సీఎం వైఎస్‌ జగన్‌: ప్రమాణాలు పాటించని ప్రైవేటు విద్యాసంస్థలపై కఠిన చర్యలు | YS Jagan Meets Official Committee on Reformation of Education System - Sakshi
Sakshi News home page

ప్రమాణాలు పాటించని ప్రైవేటు విద్యాసంస్థలపై కఠిన చర్యలు

Published Wed, Oct 30 2019 5:44 AM | Last Updated on Wed, Oct 30 2019 10:47 AM

CM YS Jagan Mandate to officials about education reforms - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ నిబంధనలను అనుసరించకుండా.. ప్రమాణాలు పాటించకుండా నడిచే ప్రైవేటు విద్యా సంస్థలపై కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో ఏ మేరకు నాణ్యతా ప్రమాణాలు ఉంటున్నాయో పరిశీలించి.. నిబంధనల ప్రకారం ప్రమాణాలు లేని వాటిని మూసివేయించాలన్నారు. విద్యా రంగంలో చేపట్టాల్సిన సంస్కరణలపై ఏర్పాటైన నిపుణుల కమిటీ సీఎం వైఎస్‌ జగన్‌తో మంగళవారం వెలగపూడిలోని సచివాలయంలో సమావేశమైంది. పాఠశాల విద్య, ఇంటర్మీడియెట్, ఉన్నత విద్యలపై తమ సిఫార్సుల నివేదికను ప్రొఫెసర్‌ ఎన్‌.బాలకృష్ణన్‌ ముఖ్యమంత్రికి సమర్పించారు. కమిటీ సిఫార్సులపై సీఎం వైఎస్‌ జగన్‌ సుదీర్ఘంగా చర్చించారు. సిఫార్సుల అమల్లోనూ కమిటీ భాగస్వామ్యం కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా విద్యా రంగంలో చేపట్టాల్సిన పలు సంస్కరణలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. వచ్చే ఏడాది రాష్ట్రంలో 1 నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రతి తరగతిలో సమగ్ర బోధనాభ్యసన ప్రక్రియలు కొనసాగాలని, ఇందుకోసం విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లు ఉండేలా చూడాలని సూచించారు. ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నందున ఉపాధ్యాయులకు తగిన శిక్షణ ఇవ్వాల్సిన అవసరముందన్నారు. కాగా, నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రిడిటేషన్‌ కౌన్సిల్‌ (న్యాక్‌) తరహాలో స్టేట్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రిడిటేషన్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 

ప్రైవేటు విద్యా సంస్థలపై నియంత్రణ 
ప్రైవేటు విద్యా సంస్థల్లో నిబంధనల అమలు, నాణ్యతా ప్రమాణాల స్థితిగతులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సీఎం ఆదేశించారు. ప్రైవేటు విద్యాసంస్థలు ఇబ్బడిముబ్బడిగా ఫీజులు వసూలు చేస్తున్నాయని.. వీటిని నియంత్రించాలన్నారు. నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని తనిఖీలు చేపట్టాలని సూచించారు. సరైన సదుపాయాలు, ప్రమాణాలు పాటించని వాటిని మూసివేయాలని ఆదేశించారు. 100 ఎకరాలు ఉంటేనే వ్యవసాయ కళాశాలకు అనుమతి ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్రైవేటు వ్యవసాయ కళాశాలల్లో ఈ మేరకు భూమి ఉండడం లేదని, విద్యార్థుల నుంచి అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కళాశాల విద్యలో ఏడాదిపాటు ఇంటర్న్‌షిప్ ఉండాలన్నారు. చదువు యువతకు ఉపాధి లేక ఉద్యోగం కల్పించాలని అభిప్రాయపడ్డారు. ప్రైవేటు యూనివర్సిటీల్లో నాణ్యతా ప్రమాణాలపై ప్రభుత్వానికి నియంత్రణ ఉండాలని, అలా లేనప్పుడు వాటిని ఎందుకు ప్రోత్సహించాలని ప్రశ్నించారు. నాణ్యతా ప్రమాణాలు లేనప్పడు అవి ఇచ్చే సర్టిఫికెట్లకు ఏం విలువ ఉంటుందన్నారు. ‘విద్య అనేది వ్యాపారం కోసమో, డబ్బు కోసమో కాదు. దీన్ని ఒక ఛారిటీలా నిర్వహించాలి.’ అని పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.  

రూ.5 కోట్లతో టీచర్లకు శిక్షణ: సుధా నారాయణమూర్తి
కమిటీ సభ్యురాలు ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ సుధా నారాయణమూర్తి మాట్లాడుతూ తమ ఫౌండేషన్‌ తరఫున రూ.5 కోట్లతో 1200 మంది టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నామని తెలిపారు. ఇంగ్లిష్‌ మాధ్యమం ప్రవేశపెట్టడం ద్వారా ప్రభుత్వ విద్యా రంగంలో మంచి మార్పులు వస్తాయన్నారు. సమావేశంలో విద్యా శాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేశ్, ఉన్నత విద్యా శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ హేమచంద్రారెడ్డి, పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్, సాంకేతిక విద్య కమిషనర్‌ రమణ, నిపుణుల కమిటీ సభ్యులు సాంబశివారెడ్డి, రాజశేఖరరెడ్డి, జంధ్యాల తిలక్, ఈశ్వరయ్య, ప్రసాద్, ప్రొఫెసర్‌ దేశాయ్, నళినీ జునేజా, వెంకటరెడ్డి (ఎంవీ ఫౌండేషన్‌), తదితరులు పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement