సాక్షి, ఒంగోలు : కాలం కలిసి రాక అప్పుల బాధతో బలవన్మరణాలకు పాల్పడిన అన్నదాతల కుటుంబాలను ఆదుకునే దిశగా సీఎం వైఎస్ జగన్‌మోహన్ అడుగులు వేస్తున్నారు. ఆసరా కోల్పోయిన అభాగ్యులకు ఆర్థిక చేయూతనివ్వాలని నిర్ణయించారు. గత ప్రభుత్వ పాలనలోని ఐదేళ్ల కాలంలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలకు ఇప్పటికీ నష్ట పరిహారం అందకపోవడంపై ఆయన సీరియస్‌గా స్పందించిన విషయం తెలిసిందే. బుధవారం జరిగిన కలెక్టర్‌ల వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఒక్కో రైతు కుటుంబానికి రూ.7 లక్షల చొప్పున నష్ట పరిహారం అందించి ఆ కుటుంబాన్ని అన్నలా ఆదరించేందుకు చర్యలు ప్రారంభించడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రకాశం జిల్లాలో గడచిన ఐదేళ్లలో 150 మందికి పైగా రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. అయితే అప్పటి ప్రభుత్వం వీరికి నష్ట పరిహారం చెల్లించకుండా వదిలేయడంతో ఆ కుటుంబాలు ఆదుకునే వారు లేక దుర్భర జీవనం సాగిస్తున్నాయి. తన సుదీర్ఘ పాదయాత్రలో వారి బాధలు విన్న సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల వ్యవధిలోనే వారికి న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ సైతం సీఎం ఆదేశాలతో పది రోజుల వ్యవధిలో డీసీఆర్‌బీ ( డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డ్ బ్యూరో) లెక్కల ప్రకారం రైతు ఆత్మహత్యలపై సమగ్ర విచారణ జరిపి అన్నదాతల కుటుంబాలకు న్యాయం చేయాలని నిర్ణయించారు. ఇదే జరిగితే జిల్లాలో పదుల సంఖ్యలో రైతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి చేయూత అందనుంది.
నాడు త్రిసభ్య కమిటీ నివేదికే ఆధారం..
జిల్లాలో గత ఐదేళ్లలో పంటలు పండక తీవ్ర నష్టాలపాలైన అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. వందాలాది మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. డీసీఆర్‌బీ లెక్కల ప్రకారం జిల్లాలో 152 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అయితే అప్పటి ప్రభుత్వం మాత్రం త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కొద్ది మంది రైతుల కుటుంబాలకు మాత్రమే నష్టపరిహారం అందించి చేతులు దులుపుకుంది. అది కూడా ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షలు మాత్రమే ఇచ్చారు. ప్రతిపక్ష నేత హోదాలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన పాదయాత్రలో నిరాదరణకు గురైన కుటుంబాల గోడు విన్న వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన నెల వ్యవధిలోనే ఆ కుటుంబాలకు న్యాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా బుధవారం కలెక్టర్‌లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆదేశాలు జారీ చేశారు.
డీసీఆర్‌బీ లెక్కలను బయటపెట్టి నిజంగా ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతుల కుటుంబాల వద్దకు ఎమ్మెల్యేలతో కలిసి వెళ్లి వారికి అండగా ఉంటామనే భరోసా కల్పించి రూ.7 లక్షల చొప్పు న నష్ట పరిహారం అందించాలని ఆదేశాలు ఇచ్చా రు. దీంతో గత ప్రభుత్వ హయాంలో జరిగిన రైతుల ఆత్మహత్యలపై ఆర్డీ, డీఎస్పీ స్థాయి అధి కారులతో కమిటీ ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కలెక్టర్ పోలా భాస్కర్ నిర్ణయించారు. డీసీఆర్‌బీ లెక్కల ఆధారంగా విచారణ చేపట్టాలని భావిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో వేగంగా ఈ ప్రక్రియను పూర్తి చేసి నిజంగా అప్పుల బాధతో ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలను గుర్తించి న్యాయం చేయాలని నిర్ణయించారు. సీఎం నిర్ణయంపై రైతు సంఘాల నాయకులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. రైతు సంఘాల నేతలు ఆందోళనలు చేసినా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని, అడగకుండానే వారి ఇబ్బందులు గ్రహించి రైతుల కుటుంబాలను ఆదుకోవాలని చూడటం నిజంగా అభినందనీయమనే అభిప్రాయంలో ఉన్నారు.
న్యాయం చేయమంటే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు..
జిల్లాలోని కొత్తపట్నం మండలం గాదెపాలెం గ్రామానికి చెందిన పొగాకు రైతు వెంకట్రామిరెడ్డి 2015లో అప్పుల బాధతో బలవన్మరణానికి పాల్పడితే ఆ కుటుంబానికి న్యాయం చేయాలంటూ పొగాకు బోర్డు ఎదుట అతని మృతదేహంతో ధర్నా చేపట్టిన రైతు సంఘాల నేతలు, మాపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి రైతులకు న్యాయం చేసే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.7 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం హర్షణీయం.
– మారెడ్డి సుబ్బారెడ్డి, వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు
గత ప్రభుత్వం లెక్కల తక్కువ చేసి చూపే యత్నం చేసింది..
గత ప్రభుత్వం రైతుల ఆత్మహత్యలను తక్కువ చేసి చూపించేందుకు పోలీసులపై సైతం ఒత్తిడి తెచ్చింది. దీని వల్ల రైతుల కుటుంబాలు సర్వ నాశనమయ్యాయి. బలవన్మరణాలకు పాల్పడిన రైతు కుటుంబాలకు న్యాయం చేయాలని సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం అభినందనీయం. ప్రస్తుత ప్రభుత్వం రైతుల సంక్షేమానికి తీసుకుంటున్న నిర్ణయాల వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి లేకుండా చేస్తుంది.
– చుండూరి రంగారావు, జిల్లా అభివృద్ధి వేదిక అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment