మంగళవారం శాసనసభలో మేనిఫెస్టో చూపిస్తూ మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: తమ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం అసెంబ్లీలో రైతు భరోసాపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. తమది చంద్రబాబులా మోసం చేసే ప్రభుత్వం కాదని, రైతుల కోసం నాలుగు అడుగులు ముందుకు వేసే ప్రభుత్వమని స్పష్టం చేశారు. పంటలకు ప్రకటించిన గిట్టుబాటు ధర గురించి.. ఏ పంటకు ఎంత రేటో మరోసారి గురువారం పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తామన్నారు. ‘వరి, జొన్న, మొక్కజొన్న, రాగి, పత్తి, కందులు, మినుములు, పెసలు, శనగ, వేరుశనగ, పసుపు, మిరప మొదలైన పంటలను కనీస గిట్టుబాటు ధరల కన్నా తక్కువ రేటుకు ఏ రైతు కూడా అమ్ముకోవాల్సిన పనిలేదు. కనీస గిట్టుబాటు ధరకు మీరు అమ్ముకోలేని పరిస్థితి ఉంటే ఫలానా చోటుకు వెళ్లి అమ్ముకోండి.. ప్రభుత్వమే దగ్గరుండి కొనుగోలు చేస్తుందనే వివరాలు ప్రకటనలో ఇస్తాం. మీ కరపత్రం ‘ఈనాడు’లో కూడా యాడ్ (ప్రకటన) ఇచ్చి రైతులకు మంచి చేస్తాం’ అని సీఎం వైఎస్ జగన్ అన్నారు.
అన్నదాతలకు అండగా ఉంటాం
రైతులకు ఏదైనా సమస్య ఉంటే టెలిఫోన్ నంబరు కూడా ఇస్తున్నామని, సమస్య తెలుసుకుని సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరిస్తారని సీఎం తెలిపారు. రూ.3 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ద్వారా రైతుకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. ‘ధాన్యం కొనుగోళ్ల గురించి ప్రతిపక్ష నేత మాట్లాడుతున్నారు.. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి గత ప్రభుత్వంలో రూ.960 కోట్లు బకాయిలు పెడితే, మేం అధికారంలోకి వచ్చాక చెల్లించాము అని చెప్పడానికి గర్వపడుతున్నాం.
ఆ డబ్బు ఇవ్వలేనందుకు ప్రతిపక్ష నేత సిగ్గుతో తలవంచుకోవాలి’ అన్నారు. అంతకు ముందు ప్రతిపక్ష నేత చంద్రబాబు రుణమాఫీ, రైతుభరోసాపై పదే పదే అబద్ధాలు వల్లె వేయడంపై సీఎం స్పందిస్తూ.. కుక్క తోక వంకర అన్న సామెతకు చంద్రబాబు సరిగ్గా అతికినట్టు సరిపోతారంటూ సభలో ఆయన (చంద్రబాబు) వైపునకు తిరిగి నమస్కారం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment