్ధం చేశామని.. ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశారు. మొక్కల్ని నాటాలని కోరుతూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజలు, అధికారులతో ఈ సందర్భంగా ప్రతిజ్ఙ చేయించారు.

అదే విధంగా... ఆగస్టు 15న 30 లక్షల మందికి పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామని సీఎం జగన్‌ పునరుద్ఘాటించారు. ‘‘పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే టీడీపీ నేతలు అడ్డుపడుతున్నారు. కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారు. కేసులు వేస్తున్నారు. వారి వల్ల సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత స్వాతంత్ర్య దినోత్సవం రోజున పేదలకు ఇళ్ల స్థలాలు అందించే కార్యక్రమం చేస్తాం’’ అని పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , బాలినేని శ్రీనివాస్ రెడ్డి , కొడాలి నాని , పేర్ని నాని , వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ , సీఎం ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం , మహిళాకమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కోవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో భౌతిక దూరం నిబంధనలు పాటించేలా జాగ్రత్తలు వహిస్తూ నవరత్నాల తరహాలో తొమ్మిది రకాల మొక్కలు నాటారు.

కాగా వన మహోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం.. పేదల కోసం సిద్ధం చేసిన పదిహేడు వేల లే అవుట్లను పచ్చదనంతో నింపేందుకు సంకల్పించింది. ఈ క్రమంలో ప్రభుత్వం తరపున ఆరు కోట్ల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై కోట్ల మొక్కలు నాటాలన్న లక్ష్యంతో  ‘జగమంతా వనం.. ఆరోగ్యంతో మనం’ అనే నినాదంతో అధికారులు మందుకు వెళ్తున్నారు. ప్రతీ ఒక్కరూ పది మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ యజ్ఞంలో భాగస్వాములు కావాలని పిలుపునిస్తున్నారు. ప్రతి ఇల్లు, ప్రతీ ఊరూ పచ్చదనంతో సింగారిద్దామంటూ.. హంగూ ఆర్భాటాలకు ప్రాధాన్యం ఇవ్వకూడదన్న సీఎం జగన్‌ సూచనల మేరకు సాదాసీదాగా కార్యక్రమాన్ని నిర్వహించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement