Jammulamadugu
-
మాజీ మంత్రి ఆదికి హైకోర్టులో ఎదురుదెబ్బ
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి, బీజేపీ నేత ఆదినారాయణరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకున్న 1+1 భద్రతను తొలగించడాన్ని సమర్థిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి ధర్మాసనం నిరాకరించింది. ప్రాణహాని లేనప్పుడు భద్రత కల్పించాల్సిన అవసరం లేదన్న సింగిల్ జడ్జి తీర్పును సమర్థించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆదినారాయణరెడ్డి దాఖలు చేసిన రిట్ అప్పీల్‌ను ధర్మాసనం కొట్టేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలితలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులిచ్చింది. (విజయవాడ ఘటనపై స్పందించరేం బాబూ?) -
గండికోటలో 8 ఫిరంగి గుండ్లు
సాక్షి, జమ్మలమడుగు : పర్యాటక కేంద్రమైన గండికోటలో 8 ఫిరంగి గుండ్లు బయటపడ్డాయి. గుండ్లు ఒక్కొక్కటి 15 కేజీల నుంచి 18 కేజీలు మరికొన్ని 12 కేజీల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. గండికోటలో కొన్ని రోజుల నుంచి కోనేరు సమీపం ప్రాంతంలో ఉన్న ముళ్ల పొదలను తొలగించి అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం నీటి తొట్టి బయటపడింది. అదే రోజు ఒక ఫిరంగి గుండు దొరికింది. శనివారం కూలీలతో పనులు చేయిస్తుండగా.. పూరాతన కాలం నాటి ఫిరంగి గుండ్లు బయటపడ్డాయి. గుండ్లు దొరికిన ప్రదేశం 400 ఏళ్ల నాటివి: గండికోటలో బయటపడ్డ ఫిరంగి గుండ్లు దాదాపు నాలుగు వందల ఏళ్ల నాటివని స్థానిక ప్రజలు, అధికారులు తెలుపుతున్నారు. గండికోట జూమ్మా మసీదు వెనుక వైపు ఆయుధ కర్మాగారంగా ఉండేది. అందులో రాజులకు సంబంధించిన కత్తులతోపాటు, నాణేల ముద్రణ కోసం టంకశాల కూడా ఉండేదని చరిత్ర చెబుతుందంటూ స్థానికులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం పహారా మహాల్ వద్ద ఫిరంగి ఉండగా మరొకటి దక్షిణ వైపులో ఉంది. ఇటీవల బయల్పడిన నీటి కుంట శత్రువులు రాకుండా అడ్డుకట్ట వేయడం కోసం అప్పట్లో రాజులు కోటకు సంబంధించిన నాలుగు వైపులా బురుజులను ఏర్పాటు చేసి కొన్ని ప్రాంతాలలో ఫిరంగులను ఏర్పాటు చేస్తుండే వారు. ఆ ఫిరంగి గుండ్లను ఉక్కుతో తయారు చేసే వారు. గతంలో ఎవరూ పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరుకుని భూగర్భంలో కలిసిపోయినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా జుమ్మా మసీదు వెనుక వైపు ఉన్న వ్యాయామశాల (తాళింఖానా), ఆయుధ కర్మాగారాలకు సైతం అధికారులు మరమ్మతు పనులు చేపట్టాలని పర్యాటకులు కోరుకుంటున్నారు. -
టౌన్ బ్యాంకులో సీబీసీఐడీ గుబులు
సాక్షి, జమ్మలమడుగు/ రూరల్ : జమ్మలమడుగు టౌన్ బ్యాంకులో 2016లో జరిగిన కోట్లాది రూపాయల అవినీతిపై సీబీసీఐడీ విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సోమవారం టౌ న్‌బ్యాంకు తాత్కాలిక పాలకవర్గం మూకుమ్మడి రా జీనామాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. టౌన్‌బ్యాంక్‌లో రూ.5కోట్ల అవినీతి... టౌన్ బ్యాంక్‌లో 2016లో పెద్దనోట్ల రద్దు సమయంలో టౌన్‌బ్యాంకు చైర్మన్, మేనేజర్లు సుమారు ఐదు కోట్ల రూపాయల అవినీతికి తెరలేపారు. స్థానికంగా వస్త్ర వ్యాపారులు ఇక్కడి నుంచి ఎక్కువగా గుజరాత్ లోని అహమ్మదాబాద్, సూరత్ తదితర ప్రాంతాల్లోని వ్యాపారులకు చెల్లించాల్సిన మొత్తాన్ని టౌన్‌బ్యాంకులో డీడీలు తీసి పంపించేవారు. అయితే డీడీలు పంపిన నెలకు కూడా డబ్బులు పడకపోవడంతో గుజరాత్ వ్యాపారులు స్థానిక వ్యాపారులను డబ్బులు ఇవ్వాలంటూ ఫోన్లు చేస్తూ వచ్చారు. అయితే తాము డీడీల రూపంలో డబ్బులు పంపినా వారి ఖాతాల్లో ఎందుకు జమ కాలేదని బ్యాంకు చైర్మన్, మేనేజర్లను వ్యాపారులు ప్రశ్నించారు. దీంతో తీగ లాగితే డొంక కదిలిందన్నట్లు అవినీతి బాగోతం వెలుగు చూసింది. టౌన్‌బ్యాంకులో ఉన్న రెండువేల మంది ఖాతాదారులకు సంబంధించిన ఐదుకోట్ల రూపాయలను చైర్మన్, మేనేజర్లు కలిసి వాడుకున్నారన్న విషయం బయపడింది. కో ఆపరేటివ్ బ్యాంక్ అధికారులు ఇక్కడ జరుగుతున్న లావాదేవీలపై విచారణ చేపట్టారు. ఐదు కోట్ల రూపాయల నిధులు స్వాహా చేసినట్లు తేల్చారు. మూకుమ్మడిగా పాలకవర్గం రాజీనామాలు టౌన్ బ్యాంక్‌లో కొనసాగుతున్న తాత్కాలిక పాలక వర్గం తమ పదవులకు సోమవారం రాజీనామాలు చేశారు. 2016 టౌన్‌బ్యాంక్‌లో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్న నేపథ్యంలో 2018లో చైర్మన్, వైస్ చైర్మన్, నలుగురు డైరెక్టర్లతో తాత్కాలికంగా నూతన పాలకవర్గాన్ని ఏర్పాటు చేశారు. నూతన పాలకవర్గం ఏర్పాటై ఏడాది గడిచినా బ్యాకు బాధితులకు మాత్రం ఎలాంటి న్యాయం చేయలేదు. దీంతో విధి లేని పరిస్థితిలో బాధితులు ముఖ్యమంత్రిని కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సీబీ సీఐడీ విచారణకు ఆదేశిస్తే పాలకవర్గం స్థానంలో ఉండి తాము సీబీసీఐడీ అధికారుల ప్రశ్నలకు జవాబు చెప్పాల్సి ఉంటుందని, ఆ తలనొప్పి తమకెందుకనే ఉద్దేశంతోనే పాలకవర్గం రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. రాజీనామా చేసింది వాస్తవమే.. టౌన్‌బ్యాంకు తాత్కాలిక పాలక వర్గంలో నలుగురు డైరెక్టర్లు, చైర్మన్, వైస్‌చైర్మన్ రాజీనామా చేసిన మాట వాస్తవమేనని టౌన్ బ్యాంక్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ సెల్ అధికారి ప్రభాకర్ రావు స్పష్టం చేశారు. పాలకవర్గం రాజీనామా లేఖలను ఉన్నతాధికారులకు పంపించామని ఆయన తెలిపారు. న్యాయం చేయాలంటూ ముఖ్యమంత్రిని కలిసిన బాధితులు ఈనెల 8వతేదీన జమ్మలమడుగులో రైతు దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా టౌన్ బ్యాంక్ బాధితులు హెలిప్యాడ్ వద్దకు వెళ్లి తమకు న్యాయం చేయాలంటూ ముఖ్యమంత్రిని కోరారు. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ టౌన్‌బ్యాంక్ బాధితులకు న్యాయం జరిగే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా టౌన్ బ్యాంకులో జరిగిన అవినీతిని బట్టబయలు చేయడం కోసం త్వరలో సీబీసీఐడీ విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. -
కడప జిల్లాకు మంచి రోజులు..
సాక్షి, కడప: జిల్లాకు మంచి రోజులు వచ్చాయి. అందరూ అనుకున్నట్లుగానే జిల్లా అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దపీట వేశారు. ప్రభుత్వం ఏర్పడి 40రోజుల పాలనలోనే జీవించిన జిల్లా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సిద్ధమయ్యారు. అందుకు సంబంధించి ఒకపక్క రైతులు.. మరోపక్క అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒకప్పుడు కరువుతో వ్యవసాయం రంగం సంక్షోభంలో పడగా.. అభివృద్ధి కూడా కుంటుపడింది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లా రూపురేఖలు మారాయి. ఎవరూ చేయని రీతిలో.. కనువిని ఎరుగని రీతిలో అభివృద్ధి చేసి చూపించారు. అదే తరహాలో జిల్లా వాసిగా.. పులివెందుల గడ్డతోపాటు జిల్లా ప్రజల రుణం తీర్చుకునేందుకు ఆయన తనయుడు జగన్ మోహన్‌రెడ్డి సంకల్పించారు. సీఎంగా అధికారిక హోదాలో సోమవారం తొలిసారి జిల్లా కు వచ్చిన ఆయన జిల్లా అభివృద్ధి బాట పట్టించనున్నట్లు హర్షద్వానాల మద్య ప్రకటించారు. జిల్లా అభివృద్ధిని విస్మరించడంతోపాటు ఉన్న పనులను చేయకుండా నిర్లక్ష్యం చేశారంటూ గత ప్రభుత్వాలను తపు పట్టారు.. అయితే పాదయాత్రతోపాటు అనేక సందర్భాలలో జిల్లా ప్రజలు ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని తన దృష్టికి తీసుకొచ్చారని.. త్వరలోనే డిసెంబర్ 26న ఇక్కడే (జమ్మలమడుగు ప్రాంతంలో) ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. కళ తప్పిన ఈ ప్రాంతంలో కొత్త కళ తీసుకొస్తామని.. 20వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు.. పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. అంతేకాకుండా అనుకున్నట్లుగానే ఆరు నెలల్లోపు శంకుస్థాపన చేయడం.. మూడేళ్లలోపు పూర్తి చేసి ప్రాజెక్టులో ఉత్పత్తి చేసేలా చర్యలు ప్రారంభిస్తామన్నారు. దేవుడు అనుకూలిస్తే గండికోటలో 20టీఎంసీలు.. జిల్లాలోని గండికోట ప్రాజెక్టుకు సంబంధించి ఉన్న చిన్న, చిన్న అవంతరాలను పరిష్కరిస్తాం.. గతంలో ఒక్కొక్కరికి రూ.6.75లక్షలు పరిహారం ఇచ్చాం.. మనం గతంలో ఇచ్చిన మాట ప్రకారం ముంపు బాధితుల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున పరిహారం ఇస్తున్నట్లు హర్షద్వానాల మధ్య ప్రకటించారు. అక్కడ ఉన్న 15గ్రామాల ప్రజలను ఖాళీ చేయించడంతోపాటు దేవుడు అనుకూలిస్తే.. గండికోట ప్రాజెక్టులో సుమారు 20టీఎంసీల నీటిని నిల్వ చేస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ప్రజలు, దేవుడు అనుకూలంగా ఉంటే 20టీఎంసీల నీటిని గండికోటకు తీసుకొచ్చి జిల్లాలోని పలు ప్రాంతాలకు అందించి సస్యశ్యామలం చేసే దిశగా అడుగులు వేస్తామన్నారు. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో ప్రాజెక్టులపరంగా చాలా అభివృద్ధి జరిగిందని.. తర్వాత ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆయన అన్నారు. రాజోలు ప్రాజెక్టును నిర్మిస్తాం.. జిల్లాలో మైదుకూరు, ప్రొద్దుటూరుతోపాటు ఇతర ప్రాంతాలకు కూడా ప్రయోజనం కలిగించే రాజోలు ప్రాజెక్టు నిర్మాణాన్ని త్వరలో చేపడతామని... అందుకు సంబంధించి డిసెంబర్ 26న ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నట్లు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. అయితే ఇంతకమునుపే మన ప్రియతమ నాయకులు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రా>జశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారని.. అయితే తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో ప్రాజెక్టు అలాగే ఉండిపోయిందన్నారు. 3టీఎంసీల సామర్థ్యంతో రాజోలు ప్రాజెక్టు నిర్మాణానికి, ఒక టీఎంసీ సామర్థ్యంతో జలధార ప్రాజెక్టుకు రూపకల్పన చేసి డిసెంబర్ 26న శంకుస్థాపన చేస్తామన్నారు. అనంతరం త్వరలోనే పూర్తి చేసి కేసీ ప్రాంత రైతులతోపాటు ఇతర రైతుల పంటలు సస్యశ్యామలం చేసేలా కృషి చేస్తామన్నారు. నష్టాల నివారణకు అరటి పరిశోధన కేంద్రం.. జిల్లాలో అరటికి సంబంధించి అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి.. వాటిని అధిగమించడానికి పులివెందులలో ప్రత్యేకంగా అరటి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు... ఇందులో భాగంగా అరటి రైతుల సమస్యలు రానున్న కాలంలో తొలగిపోనున్నాయి. ఇప్పటికే భీమా ప్రీమియం కట్టినా ఇన్సూరెన్స్‌లు రాక.. పంట నష్టపరిహారం లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పులివెందులలో అరటి పరిశోధన కేంద్రం ఏర్పాటుతో రైతులు నష్టపోకుండా దిగుబడులు సాధించేందుకు పరిశోధన కేంద్రానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శిలాఫలకం ఆవిష్కరించడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ ప్రత్యేక ల్యాబ్ : కల్తీ విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల నియంత్రణకు ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేక ప్రయోగశాల ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. అందుకు సంబం ధించి రైతులు సంబంధిత ల్యాబ్ వేసిన తర్వాతనే నాణ్యమైన విత్తనాలు లేదా మందులను తీసుకునేలా ప్రణాళిక రూపొందించామని సీఎం స్పష్టం చేశారు. అంతేకాకుండా రైతులకు సంబంధించి నియోజకవర్గాలలో పంట ఉత్పత్తులను బట్టి శీతల గిడ్డంగుల నిర్మాణం చేపడతామన్నారు. చెన్నూరు చెక్కర ఫ్యాక్టరీని తెరిపిస్తాం.. జిల్లా కేంద్రమైన కడపకు సమీపంలో ఉన్న చెన్నూరు రైతులు చెరుకు పండిస్తే చిత్తూరుకు పోవాల్సిన పరిస్థితి నెలకొంది.. అదే ఇక్కడే పరిశ్రమ ఉంటే ఆ ఇబ్బందులు ఉండవు.. వైఎస్సార్ హయాంలో ప్రాజెక్టు పనిచేసినా.. తర్వాత మళ్లీ మూతపడింది. సహకార రంగానికి సంబంధించిన చెక్కర ఫ్యాక్టరీని తెరిపిస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. అందుకు స్పందించి మళ్లీ చెన్నూరు చెక్కర ఫ్యాక్టరీకి పూర్వ వైభవం తీసుకొస్తామని.. ప్రస్తుత సర్కార్ ఆధ్వర్యంలో అందరికి మంచి రోజులు వస్తాయని స్పష్టం చేశారు. -
సీఎం హోదాలో తొలిసారి కడప జిల్లాకు వైఎస్ జగన్
సాక్షి, వేంపల్లె/జమ్మలమడుగు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్ హరికిరణ్ ఆదేశించారు. ఆయన శుక్రవారం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్, హెలీప్యాడ్‌ను గండి ఆలయ ప్రాంగణాన్ని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ కొండారెడ్డిలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 8న వైఎస్సార్ జయంతి సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇడుపులపాయకు చేరుకుని తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి, సమాధికి నివాళులర్పిస్తారని తెలిపారు. అనంతరం గండి క్షేత్రంలో ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారన్నారు. పులివెందుల డాక్టర్ వైఎస్సార్ ఆర్టికల్చర్ యూనివర్శిటీకి అనుబంధంగా అరటి రీసెర్చ్ స్టేషన్‌కు గండిలో శంకుస్థాపన చేస్తారన్నారు. జమ్మలమడుగులో జరిగే సభా వేదికగా రైతులకు మద్దతు ధర, వైఎస్సార్ పెన్షన్ కానుక ప్రారంభించనున్నారన్నారు. ఎన్నికల ముందు మాట ఇచ్చిన నేపథ్యంలో క్వింటా శనగలకు రూ.6,500, వైఎస్సార్ పెన్షన్‌ను రూ.2250లు అందజేస్తారని తెలిపారు. జమ్మలమడుగులో రైతులకు శనగకు మద్దతు ధర రూ.6,500 చెక్కులను అందజేస్తారని తెలిపారు. వృద్ధులకు, వికలాంగులకు, వితంతు తదితర పెరిగిన పింఛన్లు అందజేస్తారన్నారు. పర్యటనకు సంబంధించి మా ర్పులు, చేర్పులపై విధి విధానాలు సీఎం కార్యాల యం నుంచి రావాల్సి ఉందన్నారు. వైఎస్సార్సీపీ నియోజకవర్గ బూత్ కమిటీ మేనేజర్ బెల్లం ప్రవీణ్ కుమార్‌రెడ్డి, మండల కన్వీనర్ చంద్ర ఓబుళరెడ్డి, మండల బూత్ కమిటీ మేనేజర్ ఆర్.శ్రీను, మాజీ సర్పంచ్ సురేష్, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి ఆదినారాయణరెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, శంకరయ్యలతో పాటు కడప ఆర్డీఓ మలోల, పీఆర్ ఈఈ రామలింగారెడ్డి, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. రైతు సంక్షేమానికి తండ్రి బాటలో సీఎం రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక జగన్మోహన్రెడ్డి మొదటిసారిగా జిల్లాలో పర్యటించబోతున్నారని డిఫ్యూటీ సీఎం అంజద్‌బాషా అన్నారు. జమ్మలమడుగులో జగన్ పర్యటన పర్యటన ఏర్పాట్లను డిప్యూటీ సీఎం అంజద్ బాషా, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి..సుధీర్‌రెడ్డి,కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు,తలశిల రఘురాం పరిశీలించారు. ఈ సందర్భంగా డిఫ్యూటీ సీఎం మాట్లాడుతూ ఎన్నికల సమయంలో జగన్ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ దివంగత నాయకుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పథకాలు ఆదర్శంగా నిలిచాయన్నారు. ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా రైతు పక్షపాతిగా నిలవనున్నారని తెలిపారు. ఇక్కడ జరిగే రైతు సదస్సులో జగన్ మోహన్‌రెడ్డి పాల్గొంటారన్నారు. రైతులకు పలు వరాలు ఇవ్వబోతున్నారన్నారు. రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో జగన్ చర్చించి గోదావరి జలాలను కృష్ణనదిలోనికి మళ్లించే బృహత్తర కార్యక్రమం చేపట్టబోతున్నారని తెలిపారు. గోదావరి నదిలో 90 నుంచి 100 రోజుల వరకు వరద నీరు పారుతుంది. 180 టీఎంసీల నుంచి 200 టీఎంసీ నీరు గోదావరి నుంచి కృష్ణానది లోనికి మళ్లించుకుని రాయలసీమలోని దాదాపు 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉందన్నారు. నీటిని మళ్లించుకోవడం కోసం దాదాపు లక్ష కోట్ల బడ్జెట్ అవుతుందని ..ఈ దిశగా వైఎస్ జగన్మోహన్రెడ్డి కసరత్తు చేస్తున్నారన్నారు. గోదావరి నుంచి నీటిని కృష్ణానదిలోనికి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.గతంలో ఆయన తండ్రి వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి జలయజ్ఞం పనులు చేపట్టి రైతుల భూములకు సాగునీరు అందించి ఆపరభగీరథుడుగా పేరు సంపాదించారు. ఆయన కుమారుడు కూడా రైతుల సంక్షేమానికి పెద్దపీటవేస్తారన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శంకర్‌రెడ్డి మాజీ ఎంపీపీ అల్లె ప్రభావతి, మల్కిరెడ్డి.హనుమంతరెడ్డి, పోరెడ్డి మహేశ్వరరెడ్డి,గౌస్‌లాజం,లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు. సభావేదిక పరిశీలన జమ్మలమడుగు రూరల్: జమ్మలమడుగు సభా ప్రాంగణాన్ని శుక్రవారం సాయంత్రం జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి, ఎమ్మెల్యే మూలే సుధీర్‌రెడ్డి, డీఎస్పీ కోలా కృష్ణన్ పరిశీలించారు. వేదిక,రూట్ మ్యాపు, హెలిప్యాడ్ల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎంత మంది వచ్చే అవకశముందో అంచనా వేశారు. సభావేదిక నిర్వాహణ, గ్యాలరీ, సెక్యూరిటీ గురించి చర్చించారు. సభకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. హనుమంతరెడ్డి, పోరెడ్డిమహేశ్వరరెడ్డి, బ్రçహాæ్మనందరెడ్డి,కులాయ్బాషా, విష్ణువర్ధన్‌రెడ్డి, శివగుర్విరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆర్అండ్బీ అతిథి గృహంలో నేతల భేటీ కడప కార్పొరేషన్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి అంజద్‌బాషా, వైఎస్ఆర్సీపీ కడప, రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు కె. సురేష్‌బాబు, ఆకేపాటి అమర్నాథ్రెడ్డిలు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, పి. రవీంద్రనాథ్‌రెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి, డాక్టర్ సుధీర్‌రెడ్డి తదితరులు సమావేశమై చర్చించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక తొలిసారిగా వస్తున్న జగన్‌కు ఘన స్వాగతం పలికేందుకు ఎదురు చూస్తున్నారన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లు చేయాలన్నారు. సభా స్థలం వద్ద డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యేలు 8వ దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద వృద్ధు్దలు, వితంతువులకు రూ.2250లు పింఛన్ ఇవ్వడం జరుగుతోందన్నారు. సభకు రైతులు ఎక్కువగా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సభకు ప్రజల తరలింపునకు ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకోవడంపై నేతల విముఖత ప్రదర్శించారు. అవసరమైతే ప్రైవేటు వాహనాలు ఏర్పాటు చేయాలని సూచించారు. రైతులు, డ్వాక్రా మహిళలు, కార్యకర్తలకు ఎలాంటి లోటు పాట్లు లేకుండా తాగునీరు, వసతి సౌకర్యాలు కల్పించాలన్నారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు. -
జమ్మలమడుగులో పోలీసుల ఓవరాక్షన్
-
జమ్మలమడుగులో పోలీసుల ఓవరాక్షన్
వైఎస్ఆర్ జిల్లా: జమ్మలమడుగు నియోజకవర్గంలో పోలీసుల ఓవరాక్షన్ చేశారు. నేడు (గురువారం) ఏసీసీ సిమెంట్స్ కోసం ప్రజాభిప్రాయ సేకరణ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నేత సుధీర్ రెడ్డి, మానవహక్కుల వేదిక కన్వీనర్ జయ, సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్యలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినట్టు తెలిసింది. జమ్మలమడుగు పరిసర గ్రామాల్లో భారీగా పోలీసులు మోహరించినట్టు సమాచారం.