పరిశ్రమలకు రెండో విడత బకాయిలు విడుదల  | CM Jagan Released 2nd tranche of Rs 512 Crore To Pending Incentives of MSMEs | Sakshi
Sakshi News home page

రెండో విడత బకాయిలు విడుదల 

Published Mon, Jun 29 2020 12:09 PM | Last Updated on Mon, Jun 29 2020 4:48 PM

CM Jagan Released 2nd tranche of Rs 512 Crore To Pending Incentives of MSMEs - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా విపత్తు సమయంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు రూ.1,168 కోట్లతో రీస్టార్ట్‌ ప్యాకేజీని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత రాయితీ బకాయిలను సోమవారం విడుదల చేసింది. రిస్టార్ట్‌ ప్యాకేజీలో భాగంగా మే నెలలో రూ.450 కోట్లను మే నెలలో విడుదల చేయగా, ఈ రోజు రూ.512 కోట్లను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేశారు. దాదాపు లక్ష సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు 2014–15 నుంచి గత సర్కారు రూ.827.5 కోట్ల మేర బకాయిలు పెట్టింది. టీడీపీ సర్కారు బకాయిలతో పాటు ఈ ఏడాది రాయితీలు కూడా కలిపి రూ.962.62 కోట్లను రెండు విడతలుగా చెల్లించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా మే నెలలో తొలివిడతగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.450.27 కోట్లను విడుదల చేశారు. మిగతా బకాయిలను జూన్‌ 29వ తేదీన విడుదల చేస్తామని అదే రోజు ఆయన ప్రకటించారు. అందుకు అనుగుణంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రెండో విడత బకాయిలను సోమవారం సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ విడుదల చేశారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. చిన్న పరిశ్రమలకు తోడుగా ఉంటేనే వారి కాళ్లమీద వాళ్లు నిలబడటంతో పాటు కొంతమందికి ఉద్యోగాలు ఇవ్వగల్గుతారని పేర్కొన్నారు. వ్యవసాయరంగం తర్వాత ఉపాధి కల్పించే రంగం ఎంఎస్‌ఎంఈలదే అని సీఎం అన్నారు. గత ప్రభుత్వం రూ.800 కోట్లను బకాయిలుగా పెట్టిందని, వాటన్నింటిని తమ ప్రభుత్వం క్లియర్‌ చేసిందన్నారు. కరోనా వల్ల పరిశ్రమలు నడపలేని పరిస్థితుల్లో వెసులుబాటు ఇచ్చేందుకు ఏప్రిల్, మే, జూన్‌ మాసాల్లో కరెంటు ఫిక్స్‌డ్‌ ఛార్జీలు రూ.180 కోట్లు మాఫీ చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఏపీఎస్‌ఎఫ్‌సీ ద్వారా రూ.200 కోట్లతో పెట్టుబడి రుణాలను తక్కువ వడ్డీకే అందిస్తున్నామని చెప్పారు.

రుణాలకు 6 నెలల మారటోరియంతో పాటు మూడేళ్ల కాలపరిమితిలో చెల్లించే అవకాశం కల్పించామని చెప్పారు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల నుంచి 25శాతం ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సీఎం జగన్‌ వెల్లడించారు. స్పిన్నింగ్‌ మిల్లులకు సబంధించిన రూ.1000 కోట్ల బకాయిలను వచ్చే ఏడాదిలో చెల్లిస్తామన్నారు.ఎంఎస్‌ఈలకు సంబంధించి బాగోగులు చూసేందుకు ఓ జేసిని పెడుతామన్నారు. పనుల కోసం అధికారుల చుట్టూ తిరినే పరిస్థితి రాకుండా చూస్తామన్నారు. ఎంఎస్‌ఈల పనులపై జేసీలు దృష్టిపెట్టేలా కలెక్టర్లులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులు వీరికి చేయూత నిచ్చేలా పనిచేయాలని, అప్పుడే నలుగురికి ఉద్యోగాలు వస్తాయని సీఎం జగన్‌ వ్యాఖ్యానించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement