formers suicides
-
ఆపన్నులకు అండగా..
సాక్షి, ఒంగోలు : కాలం కలిసి రాక అప్పుల బాధతో బలవన్మరణాలకు పాల్పడిన అన్నదాతల కుటుంబాలను ఆదుకునే దిశగా సీఎం వైఎస్ జగన్మోహన్ అడుగులు వేస్తున్నారు. ఆసరా కోల్పోయిన అభాగ్యులకు ఆర్థిక చేయూతనివ్వాలని నిర్ణయించారు. గత ప్రభుత్వ పాలనలోని ఐదేళ్ల కాలంలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలకు ఇప్పటికీ నష్ట పరిహారం అందకపోవడంపై ఆయన సీరియస్‌గా స్పందించిన విషయం తెలిసిందే. బుధవారం జరిగిన కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఒక్కో రైతు కుటుంబానికి రూ.7 లక్షల చొప్పున నష్ట పరిహారం అందించి ఆ కుటుంబాన్ని అన్నలా ఆదరించేందుకు చర్యలు ప్రారంభించడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రకాశం జిల్లాలో గడచిన ఐదేళ్లలో 150 మందికి పైగా రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. అయితే అప్పటి ప్రభుత్వం వీరికి నష్ట పరిహారం చెల్లించకుండా వదిలేయడంతో ఆ కుటుంబాలు ఆదుకునే వారు లేక దుర్భర జీవనం సాగిస్తున్నాయి. తన సుదీర్ఘ పాదయాత్రలో వారి బాధలు విన్న సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల వ్యవధిలోనే వారికి న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ సైతం సీఎం ఆదేశాలతో పది రోజుల వ్యవధిలో డీసీఆర్బీ ( డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డ్ బ్యూరో) లెక్కల ప్రకారం రైతు ఆత్మహత్యలపై సమగ్ర విచారణ జరిపి అన్నదాతల కుటుంబాలకు న్యాయం చేయాలని నిర్ణయించారు. ఇదే జరిగితే జిల్లాలో పదుల సంఖ్యలో రైతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి చేయూత అందనుంది. నాడు త్రిసభ్య కమిటీ నివేదికే ఆధారం.. జిల్లాలో గత ఐదేళ్లలో పంటలు పండక తీవ్ర నష్టాలపాలైన అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. వందాలాది మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. డీసీఆర్బీ లెక్కల ప్రకారం జిల్లాలో 152 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అయితే అప్పటి ప్రభుత్వం మాత్రం త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కొద్ది మంది రైతుల కుటుంబాలకు మాత్రమే నష్టపరిహారం అందించి చేతులు దులుపుకుంది. అది కూడా ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షలు మాత్రమే ఇచ్చారు. ప్రతిపక్ష నేత హోదాలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన పాదయాత్రలో నిరాదరణకు గురైన కుటుంబాల గోడు విన్న వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన నెల వ్యవధిలోనే ఆ కుటుంబాలకు న్యాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా బుధవారం కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆదేశాలు జారీ చేశారు. డీసీఆర్బీ లెక్కలను బయటపెట్టి నిజంగా ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతుల కుటుంబాల వద్దకు ఎమ్మెల్యేలతో కలిసి వెళ్లి వారికి అండగా ఉంటామనే భరోసా కల్పించి రూ.7 లక్షల చొప్పు న నష్ట పరిహారం అందించాలని ఆదేశాలు ఇచ్చా రు. దీంతో గత ప్రభుత్వ హయాంలో జరిగిన రైతుల ఆత్మహత్యలపై ఆర్డీ, డీఎస్పీ స్థాయి అధి కారులతో కమిటీ ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కలెక్టర్ పోలా భాస్కర్ నిర్ణయించారు. డీసీఆర్బీ లెక్కల ఆధారంగా విచారణ చేపట్టాలని భావిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో వేగంగా ఈ ప్రక్రియను పూర్తి చేసి నిజంగా అప్పుల బాధతో ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలను గుర్తించి న్యాయం చేయాలని నిర్ణయించారు. సీఎం నిర్ణయంపై రైతు సంఘాల నాయకులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. రైతు సంఘాల నేతలు ఆందోళనలు చేసినా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని, అడగకుండానే వారి ఇబ్బందులు గ్రహించి రైతుల కుటుంబాలను ఆదుకోవాలని చూడటం నిజంగా అభినందనీయమనే అభిప్రాయంలో ఉన్నారు. న్యాయం చేయమంటే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు.. జిల్లాలోని కొత్తపట్నం మండలం గాదెపాలెం గ్రామానికి చెందిన పొగాకు రైతు వెంకట్రామిరెడ్డి 2015లో అప్పుల బాధతో బలవన్మరణానికి పాల్పడితే ఆ కుటుంబానికి న్యాయం చేయాలంటూ పొగాకు బోర్డు ఎదుట అతని మృతదేహంతో ధర్నా చేపట్టిన రైతు సంఘాల నేతలు, మాపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి రైతులకు న్యాయం చేసే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.7 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం హర్షణీయం. – మారెడ్డి సుబ్బారెడ్డి, వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు గత ప్రభుత్వం లెక్కల తక్కువ చేసి చూపే యత్నం చేసింది.. గత ప్రభుత్వం రైతుల ఆత్మహత్యలను తక్కువ చేసి చూపించేందుకు పోలీసులపై సైతం ఒత్తిడి తెచ్చింది. దీని వల్ల రైతుల కుటుంబాలు సర్వ నాశనమయ్యాయి. బలవన్మరణాలకు పాల్పడిన రైతు కుటుంబాలకు న్యాయం చేయాలని సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం అభినందనీయం. ప్రస్తుత ప్రభుత్వం రైతుల సంక్షేమానికి తీసుకుంటున్న నిర్ణయాల వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి లేకుండా చేస్తుంది. – చుండూరి రంగారావు, జిల్లా అభివృద్ధి వేదిక అధ్యక్షుడు -
జీవితం దుర్భరమైనా కనికరం లేదాయె!
వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చేమార్గం లేక ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలు దుర్భర జీవితాన్ని గడుపుతున్నా రాష్ట్ర ప్రభుత్వం కనికరం చూపడంలేదు. ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకుంటామని నేతలు చెబుతున్నా క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదు. ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమర్రి మండలం శెట్టివీడు గ్రామానికి చెందిన గంగన్న(38) అనే రైతు అప్పులు తీర్చే దారి లేక ఈ ఏడాది ఆగస్టు 10న తన ఇంటిలోని పైకప్పుకు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు, గంగన్నకు రెండు ఎకరాల పొలం ఉంది. మరో మూడు ఎకరాలను కౌలుకు తీసుకొని పసుపు, మిర్చి పంటలను సాగు చేశాడు. వర్షాభావంతో ఐదేళ్లుగా పంటలు సక్రమంగా పండడం లేదు. అయితే వ్యవసాయ పెట్టుబడుల కోసం ఆయన చేసిన అప్పులు మాత్రం రూ. తొమ్మిది లక్షలకు చేరాయి. ఇందులో రూ. లక్ష బ్యాంకు అప్పు కాగా, మిగతావి ప్రైవేటు అప్పులు. అయినా, రైతు ఉపశమన పథకం కింద ఒక్క రూపాయి రుణం కూడా మాఫీ కాలేదు. అప్పులకు వడ్డీలు పెరిగిపోవడంతో మానసిక క్షోభతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుడికి భార్య లక్ష్మీదేవి, ఇద్దరు కుమారులు ఉన్నారు. గణేష్ ఏడో తరగతి, గౌతం ఐదో∙తరగతి చదువుతున్నారు. లక్ష్మీదేవి కూలి పనులకు వెళ్లి పిల్లలను చదివిస్తోంది. ఇద్దరు పిల్లలను చదివించుకునేందుకు నానా ఇబ్బందులు పడాల్సి వస్తున్నదని ఆమె తెలిపారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదన్నారు. – ఎం. ఖాదర్‌బాష, సాక్షి, చాగలమర్రి, కర్నూలు జిల్లా -
ఆ వడ్డీ రేట్లను కోర్టులు పరిశీలించవచ్చు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్న వేళ సుప్రీంకోర్టు శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. రుణవిముక్తి చట్టం అమల్లో ఉన్న రాష్ట్రాల్లో బ్యాంకులు రైతులకిచ్చే రుణాలపై వడ్డీ రేటును పరిశీలించే అధికారం న్యాయస్థానాలకు ఉంటుందని కోర్టు తేల్చింది. బ్యాంకులు ప్రజలకిచ్చే రుణాలపై వడ్డీ అధికంగా ఉందంటూ ఏ కోర్టులూ విచారణ జరపరాదని బ్యాంకింగ్ నియంత్రణ చట్టం–1949లోని సెక్షన్ 21ఏ చెబుతోంది. రైతుల రుణాలు రాష్ట్ర జాబితాలోని అంశమనీ, దీంట్లో జోక్యం చేసుకునే అధికారం కోర్టులకు ఉంటుందని సుప్రీం తేల్చింది. -
రాష్ట్ర ఏర్పాటు తేదీ నుంచి పరిహారమిస్తాం
-
రాష్ట్ర ఏర్పాటు తేదీ నుంచి పరిహారమిస్తాం
- ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు వర్తింపచేస్తామని ప్రభుత్వం ప్రకటన - రుణమాఫీలో మిగిలిన 50 శాతం ఒకేసారి చెల్లిస్తాం: పోచారం - రెండేళ్ల అనావృష్టి కారణంగానే రైతుల్లో నిస్సహాయత - రాష్ట్రంలో సగానికిపైగా పంటలు దెబ్బతిన్నాయి - భూగర్భ జలాలు దారుణంగా పడిపోయాయి - అస్తవ్యస్త విద్యుత్ సరఫరా, సాగునీటిపై నిర్లక్ష్యంతోనే ఈ దుస్థితి - రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టామని వెల్లడి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన గతేడాది జూన్ రెండో తేదీ నుంచి ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలన్నింటికీ పెంచిన పరిహారాన్ని వర్తింపజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక రైతుల రుణమాఫీలో మిగిలిన యాభై శాతం సొమ్మును ఒకేసారి విడుదల చేస్తామని తెలిపింది. వర్షాభావం, రైతుల సంక్షేమం, ప్రభుత్వం చేపట్టిన చర్యలపై మంగళవారం శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఈ ప్రకటన చేశారు. రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వం ఆందోళన చెందుతోందని మంత్రి పేర్కొన్నారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం సాధ్యమైనన్ని చర్యలు చేపడుతున్నందున ఆత్మహత్యలనే విపరీత చర్యలకు పాల్పడవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. రూ.8,336 కోట్ల రుణమాఫీ నిధులను విడుదల చేయడంతో పాటు విత్తనాలు, ఎరువుల బఫర్ నిల్వలను అందుబాటులో ఉంచడం, అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయడం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి చెప్పారు. రైతుల సంక్షేమం దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నా... రెండేళ్లుగా నెలకొన్న అనావృష్టి, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా రైతులు నిస్సహాయతతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తికాకపోవడం, భూగర్భ జలాలు అసాధారణంగా తగ్గిపోవడం, ఎక్కువ సంఖ్యలో బోరు బావులు వేయడం, చిన్నతరహా సాగునీటి వనరులు, చెరువుల అభివృద్ధిని దశాబ్దాలుగా పట్టించుకోకపోవడం, గతంలో అస్తవ్యస్త విద్యుత్ సరఫరా రైతుల నిస్సహాయతకు కారణమన్నారు. ‘‘ఖరీఫ్‌లో సాధారణ రుతుపవనాల ఆగమనం జూన్ 13 నుంచి ఆరంభమైంది. దాంతో అన్ని జిల్లాల్లో వర్షాధార పంటలు వేశారు. కానీ తొలకరి అనంతరం 25 రోజులు వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. 66 శాతం లోటుతో ఎర్రరేగడి భూముల్లో పంటలు దెబ్బతిన్నాయి. తిరిగి ఆగస్టు, సెప్టెంబర్‌లో వర్షాలు కురవడంతో లోటు 14శాతానికి తగ్గింది. 35.13 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. సాధారణ విస్తీర్ణం 41.43 లక్షల హెక్టార్లతో పోలిస్తే ఇది 85 శాతం. నాట్లు వేసిన మొత్తం విస్తీర్ణంలో 26.03 లక్షల హెక్టార్లు వర్షాధారం కింద, 9.1 లక్షల హెక్టార్లు సాగునీటి వనరుల కింద ఉన్నాయి..’’ అని మంత్రి వివరించారు. ఆదిలాబాద్, ఖమ్మం, జనగామ రెవెన్యూ డివిజన్ మినహా వరంగల్ జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదుకాగా... కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో అనావృష్టితో 50 శాతం మేరకు పంటలు ప్రభావితమయ్యాయని చెప్పారు. నిజామాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని చాలా మండలాల్లో వ ర్షపాతం లోటుతో 75 శాతం మేరకు పంటలు దెబ్బతిన్నాయన్నారు. నల్లరేగడి భూముల్లో వేసిన పంటలు మాత్రమే నిలదొక్కుకున్నాయని తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లాలో వర్షపాతం అత్యల్పంగా ఉండటంతో నూటికి నూరు శాతం పంట నష్టం వాటిల్లిందన్నారు. -
'కుటుంబ కలహాలతోనే రైతుల ఆత్మహత్యలు'
తూర్పుగోదావరి(మలికిపురం): తమ ప్రభుత్వం వచ్చాక రాష్ర్టంలో అప్పులు, పంట నష్టాల వల్ల ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ఆయన మాట్లాడుతూ...కొందరు రైతులు కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్యలకు పాల్పడితే, వారు సాగు అప్పుల కారణంగా చనిపోయినట్టు చిత్రిస్తున్నారని ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా మలికిపురంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్నరైతు భరోసా యాత్రవల్ల రైతులకు ఒరిగేదేమీ ఉండదన్నారు. విభజన చట్టంలో హామీ ఇచ్చినట్టుగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందిగా కేంద్రంతో పోరాడుతామని రాజప్ప అన్నారు. ప్రత్యేక హోదా కోసం అసెంబ్లీలో అన్ని పార్టీలూ తీర్మానం చేయాల్సి ఉందని, అలాగే ఇతర రాష్ట్రాల మద్దతు కూడా అవసరమని చెప్పారు. ప్రత్యేక హోదా ఇవ్వకున్నా, కేంద్రం ఎక్కువ నిధులు ఇస్తే అభివృద్ధి సాధ్యపడుతుందని చినరాజప్ప చెప్పారు. -
ఆగని అన్నదాత మృత్యుఘోష
జిల్లాలో అన్నదాత ఆక్రందన ఆగడం లేదు. ప్రకృతి ప్రకోపంతో కొందరు, పాలకుల వైఖరితో మరికొందరు, బ్యాంకుల నోటీసుల అవమానాలతో ఇంకొందరు మనస్తాపానికి గురై నేలకొరుగుతున్నారు. బతకడానికి దారులు మూసుకుపోవడంతో చావులో ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఇప్పటికే జిల్లాలో ఐదుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మరో విషాదం: గిద్దలూరు మండలం బురుజుపల్లె గ్రామానికి చెందిన యరముల వెంకటరెడ్డి (50) పురుగుమందుకు బలైపోయాడు. వెంకటరెడ్డి తనకున్న పదమూడెకరాల పొలంలో వరి, మొక్కజొన్న, పత్తి పంటల్ని సాగు చేశారు. బోర్లను నమ్ముకుని వ్యవసాయం చేశాడు. ప్రకృతి కరుణించడంతో ఇల్లు కూడా కట్టుకున్నాడు. పొలంలో వేసిన బోర్లలో నీరు తగ్గిపోవడం, పంటలు ఎండిపోతుండటం, మరోవైపు అప్పులు 30 లక్షలు దాటిపోవడంతో పొలానికి పిచికారీ చేసే పురుగుమందు తీసుకుని చనిపోయాడు. జనవరి17న: యద్దనపూడి గ్రామానికి చెందిన రైతు గొట్టిపాటి ఆదియ్య పురుగుమందు తాగి చనిపోయాడు. రైతు కాస్తా కౌలు రైతుగా మారిన ఆదియ్య వ్యవసాయంపై మక్కువ తీరక, వేరే ఉపాధి లేక ఆరెకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని పంటలు సాగు చేస్తూ వచ్చాడు, గత ఏడాది శనగ సాగు చేసి గిట్టుబాటు ధర లేకపోవడంతో తక్కువ రేటుకు అమ్ముకుని నష్టపోయాడు. ఈ ఏడాది మళ్లీ పత్తి సాగు చేశాడు. దీని కోసం కుమార్టె బంగారం తాకట్టు పెట్టి అప్పు తెచ్చాడు. ఈ ఏడాది పత్తి పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం, దిగుబడులు కూడా తగ్గడంతో ఆందోళనతో ఉన్న ఆదియ్య, రుణం చెల్లించాలని బ్యాంకు నోటీసులు రావడంతో పురుగుమందును ఆశ్రయించాడు. సెప్టెంబరు 23న: పర్చూరు నియోజకవర్గం మార్టూరు మండలం కోలలపూడి గ్రామానికి చెందిన దాసరి లక్ష్మీనారాయణ గత ఏడాది సెప్టెంబర్ 23న పొలంలో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన తనకు ఉన్న కొద్దిపాటి భూమితోపాటు కౌలు సాగు చేస్తుంటాడు. ఇతనికి సొంతపొలం ఎకరం 38 సెంట్లుండగా, నాలుగెకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. తన సొంత భూమిలో రూ.20 పెట్టుబడితో గోరుచిక్కుడు సాగు చేయగా తెగుళ్లు సోకి పంట చేతికి రాలేదు. నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకున్నా వర్షాలు లేకపోవడంతో ఎకరంన్నరలోనే వరి వేశాడు. కౌలు పొలంలో ఎకరంన్నర సాగు చేసిన వరి నీరు సకాలంలో అందక ఎండుముఖం పట్టింది. అప్పటికే 25 వేలు ఖర్చు చే శాడు. మిగిలిన రెండున్నర ఎకరాలలో వర్షాలు సక్రమంగా సాగు చేయలేదు. దీంతో గతంలో ఉన్న అప్పులతోపాటు సాగు సక్రమంగా లేక రైతు ఆత్యహత్య చేసుకున్నాడు. నవంబరు 28న: యద్దనపూడి మండలంలోని చిమటవారిపాలెం గ్రామానికి చెందిన రైతు గనిపిశెట్టి వెంకట్రావు(52) గత ఏడాది నవంబర్ నెల 28న పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకొన్నాడు. రుణమాఫీ అవుతుందో లేదో తెలియక బ్యాంకులో పాసు పుస్తకాలుపై తీసుకున్న అప్పు బ్యాంకులు నోటీసులివ్వడంతో ఒన్‌టైమ్ సైటిల్ మెంట్‌కు దరఖాస్తు చేశాడు. మొత్తం లక్షా 80 వేల వరకూ బకాయి ఉండగా 96 వేల రూపాయలు వన్‌టైమ్ సెటిల్మెంట్ చేసుకున్నాడు. అప్పు తెచ్చి రూ.95 వేలు బ్యాంకులో జమచేశాడు. డబ్బులు కట్టిన తర్వాత కూడా పాస్‌పుస్తకాలు ఇవ్వకుండా బ్యాంకు అధికారులు తిప్పకున్నారు. పట్టాదారు పుస్తకాలు ఇవ్వాలని కోరినా బ్యాంకర్లు సకాలంలో ఇవ్వకపోవడంతో అవమానంగా భావించాడు. మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటునట్లు లేఖరాసి ప్రాణాలు తీసుకున్నాడు. రుణమాఫీ కాకపోవడం, బ్యాంకు అధికారుల ఒత్తిడి ఫలితంగా పొన్నలూరు మండలం భోగనంపాడు గ్రామానికి చెందిన రైతు కరేటి వెంకటేశ్వర్లు గుండెపోటుతో మృతి చెందాడు. తన భార్య పేరుతో బంగారం తాకట్టు పెట్టి రెండు విడతలుగా రుణం తెచ్చుకున్నాడు. మొదటి విడత తెచ్చిన రుణం పూర్తిగా చెల్లించినా రెండో విడత రుణం కట్టమని బ్యాంకు అధికారులు నోటీసులు పంపించారు. డబ్బు చెల్లించకపోతే బంగారం వేలం వేస్తామని బ్యాంకు అధికారులు నోటీసులు ఇవ్వడంతో మనస్థాపానికి గురై గుండెపోటుతో మరణించాడు.