
సాక్షి,అమరావతి: కోవిడ్–19 (కరోనా వైరస్) వ్యాప్తి నివారణా చర్యల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సూచించిన ప్రకారం ఆదివారం రోజు ‘జనతా కర్ఫ్యూ’కు సంఘీభావం ప్రకటిద్దామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మార్చి 22న ప్రజలంతా స్వచ్ఛందంగా ‘జనతా కర్ఫ్యూ’ పాటించాలని సీఎం కోరారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలెవరూ ఇంటి నుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు.
- ప్రధాని సూచించినట్లుగా ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో ప్రజలంతా ఇళ్ల బాల్కనీలు, ద్వారాల వద్దకు వచ్చి కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు విశేషంగా సేవలందిస్తున్న సిబ్బందికి మద్దతుగా 5 నిమిషాల సేపు నిలబడి చప్పట్లు, గంటలు మోగిస్తూ సంఘీభావం తెలియ చేయాలి. దీనికి సంకేతంగా సాయంత్రం 5 గంటల సమయంలో అధికారులు సైరన్ మోగిస్తారని, దీనికి అంతా సమాయత్తంగా ఉండాలని సీఎం కోరారు.
- ఆదివారం రోజు ప్రయాణాలు, పనులు రద్దు చేసుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. పోలీసులు, వైద్య సిబ్బంది, మెడికల్ సర్వీసులు, విద్యుత్తు, అగ్నిమాపక సిబ్బంది, పాలు లాంటి నిత్యావసర వస్తువులు, ఎమర్జెన్సీ సర్వీసులు తప్ప మిగతా వాటిని జనతా కర్ఫ్యూకు సంఘీభావంగా స్వచ్ఛందంగా నిలిపి వేయాలని కోరారు.
- కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా సామాజిక దూరాన్ని పాటించేందుకు జనతా కర్ఫ్యూ దోహదపడుతుందని సీఎం పేర్కొన్నారు. ఇది ఒక ప్రారంభంగా భావించి కరోనా మహమ్మారి నివారణకు తీసుకునే ఎలాంటి చర్యలకైనా ఆంధ్రప్రదేశ్ ముందు ఉంటుందని చాటుదామని ఆయన పేర్కొన్నారు.
కలసికట్టుగా పోరాడదాం
అనిశ్చితి చాలా ఎక్కువగా ఉండవచ్చు. కానీ మనమంతా దృఢ సంకల్పంతో కలసికట్టుగా కరోనాపై పోరాడదాం. అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు పాటించడం మీకు, మీ చుట్టూ ఉన్నవారికి అవసరం. ఈ మహమ్మారిపై పోరాడుతున్న ఆరోగ్య రంగ నిపుణులకు కృతజ్ఞతలు తెలియచేద్దాం. భయపడవద్దని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. వైరస్‌ను నియంత్రించి వ్యాప్తి చెందకుండా నిరోధించేందుకు మేం పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నాం. ప్రధాని మోదీ పిలుపుమేరకు ఆదివారం రోజు ‘జనతా కర్ఫ్యూ’ను పాటించి మనమంతా సంఘీభావం తెలియచేద్దాం
– ట్విట్టర్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment