
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం తన క్యాంపు కార్యాలయంలో పరిశ్రమల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఉన్న పోర్టులు, కొత్త పోర్టుల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలపై ఈ సమావేశంలో సీఎం జగన్ సమీక్షించారు. దుగ్గజరాజపట్నం, రామాయపట్నం, మచిలీపట్నం, నక్కపల్లి, కళింగపట్నం, భావనపాడు పోర్టుల నిర్మాణంపై ప్రణాళికల తయారు చేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. మొదటి దఫాలో భావనపాడు, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని, మచిలీపట్నం పోర్టును వీలైనంత వేగంగా కట్టడానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు.
ఈ పోర్టుకు ఇప్పటికే భూమి అందుబాటులో ఉందని, ఇక, మిగిలిన పోర్టులకు అవసరమైన భూమిని వెంటనే సేకరించుకోవాలని సూచించారు. వచ్చే జూన్ నాటికి మచిలీపట్నం పోర్టుకు, రామాయపట్నం పోర్టుకు ఫైనాన్షియల్ క్లోజర్ ప్రక్రియలను పూర్తిచేస్తామని అధికారులు సీఎంకు తెలిపారు. వచ్చే మే-జూన్ నాటికి ఈ రెండు పోర్టులకూ శంకుస్థాపన చేయాలన్నారు. విభజన చట్టం ప్రకారం పోర్టును నిర్మించి ఇస్తానని కేంద్రం చెప్పిందని, ఆ మేరకు నిధులను కేంద్రం నుంచి తెచ్చుకునేలా చర్యలు చేపట్టాలని వివరించారు.
ఈ సందర్భంగా అధికారులతో జరిగిన చర్చలో ప్రభుత్వ ప్రాధాన్యతలను సీఎం వైఎస్ జగన్ వివరించారు. ‘ఎవరైనా మీ ప్రాధాన్యతలు ఏంటని అడిగితే నా తొలి ప్రాధాన్యత నవరత్నాలు, నాడు-నేడు కార్యక్రమం అని చెప్తా. ఆ తర్వాత ఇళ్ల నిర్మాణం.. ప్రతి ఏటా ఆరు లక్షల ఇళ్లు నిర్మించడం రెండో ప్రాధాన్యత అంశం. రాయలసీమ ప్రాజెక్టులకు జలాలు వెళ్తున్న కాల్వల విస్తరణ చేపట్టడం మూడో ప్రాధాన్యత అంశం’ అని సీఎం తెలిపారు. పోలవరం ఎడమ కాలువకు సంబంధించిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు చేపట్టడం, పోలవరం నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్ అక్కడనుంచి బనకచర్లకు గోదావరి జలాలు తరలించడం, ప్రతి జిల్లాకు తాగునీటిని అందించాలన్న వాటర్ గ్రిడ్ చేపట్టడం.. ఇవి తన ఇతర వరుస ప్రాధాన్యత అంశాలని, ఈ కార్యక్రమాల వల్ల అత్యధిక ప్రజలు ఆధారపడ్డ వ్యవసారంగంలో స్థిరత్వం ఉంటుందని, అలాగే కరవు ప్రాంతాలకు ఊరట లభిస్తుందని వివరించారు.
నవరత్నాలు కార్యక్రమాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని, పేదలు, మధ్యతరగతి ప్రజల జీవితాలకు భరోసా లభిస్తుందని చెప్పారు. విద్యుత్ సంస్కరణల అంశంపై కూడా ఈ సమావేశంలో సీఎం జగన్ చర్చించారు. ప్రతి ఏటా విద్యుత్ సబ్సిడీల రూపంలో సుమారు రూ.10 వేల కోట్లు ట్రాన్స్‌కోకు చెల్లిస్తున్నామని, ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వమే 12వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను ట్రాన్స్‌కోకు ఇస్తే సరిపోతుందని తెలిపారు. సుమారు రూ. 35-37వేల కోట్ల ఖర్చుతో 12వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందన్నారు. అంటే మూడు, నాలుగు సంవత్సరాల్లో ట్రాన్స్‌కోకు ఇస్తున్న సబ్సిడీ డబ్బుతో 12వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని, ఈ దిశగా ఆలోచనలు చేయాలని అధికారులకు సీఎం సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment