సాక్షి, కడప: జిల్లాకు మంచి రోజులు వచ్చాయి. అందరూ అనుకున్నట్లుగానే జిల్లా అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పెద్దపీట వేశారు. ప్రభుత్వం ఏర్పడి 40రోజుల పాలనలోనే జీవించిన జిల్లా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సిద్ధమయ్యారు. అందుకు సంబంధించి ఒకపక్క రైతులు.. మరోపక్క అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒకప్పుడు కరువుతో వ్యవసాయం రంగం సంక్షోభంలో పడగా.. అభివృద్ధి కూడా కుంటుపడింది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లా రూపురేఖలు మారాయి. ఎవరూ చేయని రీతిలో.. కనువిని ఎరుగని రీతిలో అభివృద్ధి చేసి చూపించారు. అదే తరహాలో జిల్లా వాసిగా.. పులివెందుల గడ్డతోపాటు జిల్లా ప్రజల రుణం తీర్చుకునేందుకు ఆయన తనయుడు జగన్ మోహన్‌రెడ్డి సంకల్పించారు.
సీఎంగా అధికారిక హోదాలో సోమవారం తొలిసారి జిల్లా కు వచ్చిన ఆయన జిల్లా అభివృద్ధి బాట పట్టించనున్నట్లు హర్షద్వానాల మద్య ప్రకటించారు. జిల్లా అభివృద్ధిని విస్మరించడంతోపాటు ఉన్న పనులను చేయకుండా నిర్లక్ష్యం చేశారంటూ గత ప్రభుత్వాలను తపు పట్టారు.. అయితే పాదయాత్రతోపాటు అనేక సందర్భాలలో జిల్లా ప్రజలు ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని తన దృష్టికి తీసుకొచ్చారని.. త్వరలోనే డిసెంబర్ 26న ఇక్కడే (జమ్మలమడుగు ప్రాంతంలో) ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. కళ తప్పిన ఈ ప్రాంతంలో కొత్త కళ తీసుకొస్తామని.. 20వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు.. పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. అంతేకాకుండా అనుకున్నట్లుగానే ఆరు నెలల్లోపు శంకుస్థాపన చేయడం.. మూడేళ్లలోపు పూర్తి చేసి ప్రాజెక్టులో ఉత్పత్తి చేసేలా చర్యలు ప్రారంభిస్తామన్నారు.
దేవుడు అనుకూలిస్తే గండికోటలో 20టీఎంసీలు..
జిల్లాలోని గండికోట ప్రాజెక్టుకు సంబంధించి ఉన్న చిన్న, చిన్న అవంతరాలను పరిష్కరిస్తాం.. గతంలో ఒక్కొక్కరికి రూ.6.75లక్షలు పరిహారం ఇచ్చాం.. మనం గతంలో ఇచ్చిన మాట ప్రకారం ముంపు బాధితుల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున పరిహారం ఇస్తున్నట్లు హర్షద్వానాల మధ్య ప్రకటించారు. అక్కడ ఉన్న 15గ్రామాల ప్రజలను ఖాళీ చేయించడంతోపాటు దేవుడు అనుకూలిస్తే.. గండికోట ప్రాజెక్టులో సుమారు 20టీఎంసీల నీటిని నిల్వ చేస్తామని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ప్రజలు, దేవుడు అనుకూలంగా ఉంటే 20టీఎంసీల నీటిని గండికోటకు తీసుకొచ్చి జిల్లాలోని పలు ప్రాంతాలకు అందించి సస్యశ్యామలం చేసే దిశగా అడుగులు వేస్తామన్నారు. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో ప్రాజెక్టులపరంగా చాలా అభివృద్ధి జరిగిందని.. తర్వాత ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆయన అన్నారు.
రాజోలు ప్రాజెక్టును నిర్మిస్తాం..
జిల్లాలో మైదుకూరు, ప్రొద్దుటూరుతోపాటు ఇతర ప్రాంతాలకు కూడా ప్రయోజనం కలిగించే రాజోలు ప్రాజెక్టు నిర్మాణాన్ని త్వరలో చేపడతామని... అందుకు సంబంధించి డిసెంబర్ 26న ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నట్లు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. అయితే ఇంతకమునుపే మన ప్రియతమ నాయకులు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రా>జశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారని.. అయితే తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో ప్రాజెక్టు అలాగే ఉండిపోయిందన్నారు. 3టీఎంసీల సామర్థ్యంతో రాజోలు ప్రాజెక్టు నిర్మాణానికి, ఒక టీఎంసీ సామర్థ్యంతో జలధార ప్రాజెక్టుకు రూపకల్పన చేసి డిసెంబర్ 26న శంకుస్థాపన చేస్తామన్నారు. అనంతరం త్వరలోనే పూర్తి చేసి కేసీ ప్రాంత రైతులతోపాటు ఇతర రైతుల పంటలు సస్యశ్యామలం చేసేలా కృషి చేస్తామన్నారు.
నష్టాల నివారణకు అరటి పరిశోధన కేంద్రం..
జిల్లాలో అరటికి సంబంధించి అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి.. వాటిని అధిగమించడానికి పులివెందులలో ప్రత్యేకంగా అరటి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు... ఇందులో భాగంగా అరటి రైతుల సమస్యలు రానున్న కాలంలో తొలగిపోనున్నాయి. ఇప్పటికే భీమా ప్రీమియం కట్టినా ఇన్సూరెన్స్‌లు రాక.. పంట నష్టపరిహారం లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పులివెందులలో అరటి పరిశోధన కేంద్రం ఏర్పాటుతో రైతులు నష్టపోకుండా దిగుబడులు సాధించేందుకు పరిశోధన కేంద్రానికి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శిలాఫలకం ఆవిష్కరించడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి నియోజకవర్గంలోనూ ప్రత్యేక ల్యాబ్ :
కల్తీ విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల నియంత్రణకు ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేక ప్రయోగశాల ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. అందుకు సంబం ధించి రైతులు సంబంధిత ల్యాబ్ వేసిన తర్వాతనే నాణ్యమైన విత్తనాలు లేదా మందులను తీసుకునేలా ప్రణాళిక రూపొందించామని సీఎం స్పష్టం చేశారు. అంతేకాకుండా రైతులకు సంబంధించి నియోజకవర్గాలలో పంట ఉత్పత్తులను బట్టి శీతల గిడ్డంగుల నిర్మాణం చేపడతామన్నారు.
చెన్నూరు చెక్కర ఫ్యాక్టరీని తెరిపిస్తాం..
జిల్లా కేంద్రమైన కడపకు సమీపంలో ఉన్న చెన్నూరు రైతులు చెరుకు పండిస్తే చిత్తూరుకు పోవాల్సిన పరిస్థితి నెలకొంది.. అదే ఇక్కడే పరిశ్రమ ఉంటే ఆ ఇబ్బందులు ఉండవు.. వైఎస్సార్ హయాంలో ప్రాజెక్టు పనిచేసినా.. తర్వాత మళ్లీ మూతపడింది. సహకార రంగానికి సంబంధించిన చెక్కర ఫ్యాక్టరీని తెరిపిస్తామని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. అందుకు స్పందించి మళ్లీ చెన్నూరు చెక్కర ఫ్యాక్టరీకి పూర్వ వైభవం తీసుకొస్తామని.. ప్రస్తుత సర్కార్ ఆధ్వర్యంలో అందరికి మంచి రోజులు వస్తాయని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment