జమ్మలమడుగు టౌన్‌బ్యాంక్
సాక్షి, జమ్మలమడుగు/ రూరల్ : జమ్మలమడుగు టౌన్ బ్యాంకులో 2016లో జరిగిన కోట్లాది రూపాయల అవినీతిపై సీబీసీఐడీ విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సోమవారం టౌ న్‌బ్యాంకు తాత్కాలిక పాలకవర్గం మూకుమ్మడి రా జీనామాలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
టౌన్‌బ్యాంక్‌లో రూ.5కోట్ల అవినీతి...
టౌన్ బ్యాంక్‌లో 2016లో పెద్దనోట్ల రద్దు సమయంలో టౌన్‌బ్యాంకు చైర్మన్, మేనేజర్‌లు సుమారు ఐదు కోట్ల రూపాయల అవినీతికి తెరలేపారు. స్థానికంగా వస్త్ర వ్యాపారులు ఇక్కడి నుంచి ఎక్కువగా గుజరాత్ లోని అహమ్మదాబాద్, సూరత్ తదితర ప్రాంతాల్లోని వ్యాపారులకు చెల్లించాల్సిన మొత్తాన్ని టౌన్‌బ్యాంకులో డీడీలు తీసి పంపించేవారు. అయితే డీడీలు పంపిన నెలకు కూడా డబ్బులు పడకపోవడంతో గుజరాత్ వ్యాపారులు స్థానిక వ్యాపారులను డబ్బులు ఇవ్వాలంటూ ఫోన్‌లు చేస్తూ వచ్చారు. అయితే తాము డీడీల రూపంలో డబ్బులు పంపినా వారి ఖాతాల్లో ఎందుకు జమ కాలేదని బ్యాంకు చైర్మన్, మేనేజర్‌లను వ్యాపారులు ప్రశ్నించారు. దీంతో తీగ లాగితే డొంక కదిలిందన్నట్లు అవినీతి బాగోతం వెలుగు చూసింది. టౌన్‌బ్యాంకులో ఉన్న రెండువేల మంది ఖాతాదారులకు సంబంధించిన ఐదుకోట్ల రూపాయలను చైర్మన్, మేనేజర్‌లు కలిసి వాడుకున్నారన్న విషయం బయపడింది. కో ఆపరేటివ్ బ్యాంక్ అధికారులు ఇక్కడ జరుగుతున్న లావాదేవీలపై విచారణ చేపట్టారు. ఐదు కోట్ల రూపాయల నిధులు స్వాహా చేసినట్లు తేల్చారు.
మూకుమ్మడిగా పాలకవర్గం రాజీనామాలు
టౌన్ బ్యాంక్‌లో కొనసాగుతున్న తాత్కాలిక పాలక వర్గం తమ పదవులకు సోమవారం రాజీనామాలు చేశారు. 2016 టౌన్‌బ్యాంక్‌లో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్న నేపథ్యంలో 2018లో చైర్మన్, వైస్ చైర్మన్, నలుగురు డైరెక్టర్లతో తాత్కాలికంగా నూతన పాలకవర్గాన్ని ఏర్పాటు చేశారు. నూతన పాలకవర్గం ఏర్పాటై ఏడాది గడిచినా బ్యాకు బాధితులకు మాత్రం ఎలాంటి న్యాయం చేయలేదు. దీంతో విధి లేని పరిస్థితిలో బాధితులు ముఖ్యమంత్రిని కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సీబీ సీఐడీ విచారణకు ఆదేశిస్తే పాలకవర్గం స్థానంలో ఉండి తాము సీబీసీఐడీ అధికారుల ప్రశ్నలకు జవాబు చెప్పాల్సి ఉంటుందని, ఆ తలనొప్పి తమకెందుకనే ఉద్దేశంతోనే పాలకవర్గం రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
రాజీనామా చేసింది వాస్తవమే..
టౌన్‌బ్యాంకు తాత్కాలిక పాలక వర్గంలో నలుగురు డైరెక్టర్లు, చైర్మన్, వైస్‌చైర్మన్ రాజీనామా చేసిన మాట వాస్తవమేనని టౌన్ బ్యాంక్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ సెల్ అధికారి ప్రభాకర్ రావు స్పష్టం చేశారు. పాలకవర్గం రాజీనామా లేఖలను ఉన్నతాధికారులకు పంపించామని ఆయన తెలిపారు.
న్యాయం చేయాలంటూ ముఖ్యమంత్రిని కలిసిన బాధితులు
ఈనెల 8వతేదీన జమ్మలమడుగులో రైతు దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా టౌన్ బ్యాంక్ బాధితులు హెలిప్యాడ్ వద్దకు వెళ్లి తమకు న్యాయం చేయాలంటూ ముఖ్యమంత్రిని కోరారు. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ టౌన్‌బ్యాంక్ బాధితులకు న్యాయం జరిగే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా టౌన్ బ్యాంకులో జరిగిన అవినీతిని బట్టబయలు చేయడం కోసం త్వరలో సీబీసీఐడీ విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment