
సాక్షి, అమరావతి : ఎంఎస్‌ఎంఈలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఎంఎస్‌ఎంఈల్లో ఎంతమంది పనిచేస్తున్నారు, కరోనా వైరస్ వల్ల వాటిపై ఏ మేరకు ప్రభావం పడిందన్న దానిపై సమీక్షించారు. ఎంఎస్‌ఎంఈల కోసం తీసుకోవాల్సిన చర్యలను అధికారులకు సూచించారు. వాటి పునరుద్ధరణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఒక సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం గ్రీన్ క్లస్టర్‌లో ఉన్న పరిశ్రమలు కోవిడ్ –19 నివారణ చర్యలు తీసుకుంటూనే తమ కార్యకలాపాలను ముందుకు కొనసాగించేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
అంతకు ముందు రాష్ట్రంలో తయారైన ఇన్ ఫ్రా రెడ్ నాన్ కాంటాక్ట్ ఫోర్ హెడ్ ధర్మామీటర్, ప్రొటెక్టివ్ ఫేస్ మాస్క్‌లను సీఎం జగన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, పరిశ్రమలశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ ఇతర అధికారులు పాల్గొన్నారు.