కోవిడ్ 19 నివారణ చర్యలపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంగళవారం సమీక్ష చేస్తున్న సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్–19 పరీక్షలు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రధానంగా రెడ్‌జోన్లు, కంటైన్‌మెంట్ జోన్లలో పరీక్షలపై దృష్టి సారించిన అధికారులు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 80,334 కోవిడ్–19 పరీక్షలు నిర్వహించామని, ప్రతి 10 లక్షల జనాభాకు 1,504 చొప్పున పరీక్షలు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. దేశంలోనే అత్యధిక సగటుతో పరీక్షలు నిర్వహిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందని వెల్లడించారు. కోవిడ్–19 నివారణ చర్యలు, పంటల మార్కెటింగ్, రొయ్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ..
జాతీయ సగటు కంటే అతి తక్కువగా ఏపీలో పాజిటివ్ కేసులు..
► దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సగటు 4.13 శాతం కాగా ఏపీలో చాలా తక్కువగా 1.57 శాతం మాత్రమే. మరణాల రేటు దేశంలో 3.19 శాతం కాగా ఏపీలో 2.46 శాతం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ కేసులన్నీ కంటైన్‌మెంట్ జోన్లనుంచే వస్తున్నాయన్నారు. శ్రీకాకుళం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ల్యాబ్‌లు సిద్ధం అవుతుండగా విజయనగరం, పశ్చిమ గోదావరిలో వీటి ఏర్పాటుపై దృష్టి సారించారు.
► టెలిమెడిసిన్‌లో భాగంగా వైద్యం పొందుతున్న వారికి మందుల సరఫరా విధానం సమర్థంగా ఉండాలని సీఎం జగన్ సూచించారు. అందుబాటులో ఉన్న
సాంకేతిక పరిజ్ఞానాన్ని దీనికి వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు.
పంటల మార్కెటింగ్, ధరలపై సీఎం సమీక్ష
► రాష్ట్రంలో వివిధ పంటల మార్కెటింగ్, ధరలపై సీఎం సమీక్షించారు. మొక్కజొన్న, శనగలు, ధాన్యం కొనుగోళ్లపై ఆరా తీశారు. బత్తాయి, అరటి రైతుల సమస్యలపై చర్చించారు. ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు రవాణా, మార్కెట్ల పరిస్థితి, విక్రయాలు, ధరల వివరాలతో రోజూ సమీక్షకు హాజరు కావాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులన్నీ బయట రాష్ట్రాలకు ఎగుమతులపై ఆధారపడి ఉన్నందున దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
రొయ్య పిల్లల కొరతపై చర్యలు చేపట్టాలి
► అంతర్జాతీయ పరిణామాల దృష్ట్యా తల్లి రొయ్యలు, రొయ్య పిల్లల కొరతపై తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి మోపిదేవికి సీఎం సూచించారు. సీఎం ఆదేశాల మేరకు చేపట్టిన చర్యలతో అగ్రి ప్రాసెసింగ్‌లో సమస్యలు తొలగినట్లు అధికారులు తెలిపారు. రైతులకు ఎక్కడ ఇబ్బంది తలెత్తినా వెంటనే స్పందించి ఆదుకోవాలని సీఎం మరోసారి స్పష్టం చేశారు.
► సమీక్షలో మంత్రి మోపిదేవి వెంకటరమణారావు, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్ పాల్గొన్నారు. కోవిడ్–19 పరీక్షల వివరాలను వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందచేశారు.
పరీక్షల్లో ఫస్ట్..
గత 24 గంటల్లో ఏపీలో 82 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకూ 80,334 మందికి పరీక్షలు నిర్వహించారు. ప్రతి 10 లక్షల మంది జనాభాకు సగటున 1,504 పరీక్షలు జరుగుతున్నాయి. దేశంలోనే అత్యధిక సగటుతో పరీక్షలు నిర్వహిస్తూ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment