లూటీ కేసులో రిక‘వర్రీ’ | Where Is Action Against Town Bank Fund Scam | Sakshi
Sakshi News home page

లూటీ కేసులో రిక‘వర్రీ’

Published Wed, Jul 3 2019 9:49 AM | Last Updated on Wed, Jul 3 2019 9:49 AM

Where Is Action Against Town Bank Fund Scam - Sakshi

బ్యాంక్‌ ఖాతాదారుల నమ్మకాన్ని వారు సొమ్ము చేసుకున్నారు. చైర్మన్, సీఈఓ సంయుక్తంగా భారీ మొత్తాన్ని స్వాహా చేశారు. రెండేళ్లవుతున్నా నిందితులపై చర్యలు లేవు. నాటి సహకార మంత్రి వారికి కొమ్ముకాయడంతో అధికార యంత్రాంగం ముందడుగు వేయలేకపోయింది. దీంతో బ్యాంకును లూటీ చేసిన వారు దర్జాగా తిరుగుతున్నారు. బాధితులకు మాత్రం నేటికీ పరిష్కారం కనిపించలేదు. తాత్కాలిక పాలకవర్గం కూడా కనీస చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు దారితీస్తోంది.

సాక్షి ప్రతినిధి కడప: జమ్మలమడుగు టౌన్‌ బ్యాంక్‌పై తొలినాళ్ల నుంచి దేవగుడి బ్రదర్స్‌దే పెత్తనం. పాలకవర్గ ఎన్నికల్లోనూ వారిదే ఆధిపత్యం. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సమీప బంధువు తాతిరెడ్డి హృషికేశవరెడ్డి దీనికి చైర్మన్‌గా ఉండేవారు.  2017లో టౌన్‌బ్యాంక్‌లో ఖాతాదారుల సొమ్ము స్వాహా అయినట్లు గుర్తించారు. ఖాతాదారుల ఆందోళనతో ఈ వైనం బయటపడింది. ఆరా తీస్తే అదే ఏడాది సెప్టెంబర్‌లో రూ.3.49 కోట్లు పక్కదారి పట్టిందని తేలింది. అప్పటి కో–ఆపరేటివ్‌ అధికారి వెంకటసుబ్బయ్య విచారించి ఈ విషయాన్ని ధ్రువీకరించారు. టౌన్‌బ్యాంక్‌ చైర్మను, సీఈఓలపై  పోలీసులు కేసు నమోదుచేశారు. స్వాహా అయిన మొత్తంలో సీఈఓ కమ్‌ మేనేజర్‌గా ఉన్న శ్రీనివాస బాలాజీ రూ.1.5కోట్లు కాజేసినట్లు తేల్చారు. మిగతా మొత్తం హృషికేశవరెడ్డి వాడుకున్నట్లు స్పష్టమైంది.
 
అటాచ్డ్‌తో సరిపెట్టిన యంత్రాంగం...
ఈ సంఘటన తర్వాత ఖాతాదారుల్లో అలజడి చెలరేగింది. సేవింగ్స్‌లో డిపాజిట్‌ చేసిన మొత్తం పరులుపాలైయ్యిందని తెలుసుకొని లబోదిబోమంటూ రోడ్డు ఎక్కారు. అప్పట్లో కో–ఆపరేటివ్‌ యంత్రాంగం చైర్మన్, సీఈఓ ఆస్తులు ఆచాట్‌మెంట్‌ చేయాలని నిర్ణయం తీసుకుంది. కానీ తర్వాత అడుగు పడలేదు. తదుపరి ఉత్తర్వులు అమలుపర్చి ఖాతాదారులకు న్యాయం చేసేందుకు చర్యలు చేపట్టలేదు. సీఈఓ శ్రీనివాస బాలాజీకి సంబంధించిన ఇళ్లు, హృషికేశవరెడ్డి ఆస్థిని టౌన్‌బ్యాంక్‌ అధికారులు అటాచ్‌ చేసుకున్నారు. సీఈఓ నుంచి రూ.6.83లక్షలు నగదు, మూడు వాహనాలు, 4 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. రూ.93.46 లక్షలు బ్యాంక్‌ డబ్బును వడ్డీల రూపంలో కొందరికి ఇచ్చారని విచారణలో తేల్చారు.

హృషికేశవరెడ్డి నుంచి ఎలాంటి రికవరీ చేయలేదు. అప్పట్లో సహకార మంత్రిగా ఆదినారాయణరెడ్డి ఉండడంతో ఇందుకు అధికారులు సాహసించలేకపోయారని తెలిసింది.   సహకారశాఖ ఆస్తులను అటాచ్‌ చేసినా వేలం వేయకుండా హైకోర్టు నుంచి స్టేటస్‌కో ఆర్డర్‌ తెచ్చుకున్నారు. సహకార శాఖ యంత్రాంగం హైకోర్టుకు వెళ్లి స్టేటస్‌కో ఆర్డర్‌ రద్దు చేయించడం, చైర్మన్‌ ఆస్తులను స్వాధీనం చేసుకొని వేలం వేయడం లాంటి ప్రక్రియ చేపట్టాల్సి ఉంది. కానీ ఎలాంటి చర్యలు చేపట్టడడం లేదు. నిమ్మకు నీరెత్తినట్లుగానే వ్యవహరించింది.

తాత్కాలిక పాలకమండలి సైతం....
టౌన్‌ బ్యాంక్‌లో ఎప్పటి నుంచో దేవగుడి బ్రదర్స్‌ ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులు గౌరవాధ్యక్షులుగా కూడా వ్యవహరించారు. ఖాతాదారుల సొమ్ము స్వాహా నేపథ్యం తర్వాత తాత్కాలిక పాలకమండలిని ఏర్పాటు చేశారు. అందులో కూడా చాతుర్యం ప్రదర్శించి, ధర్మాపురం మాజీ సర్పంచ్‌ను చైర్మనుగా ఎంపికయ్యేలా చక్రం తిప్పారు. తాత్కాలిక పాలకమండలి సైతం స్వాహా కేసులో రికవరీకి చర్యలు తీసుకోవలేదనే ఆరోపణలు ఉన్నాయి.

2వేల మంది ఖాతాదారులు దాచుకున్న సొమ్మును స్వాహా చేసిన వారి నుంచి ఆ మొత్తాన్ని రాబట్టేందుకు అడుగులు వేయలేదు. మంత్రిగా ఆదినారాయణరెడ్డి ఉన్నారనే చర్యలకు వెనకాడినట్లు ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి టౌన్‌ బ్యాంక్‌ను లూఠీ చేసి దర్జాగా తిరుగుతున్న చైర్మన్, సీఈఓల నుంచి రికవరీ చేయాలని ఖాతాదారులు డిమాండ్‌ చేస్తున్నారు. ఆరు నెలల్లో వారి ఆస్తులు విక్రయించి సొమ్ము తిరిగి అప్పగిస్తామని ఖాతాదారులకు చెప్పిన అధికారులు రెండేళ్లవుతోన్నా స్పందించడంలేదు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement